Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి ఎంత నష్టం..? డీఎంకే ప్లాన్ సక్సెస్ అవుతుందా..
తమిళనాడు రాజకీయం రగిలిపోతోంది. అక్కడి న్యూస్ ఛానెల్స్ నిండా ఒకటే వార్త. హిందీని రానివ్వం, ఎంపీ సీట్లు తగ్గించడానికి ఒప్పుకోం..! ఇది తప్ప మరో వార్తే లేదిప్పుడు. హిందీ భాషపై రగడ.. నివురుగప్పిన నిప్పులా ఆ సెగ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది తమిళనాడులో. కాని, ఆ నిప్పును మరోసారి రగల్చడంలో సక్సెస్ అయ్యారు సీఎం స్టాలిన్. హిందీ భాషకు నియోజకవర్గాల పునర్విభజన అనే అంశాన్ని ముడిపెట్టి ఓ ఉద్యమంగా మారుస్తున్నారు.

తమిళనాడు రాజకీయం రగిలిపోతోంది. అక్కడి న్యూస్ ఛానెల్స్ నిండా ఒకటే వార్త. హిందీని రానివ్వం, ఎంపీ సీట్లు తగ్గించడానికి ఒప్పుకోం..! ఇది తప్ప మరో వార్తే లేదిప్పుడు. హిందీ భాషపై రగడ.. నివురుగప్పిన నిప్పులా ఆ సెగ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది తమిళనాడులో. కాని, ఆ నిప్పును మరోసారి రగల్చడంలో సక్సెస్ అయ్యారు సీఎం స్టాలిన్. హిందీ భాషకు నియోజకవర్గాల పునర్విభజన అనే అంశాన్ని ముడిపెట్టి ఓ ఉద్యమంగా మారుస్తున్నారు. సీఎం స్టాలిన్.. ఓ పక్కా వ్యూహంతో చేస్తున్న రాజకీయ ఎత్తుగడ ఇది. తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గిపోతున్నాయ్, అదే జరిగితే తమిళ అస్తిత్వానికే దెబ్బ అని అరవ సెంటిమెంట్‌ను గట్టిగానే జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ‘ఆలస్యం చేసిన కొద్దీ పరిస్థితి చేయిదాటిపోద్దీ.. మార్చి 5వ తేదీన అందరం కలిసి మాట్లాడుకుందాం రండి..’ అని అక్కడి అఖిలపక్ష పార్టీలను పిలిచారు, ఈ సమావేశాన్ని సైతం విజయవంతంగా ముగించారు. సో, ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయట్లేదు. కలిసొచ్చే ఏ అవకాశాన్నీ చేజార్చుకోవట్లేదు. మరి.. ఆ అఖిలపక్ష సమావేశంలో ఏం తేల్చారు? కొత్తగా పార్టీ పెట్టిన హీరో విజయ్ సీఎం స్టాలిన్‌కు ఏ అభిప్రాయం చెప్పారు? నేరుగా ఆల్‌పార్టీ మీటింగ్‌కు వెళ్లిన హీరో కమల్‌హాసన్ ఏం చెప్పారు? ఇవన్నీ పక్కన పెడితే.. దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి రావాలని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఏంటి దాని అర్ధం? దక్షిణాది నాయకుడిగా ఎదగాలనే ప్రయత్నం కూడా జరుగుతోందా? ఆ అంశంపై డిటైల్డ్ అనాలసిస్ చదవండి..
‘అఖిలపక్ష సమావేశం పెడుతున్నాం రండి’ అని సీఎం చంద్రబాబు గనక వైఎస్ జగన్‌ను పిలిస్తే వెళ్తారా? ఊహలోనైనా సాధ్యమవుతుందా అది..! సరే, ఆ విషయం పక్కనపెడితే.. సీఎం స్టాలిన్ ఆల్‌పార్టీ మీటింగ్‌కు పిలుపునివ్వగానే ప్రధాన ప్రతిక్షం అయిన అన్నా డీఎంకే కూడా కదిలి వచ్చింది. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఎంతటి రాజకీయ వైరం ఉంటుందో దశాబ్దాలుగా చూస్తునే ఉన్నాం. అలాంటిది.. ఒకే వేదిక మీదకు వచ్చాయ్ ఆ పార్టీలు. పైగా.. కొత్తగా పార్టీ పెట్టిన హీరో విజయ్ కూడా.. తన పార్టీ ప్రతినిధిని ఆ సమావేశానికి పంపించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి సీఎం స్టాలిన్ లక్ష్యంగా, డీఎంకేను ఓడించడమే టార్గెట్‌గా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు హీరో విజయ్. స్టాలిన్‌ను విమర్శించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదలుకోవడం లేదు. అలాంటిది.. ముఖ్యమంత్రి ఆహ్వానం పంపడం ఆలస్యం.. టీవీకే పార్టీ కూడా ఆ సమావేశానికి హాజరైంది. ఈ విషయంలో సీఎం స్టాలిన్ సాధించింది మామూలు సక్సెస్ కాదు. ఎవరూ ఊహించని విజయం. నిజానికి, ఈ విజయాన్ని స్టాలిన్ ఖాతాలో వేయడానికి కూడా లేదు. ఎందుకంటే.. తమిళ సెంటిమెంట్‌కు ఉన్న బలం అలాంటిది.
ఏదైనా ఒక అంశం ఉద్యమ రూపం దాల్చితే.. దానికి మద్దతిస్తూ అన్ని పార్టీలూ కలిసి వస్తాయి. ఆమధ్య జల్లికట్టును నిషేధించాలన్నప్పుడు కూడా.. పార్టీలన్నీ తమ వైరాన్ని పక్కనపెట్టి మరీ కలిసి నడిచాయి. సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా సరే.. పార్లమెంట్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చుకునే దాకా పోరాటాలు చేశాయి అక్కడి పార్టీలు. అది కూడా.. అందరూ కలిసికట్టుగా పోరాడారు. హిందీ భాష విషయంలో తమిళులంతా ఏకతాటిపైకి వచ్చారు. ముగ్గులతో హిందీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. హిందీలో రాసి ఉన్న బోర్డులను తీసేస్తున్నారు. తమిళంపై బీజేపీకి ప్రేమ ఉంటే.. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల నుంచి హిందీని తొలగించాలని ఛాలెంజ్ చేశారు. సో, తమిళులకు, తమిళ భాషకు, తమిళ సంస్కృతికి, తమిళనాడుకు అన్యాయం జరుగుతోందని ఏమాత్రం అనిపించినా సరే.. పెద్ద ఉద్యమాలకు సిద్ధమైపోతారు. ఇప్పుడు కూడా అలాంటి ఉద్యమమే ఊపిరిపోసుకుంటోందా అని అనిపిస్తోంది తమిళ రాజకీయాలు చూస్తే.
వారం రోజుల క్రితం తమిళనాడు క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే.. మీడియాతో మాట్లాడారు సీఎం స్టాలిన్. ఆ ప్రెస్‌మీట్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తగ్గించి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకునే కుట్ర జరుగుతోందని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఒక్క తమిళనాడులో మాత్రమే ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 39 ఎంపీ స్థానాలు 31కి తగ్గొచ్చనేది సీఎం స్టాలిన్ చెబుతున్న లెక్క. అందుకే, నాగపట్నంలో డీఎంకే నేత ఇంట పెళ్లికి వెళ్లిన స్టాలిన్.. ఆలస్యం చేయకుండా పిల్లల్ని కనండి, వాళ్లకు తమిళ పేర్లు పెట్టండి అని ఆశీర్వదించి వచ్చారు.
స్టాలిన్ చెబుతున్న దాన్ని ఒక్కముక్కలో చెప్పాలంటే.. తమిళనాట ఎంపీ సీట్లు తగ్గబోతున్నాయి అని. ఎంపీ సీట్లు గనక తగ్గితే.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయన్నారు. అంతేకాదు.. రాజకీయ అవకాశాల పరంగా కూడా తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శలు గుప్పించారు. తమిళుల్లో ఆగ్రహం పుట్టించడానికి ఈ కామెంట్స్ చాలు. అక్కడి ప్రజలు కూడా ఎవరెవరు, ఎలా స్పందిస్తారని కూడా చాలా పర్టిక్యులర్‌గా చూస్తారు. అందుకే, తమిళ గౌరవాన్ని కాపాడుకుందాం రండని చెప్పగానే.. ప్రధాన పార్టీలన్నీ కలిసొచ్చాయి. తమిళనాడులో వందకు పైగా రాజకీయ పార్టీలు ఉంటే.. అందులో యాక్టివ్‌గా ఉన్నవి 64 పార్టీలు. అందులో 56 పార్టీలు హాజరయ్యాయి. 64కి 56 పార్టీలు హాజరయ్యాయంటే.. వాళ్ల మధ్య ఏ స్థాయిలో ఐక్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మక్కల్ నీరుమయం అధ్యక్షుడు కమలహాసన్ కూడా సమావేశానికి వచ్చారు.
సరే.. ఇంతకీ ఏం మాట్లాడారు ఆ సమావేశంలో. మరీ ముఖ్యంగా కేంద్రం తీరును, బీజేపీ వ్యవహరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు కమల్ హాసన్. పునర్విభజనలో 8 నియోజకవర్గాలకు కోతపెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం స్టాలిన్ మాట్లాడారు. ఇక.. హీరో విజయ్ అయితే పెద్ద స్టేట్‌మెంటే రిలీజ్ చేశారు. రాబోయే జనగణన ఆధారంగానే లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరీ ముఖ్యంగా.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గినా.. ఉత్తరప్రదేశ్, బిహార్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగినా.. ఏమాత్రం సహించేది లేదని క్లియర్ అల్టిమేటం ఇచ్చారు. కేంద్రం మాటకు కట్టుబడి.. 50 ఏళ్లుగా తమిళనాడుతో సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఒకవేళ కాదూకూడదని కొత్త జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మాత్రం.. అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఫైనల్‌గా.. అఖిలపక్ష సమావేశంలో కొన్ని కీలక తీర్మానాలు చేశారు. ఒకటి.. 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరగాలి. అలా జరిపే డీలిమిటేషన్ 30 ఏళ్ల పాటు అమల్లో ఉండాలి. రెండు.. తమిళనాడు ఎంపీలు, అఖిలపక్షంలోని పార్టీల ప్రతినిధులతో ఓ కమిటీ వేయాలి. మూడు.. దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, ఆ పార్టీలతో కలిసి కేంద్రంపై పోరాటం చేయాలి. నాలుగు.. నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు. ఐదు.. పునర్విభజన జరగడం లేదని ప్రధాని మోదీ నుంచే ప్రకటన వచ్చేలా పోరాడాలి. ఇవీ.. అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానాలు. కేవలం తీర్మానాలకే పరిమితం అయ్యేలా కనిపించడం లేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమలు చేయాలనుకుంటున్నారు. అందుకే, పునర్విభజనకు వ్యతిరేకంగా పోరాడే కమిటీలో.. ఎవరెవరు సభ్యులుగా ఉండాలన్న దానిపై వీలైనంత త్వరగా కసరత్తు మొదలుపెట్టబోతున్నారు. ఆ వెంటనే.. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించి, పార్టీల అధినేతలు, ముఖ్యనేతలతో చర్చిస్తారు. నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని అందరితో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తారు.
పైకి చూస్తే.. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగానే కనిపిస్తోంది. కాని, దక్షిణాది నాయకుడిగా సీఎం స్టాలిన్ ఎదగాలనే వ్యూహం కూడా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే.. డీలిమిటేషన్‌తో సౌత్ ఇండియా స్టేట్స్‌కు కచ్చితంగా ఎంపీ సీట్లు తగ్గుతాయని ప్రతీ రాజకీయ పార్టీ నమ్ముతోంది. కాకపోతే.. ఎవరి రాష్ట్రంలో వాళ్లు నిరసన తెలపడం తప్ప.. కలిసి పోరాటం చేయడం లేదు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్లాన్‌లో స్టాలిన్ ఉన్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్లానింగ్ బాగానే ఉంది గానీ.. అలా కలిసొచ్చే రాష్ట్రాలేవి, కలిసొచ్చే పార్టీల అధినేతలు ఎవరు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు. ఇవీ దక్షిణాది రాష్ట్రాలు. కేంద్రంపై పోరాడడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన పార్టీలేవీ కలిసి రావు. టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు స్టాలిన్‌తో కలిసి నడవవు. ఇక తెలంగాణలో.. బీఆర్ఎస్ పార్టీ కేంద్రంపై పోరాడుతోంది. కానీ, ఈ విషయంలో స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తుందా అన్నదే ప్రశ్న. సీఎం రేవంత్‌రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని బట్టే నడుచుకుంటారు. కర్నాటక కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. అక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కూడా ఎన్డీయే పక్షమే. సో, కర్నాటక నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఇకపోతే.. కేరళ. నియోజకవర్గాల పునర్విభజనతో కేరళలో ఒక్క సీటు కూడా పెరగదు అనే విశ్లేషణలు ఉన్నాయి. అంతమాత్రాన.. సీఎం స్టాలిన్ నాయకత్వంలో అక్కడి పార్టీలు నడుస్తాయా అనేది చూడాలి. ఇప్పటికే, ఎన్డీయేకి వ్యతిరేకంగా ఇండీ కూటమి ఉంది. ఇప్పుడు.. దక్షిణాదిన అలాంటి కూటమిని అంగీకరిస్తారా అనేది పెద్ద ప్రశ్న. నిజానికి.. డీలిమిటేషన్‌తో తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క పార్టీ ఫీలింగ్ కూడా. అయినా సరే.. కలిసి ఉద్యమించడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం.. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండడమే. సీఎం స్టాలిన్.. ఈ తమిళ సెంటిమెంట్‌ను రేపింది కేవలం ఎన్నికల్లో లబ్ది పొందడానికేనన్న చర్చ బలంగా జరుగుతోంది. పైగా.. కేంద్రమంత్రి అమిత్‌షా ఓ భరోసా కూడా ఇచ్చారు. సీఎం స్టాలిన్ చెబుతున్నట్టు తమిళనాడులో ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గబోదని హామీ ఇచ్చారు. అయినా సరే.. సీట్లు తగ్గుతున్నాయంటూ అఖిలపక్షం పెట్టారు సీఎం స్టాలిన్. మరోవైపు, త్రిభాషా సూత్రాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నది కూడా రాజకీయ ఉద్దేశంతోనే అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌తో దక్షిణాదిన ఎవరెవరు కలిసొస్తారో చూడాలి.
అసలు డీలిమిటేషన్‌తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం. డీలిమిటేషన్‌ను ఏ ప్రాతినదిన చేస్తారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా.. కేవలం ఉత్తరాది సీట్లతోనే గెలవాలి అనేది బీజేపీ ఎత్తుగడ అంటూ ఈమధ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సో, దక్షిణాదిన ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కాని, పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలనే దగ్గరే ఆగిపోతున్నారు. దక్షిణాదిన ఎంపీ సీట్లు తగ్గవు అని బీజేపీ చెబుతున్నా.. ఉత్తరాదిన పెరిగే సీట్ల గురించి ఏం చెబుతారో చెప్పండి వింటాం అంటున్నాయి ఇక్కడ పార్టీలు. ఓ అంచనా ప్రకారం.. తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ సీట్లను నిర్ధారించాల్సివస్తే.. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే లోక్‌సభ సీట్లు 80 నుంచి 144కి పెరుగుతాయి. బిహార్‌లో ప్రస్తుతం ఉన్న 40 ఎంపీ సీట్లు 79 పెరగొచ్చంటున్నారు. అంటే.. దక్షిణాది రాష్ట్రాలు భయపడుతున్నట్టు.. ఇక్కడి ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండానే ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
కాకపోతే.. డీలిమిటేషన్‌ను ఏ ప్రాతిపదికన చేస్తామో ఇప్పటి వరకు చెప్పనే లేదు కేంద్ర ప్రభుత్వం. కొన్ని వార్తల ప్రకారం.. జిల్లాల కేంద్రంగా లోక్‌సభ పునర్విభజన ఉంటుందని చెబుతున్నారు. నిజానికి, జనాభాను ఆధారంగా చేసుకునే లోక్‌సభ నియోజకవర్గాలు ఉంటాయి. అలాగని.. పర్టిక్యులర్‌గా ఇంత జనాభాకు ఇన్ని నియోజకవర్గాలు అనేంఉండదు. ఉదాహరణకు.. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 30 లక్షల ఓటర్లు ఉన్నారు. యూపీలోని ఘజియాబాద్‌లో 22.6 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అదే.. లక్షద్వీప్‌ను తీసుకుంటే జస్ట్ 48 వేల మంది ఓటర్లకే ఒక ఎంపీ సీటు ఉంది. ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు కేవలం లక్ష మందే ఉన్నారు. మరి ఏ లెక్కన లోక్‌సభ నియోజకవర్గాలను నిర్ణయించిట్టు? 48 వేల మంది ఓటర్లకు ఒక ఎంపీ ఉన్నప్పుడు.. 30 లక్షల ఓటర్లకు కూడా ఒకే ఎంపీనా? అందుకే.. ఈ విషయంలో కొంత సహేతుకత రావాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమే.. డీలిమిటేషన్‌కు రెండు ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు. పార్లమెంటు సీట్లు ఇప్పుడెన్ని ఉన్నాయో.. వాటిని అలాగే ఉంచేసి నియోజకవర్గాలను జనాభా నిష్పత్తి ప్రకారం మారుస్తారు. అలా జరిగితే.. దక్షిణాదిన జనాభా తక్కువగా ఉంది కాబట్టి.. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కేరళలో సీట్ల తగ్గుతాయి. సపోజ్.. 1951లో దక్షిణాది జనాభా వాటా 26.2 శాతం. 2022లో అది 19.8 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల వాటా 39.1 శాతం నుంచి 43.2 శాతానికి పెరిగింది. ఈ లెక్కన యూపీ అండ్ బిహార్ రాష్ట్రాల్లోనే 222 సీట్లు ఉంటే.. దక్షిణాదిలో ఉండే అన్ని ఐదు రాష్ట్రాలకు కలిపి కేవలం 165 సీట్లే ఉంటాయనేది ఓ లెక్క. రేప్పొద్దున సరిగ్గా ఇదే జరగబోతోందంటున్నారు సీఎం స్టాలిన్. ఈ ప్రాతిపదకనే తమిళనాడులో 8 ఎంపీ సీట్లు తగ్గుతాయంటున్నారు. అయితే.. డీలిమిటేషన్‌కు మరో ప్రతిపాదన కూడా ఉంది. మొత్తం లోక్‌సభ సీట్లను 888కి పెంచుతారనేది బయట వినిపిస్తున్న టాక్. దాని ప్రకారం.. తాజాగా లెక్కించే జనాభాను 888తో భాగించి, అలా వచ్చిన సంఖ్యను ఒక లోక్‌సభ స్థానానికి కావాల్సిన సగటు జనాభాగా లెక్కిస్తారు. ఆ సంఖ్యతో ఒక రాష్ట్ర మొత్తం జనాభాను భాగించి లోక్‌సభ స్థానాల సంఖ్యను నిర్ధారిస్తారు. సో, ఈ ప్రాతిపదికన ఎంపీ సీట్లు పెరగొచ్చు, లేదా తగ్గొచ్చు. బీజేపీ వాదన కూడా ఇదే. తాజా జనాభా లెక్కల ప్రకారం.. తమిళనాడుతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరుగుతాయని అంటున్నారు.
బీజేపీ వర్షన్ ప్రకారం.. సీట్లు పెరుగుతాయన్నది నిజమే. కాని, ఇదే సమయంలో ఉత్తరాదికి ఎన్ని సీట్లు పెరుగుతున్నాయో చెప్పడం లేదు. ఎందుకంటే.. ఉత్తరాదికి పెరిగే సీట్లతో పోల్చితే దక్షిణాదిన పెరిగే సీట్ల శాతం చాలాచాలా తక్కువ. ఒక్కముక్కలో చెప్పాలంటే.. దక్షిణాది ఎంపీ సీట్లు అక్కర్లేకుండానే ఉత్తరాదిన గెలిచే సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో, అలాంటప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యతా ఉండకపోవచ్చు. పైగా నియోజకవర్గాల సంఖ్యను బట్టే నిధులు విడుదలవుతాయి. సో, దక్షిణాదికి వచ్చే నిధుల్లోనూ భారీ కోత పడొచ్చు. ఓవరాల్‌గా.. తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మాత్రం.. దక్షిణాదికి అన్ని విషయాల్లో మొండి చెయ్యే అనేది రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకుల మాట.
ఓవరాల్‌గా.. డీలిమిటేషన్‌పై దక్షిణాదిన పెద్ద చర్చే జరుగుతోంది. కాకపోతే.. ఒక్క తమిళనాడు మినహా ఏ రాష్ట్రం కూడా దీనిపై సీరియస్‌గా పోరాడాలని అనుకోవడం లేదు. కారణం.. చాలా సింపుల్. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకు ఒక అంశం కావాలి. అందుకే, హిందీని, డీలిమిటేషన్‌ను ఎన్నికల అస్త్రంగా తీసుకుందని మిగిలిన రాష్ట్రాలు, పార్టీలు భావించి ఉండొచ్చు. బహుశా.. తమ పార్టీని ఓడించడానికి మిగిలిన పార్టీలకు బీజేపీ బ్యాక్‌ఎండ్ సపోర్ట్ చేస్తోందనే అంచనాలో ఉందేమో.. హిందీ, డీలిమిటేషన్ ఇష్యూలపై చాలా సీరియస్‌గా వెళ్తోంది డీఎంకే. అటు.. తమిళనాట ఎన్నికలు బీజేపీకి కూడా ముఖ్యమే కాబట్టి.. సెంటిమెంట్‌కు భంగం కలగకుండా ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..