Draupadi Murmu Profile: టీచర్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థి వరకు.. ద్రౌపది ముర్ము ప్రజా ప్రస్థానం ఇదే..

Draupadi Murmu Profile: టీచర్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థి వరకు.. ద్రౌపది ముర్ము ప్రజా ప్రస్థానం ఇదే..
Draupadi Murmu

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భేటీ అయిన బీజేపీ అగ్ర నాయకత్వం.. 64 ఏళ్ల ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది.

Shaik Madarsaheb

|

Jun 22, 2022 | 5:42 AM

NDA Presidential Candidate Profile: ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నాయకురాలు, మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ కమిటీ భేటీ అనంతరం ఎన్డీఏ అభ్యర్థిగా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ని బరిలోకి దింపుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎన్డీఏ పక్షాలన్నింటితో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం నియమించిన కమిటీ దాదాపు 20 పేర్లను పరిశీలించింది. అనంతరం.. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భేటీ అయిన బీజేపీ అగ్ర నాయకత్వం.. 64 ఏళ్ల ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించలేదంటూ ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్లు తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని.. మంత్రిగా, గవర్నర్​గా మెరుగైన సేవలు అందించారని కొనియాడారు.

ద్రౌపది ముర్ము బయోడేటా.. (Draupadi Murmu Profile)

 • ద్రౌపది ముర్ము (64) ఒడిశాలోని మయూర్​భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు.
 • ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్​చరణ్ ముర్ము. మర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
 • ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు.
 • 1997లో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముర్ము.. రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలపాటు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
 • ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ – బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణా మంత్రిగా పనిచేశారు.
 • ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
 • 2010, 2013లో మయూర్‌భంజ్‌ బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా కొనసాగారు.
 • జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు గవర్నర్‌గా సేవలందించారు.
 • ప్రస్తుతం ద్రౌపది ముర్ము రాష్ట్రపతి రేసులో నిలిచిన తొలి గిరిజన మహిళగా నిలిచారు.
 • జూన్ 25న ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.
 • ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించనున్నారు.

గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారు: ప్రధాని మోడీ ట్వీట్‌..

ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తంచేశారు. ద్రౌపది ముర్ము తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారని, పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసం కృషిచేశారని కొనియాడారు. విశేష పరిపాలనా అనుభవం ఉన్న ద్రౌపది ముర్ము.. మన దేశానికి గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారన్న విశ్వాసం తనకు ఉందని.. ప్రధాని మోడీ ఈ సందర్భంగా ట్విట్ చేశారు.

Pm Modi Murmu

Pm Modi Murmu

జూలై 18న ఎన్నికలు..

రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. విపక్షాల అభ్యర్థిగా సిన్హా పేరును ప్రకటించిన అనంతరం బీజేపీ అనూహ్యంగా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 29 చివరి తేదీ కాగా.. ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి. జూన్ 21న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu