Jaishankar: చైనాతో సరిహద్దు వివాదాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమన్నారంటే?
ఈ గురువారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో కలిశారు. ఈ సమావేశంలో తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా, పరస్పర అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే వాతావరణాన్ని సృష్టించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.
చైనాతో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక ప్రకటన చేశారు. చైనాతో 75 శాతం సమస్యలను పరిష్కరించుకున్నామని ఆయన చెప్పారు. జైశంకర్ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే చైనా విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్‌తో సహా నాలుగు ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని తొలగించినట్లు చైనా తెలిపింది. ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి నిలకడగా ఉంది. ఫలితంగా చైనాతో భారత్ ద్వైపాక్షిక సబంధాలను మెరుగుపరచుకోడానికి అడుగులు పడుతున్నాయి.
ఈ గురువారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో కలిశారు. ఈ సమావేశంలో తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా, పరస్పర అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే వాతావరణాన్ని సృష్టించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ క్రమంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు.
అదే సమయంలో, ఈ అంశంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ను అడిగినప్పుడు, తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్టంభన గురించి ప్రశ్నించగా.. నాలుగు ప్రాంతాల నుంచి ఇరు సైన్యాలు వెనక్కి వెళ్లాయని, సరిహద్దులో పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. చైనా-భారత్ సరిహద్దులోని పశ్చిమ సెక్టార్లో గాల్వాన్ లోయతో పాటు నాలుగు పాయింట్ల నుండి ఇరు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గాయని చైనా ప్రతినిధి తెలిపారు. చైనా-భారత్ సరిహద్దులో పరిస్థితి స్థిరంగా, నియంత్రణలో ఉందన్నారు. నిజానికి, జెనీవాలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇచ్చిన ప్రకటన తర్వాత మావో నుంచి ఈ ప్రకటన వచ్చింది.
వివాదంపై జైశంకర్ ఏమన్నారు?
చైనాతో 75 శాతం సమస్యలను పరిష్కరించుకున్నామని, అయితే సరిహద్దులో పెరుగుతున్న సైనికీకరణే పెద్ద సమస్య అని జైశంకర్ అన్నారు. ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. గాల్వాన్ లోయలో జరిగిన హింసాకాండ రెండు దేశాల మధ్య సంబంధాలను బాగా ప్రభావితం చేసిందని సూత్రీకరించారు. సంబంధాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. బలగాల మోహరింపు అంశంపై పరిష్కారం ఉంటే, సంబంధాలను మెరుగుపరచుకోవడం గురించి మాట్లాడవచ్చని అన్నారు.
మే 2020 నుండి ప్రతిష్టంభన
తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదంపై భారత్, చైనాల మధ్య మే 2020 నుంచి ప్రతిష్టంభన కొనసాగుతోంది. జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. నాలుగేళ్లు గడిచినా ఇంకా పరిష్కారం దొరకలేదు. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి, ఇరుపక్షాల మధ్య ఇప్పటివరకు 21 పర్యాయాలు కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనకపోతే చైనాతో సంబంధాలు మెరుగుపడే ప్రసక్తే లేదని భారత్ స్పష్టంగా చెబుతోంది. మొత్తంగా ఇరు పక్షాలు సరిహద్దుల్లోని అనేక వివాదాస్పద ప్రాంతాల నుంచి తమ దళాలను ఉపసంహరించుకున్నాయి. దీంతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తొలి అడుగు పడిందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి