JP Nadda: దాచనక్కర్లేదు.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో అసలు నిజం బయటపడింది.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఫైర్
ప్రతిపక్షం బీజేపీతో మాత్రమే కాదు.. దేశంతోనూ పోరాడుతోందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపాయి.. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం, నిజం బహిర్గతమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆ పార్టీ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు.. ఇటీవల మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు.. రాజ్యాంగాన్ని కించపరిచేలా.. దేశ స్వాతంత్రపోరాటాన్ని అవమానపరిచేలా భగవత్ మాట్లాడారనీ మండిపడ్డారు. రాజ్యాంగం పునాదుల మీద… దేశప్రజలతో కాంగ్రెస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు.. ఈ క్రమంలోనే.. ప్రతిపక్షం బీజేపీతో మాత్రమే కాదు.. దేశంతోనూ పోరాడుతోందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపాయి.. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు తప్పుబట్టారు. కాంగ్రెస్ అసలురూపం ఈ వ్యాఖ్యలతో బహిర్గతమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ మన భావజాలం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం వలె వేల సంవత్సరాల నాటిది.. అది వేల సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో పోరాడుతూనే ఉంది. మనం.. న్యాయమైన పోరాటం చేస్తున్నామని అనుకోవద్దు. ఇందులో ఎలాంటి న్యాయమూ లేదు. బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్ అనే రాజకీయ సంస్థతో పోరాడుతున్నామని మీరు విశ్వసిస్తే, ఏమి జరుగుతుందో మీకు అర్థం కాదు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మన దేశంలోని ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు మనం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తోపాటు.. భారత రాష్ట్రంతో పోరాడుతున్నాం.’’ అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీపైనే కాకుండా భారత రాష్ట్రంపై కూడా పోరాడుతోందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది..ఆ పార్టీ నేత అమిత్ మాల్వియా రాహుల్ వీడియోని Xలో షేర్ చేశారు. రాహుల్ ఇప్పుడు భారత రాజ్యానికి వ్యతిరేకంగా బహిరంగంగా యుద్ధం ప్రకటిస్తున్నారని ఆయన రాశారు. అదే సమయంలో, కాంగ్రెస్ అసలు నిజాన్ని ఇప్పుడు సొంత నాయకుడే బట్టబయలు చేశారని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా అన్నారు.
జేపీ నడ్డా ట్వీట్..
Hidden no more, Congress’ ugly truth now stands exposed by their own leader.
I ‘compliment’ Mr. Rahul Gandhi for saying clearly what the nation knows- that he is fighting the Indian state!
It is not a secret that Mr. Gandhi and his ecosystem have close links with Urban Naxals…
— Jagat Prakash Nadda (@JPNadda) January 15, 2025
జేపీ నడ్డా ఫైర్..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. ‘ఇకపై దాచాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్‌లోని అసహ్యకరమైన నిజాన్ని ఇప్పుడు సొంత నాయకుడే బట్టబయలు చేశాడు. తాను భారత రాష్ట్రంపై పోరాడుతున్నానని.. దేశానికి తెలిసిన విషయాన్ని స్పష్టంగా చెప్పినందుకు రాహుల్ గాంధీని నేను అభినందిస్తున్నాను.. రాహుల్ గాంధీ, ఆయన చుట్టూ ఉన్నవారికి అర్బన్ నక్సల్స్‌తో సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. దేశం పరువు తీయాలని, కించపరచాలని, అప్రతిష్ఠపాలు చేయాలని వారు కోరుకుంటున్నారు. పదే పదే ఆయన చేస్తున్న పనులు ఈ నమ్మకానికి బలం చేకూర్చాయి. భారత్‌ను ముక్కలు చేసి, విభజించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటీ చేశారు.. చెప్పారు’ అని ఎక్స్ వేదికగా నడ్డా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండి పడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..