Gas Cylinder: బుకింగ్ చేసిన ఒకటిన్నర రోజుల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. ప్రజలకు ఊరటనిచ్చిన ప్రభుత్వం
గ్యాస్ బుక్ చేసిన ఒకటిన్నర రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తాజాగా గ్యాస్ సరఫరా కంపెనీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భగంగా పలు సూచనలు చేశారు. గ్యాస్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారచు.

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల డెలివరీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత ఒకటిన్నర రోజుల్లోనే ఇంటికి డెలివరీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు బుక్ చేయగానే వెంటనే స్పందించి డెలివరీ చేయాలని, జాప్యం జరగకూడదని ఆదేశించారు. వెంటనే గ్యాస్ డెలివరీ చేయడం వల్లన ప్రజల్లో ఆందోళన ఉండదని వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో గ్యాస్ కొరత, బుకింగ్, నిల్వలపై ఏజెన్సీలతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సరఫరా కంపెనీల అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో 17,209 టన్నుల వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయని కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేశారు. 1154 ఏజెన్సీలు ఓటీపీ విధానంలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లాయి.
చంద్రబాబు కీలక ఆదేశాలు
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్టీజీఎస్ నుంచి ఏదైనా సాంకేతిక సాయం కావాలంటే గ్యాస్ సరఫరా సంస్థలకు అందిస్తామని చంద్రబాబు సూచించారు. గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో ఓటీపీని నమోదు చేయడం తప్పనిసరి, దీని వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. ఓటీపీ విషయంలో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని కోరారు. గ్యాస్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాలని, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించే విషయంపై కంపెనీలు దృష్టి పెట్టాలని సూచించారు. ఇక ఇండక్షన్ స్టవ్ అందుబాటులోకి తెచ్చే అంశాలను పరిశీలించాలని, ప్రత్యామ్నయ చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ముగిసాక కొన్ని రోజుల పాటు గ్యాస్ కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు రావొచ్చని, ఇప్పటినుంచే ప్రత్యామ్నయ చర్యలను తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఆస్పత్రులకు అపొద్దు
ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు గ్యాస్ సరఫరా ఆపేయవద్దని, నిరంతరం సరఫరా చేస్తూ ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక అన్న క్యాంటీన్లకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని, హోటళ్ల ఎల్పీజీ వినియోగం తగ్గించేలా అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలన్నారు. ఇలాంటి సమయంలో వ్యవస్థలను పటిష్టం చేయాలన్నారు.
