గుంపులో చిక్కుకుంటే బయటపడటం ఎలానో తెలుసుకోండి ఇలా?

గుంపులో చిక్కుకుంటే బయటపడటం ఎలానో తెలుసుకోండి ఇలా?

Samatha J

|

Updated on: Jan 15, 2025 | 5:54 PM

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల తాపత్రయం తీవ్ర విషాదానికి దారితీసింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దేశంలో ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగి, తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇటువంటి సందర్భాల్లో గుంపులో చిక్కుకున్నప్పుడు సురక్షితంగా బయటపడటం ముఖ్యం. ఇలాంటి భారీ కార్యక్రమాల నిర్వహణ సందర్బంలో ప్రజల భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత .. ప్రభుత్వంపై ఉంటుంది. ఇందులో అధికారుల పాత్ర కీలకం. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే పసిగట్టడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. జనసమూహం చాలా నెమ్మదిగా ముందుకు కదులుతుంటే, రద్దీ పెరుగుతోందని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.

ఇటువంటి సందర్భాల్లో జనసమూహం నుంచి వచ్చే శబ్దాన్ని వినడం చాలా ముఖ్యమని చెప్పారు. జనం అసౌకర్యంగా, బాధతో కేకలు వేస్తున్నట్లు గుర్తిస్తే, అది పరిస్థితులు అదుపు తప్పవచ్చనడానికి సంకేతమని, అటువంటి స్థితిలో బయటపడే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. జనసమూహం చదరపు మీటరుకు ఐదుగురి వరకూ చేరుకుంటే, పరిస్థితి ప్రమాదకరమని గుర్తించాలన్నారు. అయితే జనసమూహం సాంద్రతను అంచనా వేయడం కష్టం. అందుకే మీకు జనంలో బాగా ఇరుక్కుపోయానని అనిపించినప్పుడు వెంటనే బయటపడే ప్రయత్నం చేయాలని చెప్పారు. అయితే పరిస్థితి మీ నియంత్రణలో లేనప్పడు మీరు ముందుకు తోసుకుంటూ వెళ్లకుండా, జనసమూహం మిమ్మల్ని కదిలిస్తున్న విధంగా ముందుకు కదలాలని సూచిస్తున్నారు. ఒకవేళ జనసమూహం కదలడం ఆగిపోయినప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడటం, మీ చేతులను మీ ఛాతీకి రక్షణగా ఉంచుకోవడం చేయాలి. అటువంటి పరిస్థితిలో ఎప్పుడూ జనసమూహానికి వ్యతిరేకంగా వెళ్లకూడదు. మరో నిపుణుడు ఏం చెప్పారంటే.. పిల్లలను రద్దీగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లకపోవడమే ఉత్తమమన్నారు. అలాగే రద్దీలో మీ ఫోన్ లేదా ఏదైనా పడిపోయి ఉంటే, దానిని వదిలివేయాలని, కాదని దానిని తీసుకునే ప్రయత్నం చేస్తే ప్రమాదంలో పడతారని హెచ్చరిస్తున్నారు. రద్దీ సమయంలో ఊపిరి ఆడకపోవడమే మరణానికి కారణమవుతుంది. జనంలో ఇరుక్కుపోయినప్పుడు మీ ఊపిరితిత్తులు శ్వాస తీసుకునేందుకు అనువుగా విస్తరించడానికి అవకాశం తగ్గుతుంది. దీంతో ఊపిరి పీల్చుకోలేరు. గుంపులో ఎవరైనా కింద పడిపోయినప్పుడు, అతనిపై ఇతరులు పడిపోతారు. అప్పుడు కిందనున్న వ్యక్తి ఊపిరి తీసుకోలేక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడు. ఈ సమయంలో ఊపిరితిత్తులు, గుండె దెబ్బతినడంలాంటివి జరుగుతాయి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నాణ్యత కలిగిన బూట్లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ధరించినప్పుడు గుంపులో కూడా బలంగా నిలబడగలుగుతామని వారు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండటమే దీనికి ఏకైక పరిష్కారం అని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.