Heatwave Alert: అలర్ట్.. రికార్డు బద్దలు కొడుతున్న ఎండలు.. 122 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు..
India Heatwaves: ఈ వేసవిలో భానుడు భగభగ మండుతున్నాడు. మార్చిలోనే మంటలు మండించాడు. ఇక ఏప్రిల్ ఎలా ఉండబోతోందో తలుచుకుంటేనే వణుకుపుట్టే పరిస్థితి నెలకొంది.
India Heatwaves: ఈ వేసవిలో భానుడు భగభగ మండుతున్నాడు. మార్చిలోనే మంటలు మండించాడు. ఇక ఏప్రిల్ ఎలా ఉండబోతోందో తలుచుకుంటేనే వణుకుపుట్టే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎండ ధాటికి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. ఉదయం 8 గంటల నుంచే ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భానుడి ప్రతాపానికి మాడు పగిలిపోతోంది. మిట్ట మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ కర్ఫ్యూని తలపిస్తున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రతకు రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పెరిగిన ఎండలకు సంబంధించి వాతావరణ శాఖ తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించింది. గత 122 ఏళ్ల నుంచి భారతదేశ చరిత్రలోనే ఈ ఏడాది మార్చిలో అత్యంత వేడి నెలగా నమోదైందని ప్రకటించింది. ఇది 2010లో నమోదైన ఆల్ టైమ్-సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డును క్రాస్ చేసింది. మార్చి 2010లో భారతదేశం సగటు నెలవారీ ఉష్ణోగ్రత 33.09 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది.
అయితే, గత నెలలో సగటు నెలవారీ ఉష్ణోగ్రత 33.1 డిగ్రీలుగా నమోదైంది. 1901 నుంచి మార్చి నెలలో నమోదైన అన్ని అధిక ఉష్ణోగ్రతల రికార్డులను ఇది అధిగమించింది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. గతకొన్నేళ్ల నుంచి మార్చి నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. 2020, 2021లో మార్చి ఉష్ణోగ్రతలు గత రికార్డులను బద్దలు కొట్టాయి. నెలవారీ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత పరంగా 2021 మార్చి నెల గత 121 ఏళ్లలో మూడో అత్యంత వేడి నెలగా నమోదైంది. అయితే.. ఏప్రిల్‌లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
అటు ప్రపంచవ్యాప్తంగా గత రెండు దశాబ్దాలలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరాలు ఉన్నాయి. వాతావరణ మార్పులు భారతదేశంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వేడిగాలులు, తుఫాను తీవ్రత, భారీ వర్షపాతం కూడా ఇందుకు కారణం కావచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: