అనుమానాస్పదంగా ప్రయాణికుడి బ్యాగ్‌.. ఓపెన్‌ చేయగా..!

అనుమానాస్పదంగా ప్రయాణికుడి బ్యాగ్‌.. ఓపెన్‌ చేయగా..!

Samatha J

|

Updated on: Jan 15, 2025 | 6:04 PM

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు తమ ఫ్లైట్స్‌ కోసం బిజీ బిజీగా వెళ్తున్నారు. చెకింగ్‌ దగ్గర సిబ్బంది ప్రయాణికుల లగేజ్‌ చెక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి చేతిలో ఉన్న బ్యాగ్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో సెక్యూరిటీ అతని లగేజ్‌ను చెక్‌ చేశారు. ఆ బ్యాగులో మొసలి తల ఉండటం చూసి షాకయ్యారు. దానిని స్వాధీనం చేసుకుని, ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయం విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది.

జనవరి 6న కెనడా పౌరుడైన వ్యక్తి టొరంటో వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. ఎయిర్ కెనడా విమానం ఎక్కే ముందు సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని చెక్‌ ఇన్‌ చేశారు. ఆ వ్యక్తిపై అనుమానం రావడంతో టెర్మినల్ 3 వద్ద లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో ఒక బ్యాగ్‌లో మొసలి తల ఉండటాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. కాగా, కస్టమ్స్‌ అధికారులు ఆ మొసలి తలను స్వాధీనం చేసుకున్నారు. దానిని గుడ్డతో చుట్టి లగేజ్‌లో అతడు ఉంచినట్లు తెలిపారు. 777 గ్రాముల బరువున్న మొసలి తలను ఢిల్లీకి చెందిన అటవీశాఖ అధికారులు పరిశీలించారు. మొసలి పిల్లకు చెందినదిగా వారు నిర్ధారించారు. దర్యాప్తు కోసం డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు దానిని పంపారు. ఆ కెనడా పౌరుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.