Weather Update: దేశవ్యాప్తంగా మరింత పెరిగిన వరద కష్టాలు.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు..

దేశమంతా వరద కష్టాలు మరింత పెరిగాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఇదే పరిస్థితి కన్పిస్తోంది. వారణాసిలో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది . ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడడంతో అపారనష్టం జరిగింది. జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాజోరి జిల్లాల్లో వరదల కారణంగా అపారనష్టం జరిగింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారులు ధ్వంసమయ్యాయి.

Weather Update: దేశవ్యాప్తంగా మరింత పెరిగిన వరద కష్టాలు.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు  ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు..
Heavy Rains In India
Follow us
Surya Kala

|

Updated on: Aug 09, 2024 | 8:58 AM

దేశంలో రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర , దక్షిణ , తూర్పు , పశ్చిమ భారత్‌లో అన్ని చోట్ల రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తరాఖండ్‌లో వరదల విలయం కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాజోరి జిల్లాల్లో వరదల కారణంగా అపారనష్టం జరిగింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారులు ధ్వంసమయ్యాయి. రాజోరిలో చాలా గ్రామాల్లో కుంభవృష్టి కురుస్తోంది. రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. ఆర్మీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. రాజోరిలో చాలా వాహనాలు బురదవరదలో చిక్కుకున్నాయి. కొన్ని వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి.

ఉత్తరాఖండ్‌ కూడా వరదల విలయం నుంచి కోలుకోవడం లేదు. హరిద్వార్‌లో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కొండచరియలు విరిగిపడడంతో వందలాది గ్రామాల్లో రోడ్డు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 10 జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హైఅలర్ట్‌ జారీ చేసింది.

వారణాసిలో కూడా గంగా ప్రవాహం మరింత పెరిగింది. నమోఘాట్‌తో పాటు చాలా ఘాట్లు వరదనీటిలో మునిగిపోయాయి. ప్రజలు అప్రమత్తంగ ఉండాలని అధికారులు సూచించారు.

తమిళనాడులో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు జిల్లా లోని అలియార్‌ డ్యాం ఆరోసారి నిండడంతో రైతుల నీటి కష్టాలు తీరాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కర్నాటకలో కూడా భారీవర్షాలు కురియడంతో డ్యాం లోకి నిరంతరం వరదప్రవాహం కొనసాగుతోంది.

కర్నాటక లోని యాద్గిర్‌లో కుండపోత కురిసింది. ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించడంతో జనం లబోదిబోమంటున్నారు. వందల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అసోంలో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది . గౌహతిలో భారీవర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..