Chiranjeevi: చిరంజీవికి ఎంతో ప్రాధాన్యత..! బీజేపీ పెద్దల మదిలో ఏముంది..?

ఎంత ఎత్తుకు వెళ్లినా.. మనం ఎదిగొచ్చిన మూలాల్ని మర్చిపోకూడదు.. కష్టకాలంలో మనల్ని ఆదుకుని.. గట్టుకు లాగిన చేతుల్ని వదిలిపెట్టొద్దు. ఆప్తా క్యాపిటలిస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో ఇటీవల చిరంజీవి చెప్పిన ఇన్‌స్పిరేషనల్ లైన్స్ ఇవి. అందుకే.. ప్రజారాజ్యం మూసివేత సమయంలో అభయం ఇచ్చిన హస్తం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు మెగాస్టార్. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని వదులుకోలేదు. కానీ.. మరోవైపు నుంచి పిలుపొస్తే.. నువ్వే మాకు ఆపద్బాంధవుడివి అని కాళ్లావేళ్లా పడితే.. ఆ గోల్డెన్ ఛాన్స్‌ని చిరంజీవి వదులుకుంటారా..? అదేపనిగా తనవైపు కన్నుగీటుతున్న కమలం పార్టీపై చిరంజీవి ఆలోచనేంటి?

Chiranjeevi: చిరంజీవికి ఎంతో ప్రాధాన్యత..! బీజేపీ పెద్దల మదిలో ఏముంది..?
Chiranjeevi, PM Modi
Follow us
TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 15, 2025 | 10:12 PM

రాననుకున్నారా రాలేననుకున్నారా.. అంటూ రాజకీయాల్లొక్చేశారు. అభిమానులే నాకున్న పెట్టుబడి అంటూ ప్రజాజీవితంలో ఎంట్రీ ఇచ్చారు. కానీ.. అంతే స్పీడుగా వెనక్కెళ్లిపోయారు. అదంతా గతం. ఆ తర్వాత చిరంజీవికీ.. రాజకీయాలకు లంకె తెగిపోయింది. సినిమాలే నా ఫస్ట్ ప్రయారిటీ అంటూ ముందుకు వెళ్తున్న చిరంజీవి.. సెకండ్ ప్రయారిటీ ఫలానా అని చెప్పకుండా అభిమాన కోటిని ఆశల పల్లకీలోనే వదిలేశారు.

సినిమాల్లోకి ఎలా ఐతే రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌ జోరుగా మొదలుపెట్టారో.. రాజకీయాల్లో కూడా అదే సీన్ రిపీటౌతుందని, బాస్ ఈజ్‌ బ్యాక్ ఔతారనేది సగటు మెగాస్టార్ అభిమాని చిరు కోరికగానే ఉంది. మెగా అభిమానుల్లో ఉన్న ఈ యాస్పిరేషన్లని కొన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకుని చిరంజీవి చరిష్మాకు గాలం వేస్తూనే ఉన్నాయి. కాషాయం పార్టీ ఐతే.. మెగా ఫ్యామిలీ మూమెంట్స్‌ని ఓరకంట కనిపెడుతూనే ఉంది. మెగా ఫ్యామిలీ అంటే తొమ్మిది మంది హీరోల బలమైన కూటమి. అందులో పవన్‌కల్యాణ్‌కుండే ఫ్యాన్‌బేస్ ఇప్పటికే పరోక్షంగా బీజేపీ కనుసన్నల్లోనే ఉంది. ఏపీలో బీజేపీతో కలిసి కూటమి కట్టి పవర్లోకొచ్చిన పవన్‌కల్యాణ్… ఆ తర్వాత ప్రధాని మోదీకి బాగా దగ్గరివాడయ్యాడు.

డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్ వేసే అడుగులన్నీ బీజేపీ భావజాలానికి సింకవడం.. ఆయనిచ్చే సనాతన సౌండ్‌ బీజేపీ థియరీకి కోరస్‌గా అనిపించడం.. ఈ పరిణామాలన్నిటినీ ఢిల్లీ కమలనాథులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పవన్‌కల్యాణ్ వ్యూహాత్మక పైచేయి సాధిస్తున్నారన్న విశ్లేషణలు కూడా బీజేపీ నోట్లో నీళ్లూరేలా చేస్తోంది. రేపటిరోజున పవన్ మనోడే అనే ధీమా వచ్చేసింది గనుక.. ఇదే గ్యాప్‌లో మెగా ఫ్యామిలీని పూర్తిగా క్యాప్చర్ చేయడానికి పూనుకున్నట్టుంది కమలం పార్టీ.

ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోదీ ప్లస్ చిరంజీవి.. వీళ్లిద్దరి కాంబినేషనే సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. ప్రధాని హోదాలో చీఫ్‌గెస్ట్‌గా పాల్గొన్న మోదీ.. అదే సందర్భంలో మెగాస్టార్‌తో సమానంగా కలిసి నడవడం ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఎక్కడిది.. సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ గుసగుసలు కూడా వినిపించాయి. ఇక్కడే కాదు.. మెగా ఫ్యామిలీ మోదీ గుడ్‌లుక్స్‌లో ఉందని చెప్పడానికి సాక్ష్యాలుగా ఫ్లాష్‌బ్యాక్‌లో బోలెడన్ని దృశ్యాలు.

అయోధ్యలో మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ్‌లల్లా ప్రతిష్టాపన సందర్భంగా స్పెషల్ ఇన్‌వైటీగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. మూడేళ్ల కిందట నర్సాపురంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. అదే వేదికపై ప్రత్యేక ఆహ్వానితుడిగా మెరిశారు మెగాస్టార్ చిరంజీవి.

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మిగతా బీజేపీ పెద్దలు సైతం ఇప్పటికీ మెగా టచ్ కంటిన్యూ చేస్తున్నారు. ఏడాది కిందట తెలంగాణ ఎన్నికల సమయంలో హోమ్‌ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ వచ్చినప్పుడు.. చిరంజీవి, రాంచరణ్‌ కలిసి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎజెండా ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీనే. అంతకుముందు ట్రిపులార్‌ పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ వచ్చిన సమయంలో చిరంజీవి ఫ్యామిలీతో ఢిల్లీలో అమిత్‌ షా భేటీ అయ్యారు. అభినందనలు మాత్రమేనా మిగతా మంతనాలేమైనా జరిగాయా అనే చర్చ అప్పట్లో తెలుగు పొలిటికల్ సర్కిల్స్‌ని వేడెక్కించింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార ఘట్టంలో మోదీ చేసిన మెగా ఫీట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

గత లోక్‌సభ ఎన్నికల ముందు చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించడం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో ఆసక్తికర నిర్ణయం. ఆ సందర్భంగా.. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని చిరంజీవి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం… ఇద్దరి మధ్యా పొగడ్తల జల్లులు కురవడం.. అప్పట్లో ఒక ఇంట్రస్టింగ్ మూమెంట్‌‌గా నిలిచింది.

అదే కిషన్‌రెడ్డి.. ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకల పేరుతో చిరంజీవిని, మోదీని ఒకే వేదికపైకి చేర్చారు. ఇట్స్ పక్కా పొలిటికల్‌ అనే కామెంట్లు గట్టిగా వినిపించాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయమే ఎజెండాగా మోదీ సహా బీజేపీ పెద్దలు చిరూకు దగ్గరవుతున్నారా? అనే చర్చ సహజంగానే తెరమీదికొచ్చింది. ఇప్పటికే మిషన్ సౌత్ పేరుతో పెద్ద టార్గెట్టే పెట్టుకుంది కమలం పార్టీ. ఆరునూరైనా ఈసారి దక్షిణాదిలో గట్టిగా పాగా వెయ్యాలన్న కసితో పనిచేస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత.. ఆ కమిట్‌మెంట్ రెండుమూడింతలైంది. కన్నడ నాట పోగొట్టుకున్న దాన్ని తెలంగాణలో చేజిక్కించుకుందామన్న స్ట్రాటజీ గత ఎన్నికల్లో కొంతమేరకు ఫలించింది. రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో మూలాల్ని పటిష్టపర్చుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. అందుకే.. రెండు తెలుగు రాష్ట్రాలకూ కలిపి ఒకటే స్కెచ్ వేసిందా..? మెగాఫ్యామిలీ పేరుతో కొత్త పాచిక వెయ్యబోతోందా..? మళ్లీ ఎన్నికలకు మరో నాలుగేళ్ల దూరం ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే పావులు కదపబోతోందా..?

చిరంజీవి అంటే ఒక్క చిరంజీవి మాత్రమే కాదు.. ఆయన బలం, బలగం.. పునాదిరాళ్లు నుంచి విశ్వంభర దాకా… మూడు తరాల ప్రేక్షకులతో ఆయనుకుండే కనెక్టివిటీ.. ఇదంతా కాలిక్యులేటర్లతో కొలిచేది కాదు. తెలుగు సినిమాకు పర్మనెంట్ ఐకాన్‌గా.. 155 సినిమాల మొనగాడుగా ఆయన ఫాలోయింగ్ ఎంతో అందరికీ తెలిసిందే. పైగా.. మెగాస్టార్‌ని ప్రసన్నం చేసుకుంటే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని సొంతం చేసుకున్నట్టే. ఆయనకై ఆయన రాజకీయాల్లోకి మళ్లీ రావాలనుకుంటే ఏ ప్రోటోకాలూ అడ్డుకోలేదు. ఆయన నోటి మాటతోనే ఓటు మీటర్లు ప్రభావితమౌతాయని గట్టి నమ్మకముంది. ఆ నమ్మకమే.. కమలం పార్టీని ఊరిస్తోందా..?