Pulwama Attack: ఆత్మహత్యకు అనుమతి కోరిన 2019 పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల భార్యలు
2019లో పుల్వామా దాడి ఘటనలో 40 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. పుల్వామా దాడి జరిగి మూడేళ్లు గడిచినా అమరులైన జవాన్ల భార్యలకు ఇంత వరకు పరిహారం అందకపోవడం విచారకరం. ఈ క్రమంలో..

2019 పుల్వామా దాడి ఘటనలో 40 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. పుల్వామా దాడి జరిగి మూడేళ్లు గడిచినా అమరులైన జవాన్ల భార్యలకు ఇంత వరకు పరిహారం అందకపోవడం విచారకరం. ఈ క్రమంలో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల భార్యలు, కుటుంబ సభ్యులు రాజ్‌భవన్‌కు వెళ్లి మధ్యప్రదేశ్ రాజస్థాన్ గవర్నర్ కల్రామ్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. తాము ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో చావడం తప్ప తమకు మరో మార్గం లేదంటూ వారు వాపోయారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, తమ భర్తల పేరిట స్మారకాలు నిర్మిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఐతే పోలీసులు వారిని లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు అమర జవాన్ల భార్యలను తోసివేయడంతో వీర జవాన్ రోహితాశవ్ లాంబా భార్య అయిన మంజు గాయపడినట్లు మరో జవాన్ భార్య ఆరోపించారు. కాగా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొన్ని రోజులుగా వీర జవాన్ల భార్యలు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ స్పందిస్తూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాల డిమాండ్లను నెరవేర్చడానికి బదులు వారితో దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపించింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.