AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ తండ్రి ఆశయం కోసం..

పుట్టెడు దుఃఖంలోనూ తండ్రి ఆశయం కోసం పదో తరగతి పరీక్షకు హాజరైంది ఆ యువతి. పంటి బిగువున పుట్టెడు దుఃఖాన్ని అదిమి పెట్టుకుని పరీక్షలు రాస్తోంది. తండ్రితో పాటు టెన్త్ హాల్ టికెట్ పట్టుకొని సింహాచలం దైవ దర్శనానికి వెళ్తుండగా.. BHPV హైవేపై లారీ భీభత్సం సృష్టించిన ఘటనలో తండ్రి రామకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం నుంచి అనుపమ తృటిలో తప్పించుకుంది.

Andhra Pradesh: అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ తండ్రి ఆశయం కోసం..
Father Dies In Vizag Road Accident
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 17, 2026 | 11:02 AM

Share

విశాఖ గాజువాకలో ఆదివారం ట్రైలర్ సృష్టించిన బీభత్సం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన కోరాడ రామకృష్ణ.. ఆటోమోటివ్ కంపెనీలో సూపర్వైజ‌ర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయాన్నే తండ్రి కూతుర్లు ఇద్దరు సింహాచలం వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. ఇద్దరూ బైక్ పై బయలుదేరారు. బీహెచ్పీవీ హైవే జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆగారు. అదే సమయంలో గంగవరం పోర్ట్ నుంచి మెటీరియల్‌తో వెళ్తున్న లారీ.. ఒక్కసారిగా వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. అప్పటికే ఆగి ఉన్న మూడు టూ వీలర్లతో పాటు ఎన్నోవాను ఢీకొని 100 మీటర్ల దూరం వరకు వెళ్లి ఆగింది. ఈ ఘటనలో టూ వీలర్‌పై ఉన్న రామకృష్ణ కూతురు అనుపమ ఎడమవైపు తూలి పడిపోయింది. రామకృష్ణ కుడి వైపు పడడంతో.. అతనిపై నుంచి లారీ వెళ్ళిపోయింది. లారీ చక్రాల కింద నలిగి రామకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు తనతో ప్రయాణిస్తూ మాట్లాడుతున్న తండ్రి ఒక్కసారిగా కళ్ల ముందే విగత జీవిగా మారడంతో ఆ కూతురు తట్టుకోలేకపోయింది కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ ఘటన చూసిన వారందరినీ కంటతడి పెట్టించింది.

మృతదేహాన్ని మార్చురికి తరలించారు.. పోస్టుమార్టం పూర్తయింది. రామకృష్ణ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలు ముగుశాయి. అయితే గంటల వ్యవధిలోనే.. కొండంత దుఃఖాన్ని పంటి బిగువన పెట్టుకొని టెన్త్ పరీక్షకు హాజరైంది రామకృష్ణ కూతురు అనుపమ. తన తండ్రి తమ భవిష్యత్తు కోసం కన్న కలలు నిజం చేసేందుకు ఆమె పరీక్ష రాసింది. ఎప్పుడు మార్కుల కోసం అడగని నాన్న.. తనతోపాటు బైక్పై వెళ్తూ ప్రమాదానికి గురి అయ్యే ముందు చెప్పిన కొన్ని మాటలు ఆమె జ్ఞప్తికి తెచ్చుకొని కంటతడి పెడుతుంది. బాగా చదువుకోవాలని మంచి మార్కులు తెచ్చుకోవాలని దైవ దర్శనానికి వెళ్తున్నప్పుడు నాన్న తనతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది.

నాన్న ఆశయం కోసమే..

‘‘హాల్ టికెట్ పట్టుకొని డాడీ, నేను సింహాచలం బయలుదేరాం. ప్రయాణంలో బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. గతంలో ఎప్పుడూ మార్కుల కోసం నాన్న అడగలేదు. నా కళ్ళముందే నాన్న ప్రాణాలకు కోల్పోయారు. మేము ఒక స్థాయికి ఎదగాలని నాన్న కలలు కనేవారు.. నాన్న కోసమే పరీక్ష రాశాను’’ అని రామకృష్ణ కూతురు అనుపమ చెబుతోంది.

వాళ్లకి చిన్న విషయం కావచ్చు.. కానీ మావి బతుకులు

‘‘ఇంతటి విషాదంలోనూ అన్నయ్య కూతుర్ని పరీక్షకు తీసుకొచ్చాం.. తన కెరీర్‌కి లాస్ అవ్వకూడదని పరీక్ష రాయించాం. పిల్లలు బాగా చదువుకోవాలని మా అన్నయ్య కల. ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్లకి చాలా చిన్న విషయం కావచ్చు.. కానీ ఇది మా బతుకులు. యాక్సిడెంట్ జరిగాక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని సింపుల్‌గా చెబుతున్నారు.. కానీ మీ నిర్లక్ష్యంతో కుటుంబలు రోడ్డున పడిపోతున్నాయి. భారీ వాహనాలను కొన్ని రోడ్లలో నియంత్రించాలి. అధికారులు ఇటువంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలి’’ అని రామకృష్ణ సోదరుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇటువంటి ఘటనలు తరచూ రోడ్లపై జరుగుతూనే ఉన్నాయి. సంబంధం లేని వాళ్లు ఎవరో చేసిన తప్పుకు బలైపోతున్నారు. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి బాధ్యులు ఎవరు…? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కండిషన్లో లేని వాహనాలు అనుభవము లేని డ్రైవర్లతో ప్రాణాలు తీస్తున్న వాహనాల యజమానులుదా..? లేక రద్ది ఎక్కువగా ఉన్న నగర రోడ్లపై భారీ వాహనాలు అనుమతిస్తున్న అధికారులు..? దీనికి సమాధానం దొరికినానాడే ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పడుతుంది.

Follow Us