Vice President Dhankhar: అస్వస్థతకు గురైన భారత ఉపరాష్ట్రపతి! హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఢిల్లీ AIIMS ఆసుపత్రిలో చేరారు. ఛాతీ నొప్పి, అసౌకర్యంతో ఆయన అర్ధరాత్రి ఆసుపత్రికి తరలివెళ్ళారు. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, పర్యవేక్షణలో ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి, ప్రధాని ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఛాతీ నొప్పి, అసౌకర్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. 73 ఏళ్ల ధంఖర్‌ను ఆదివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించారు. ధంఖర్‌ను ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పరిశీలనలో ఉన్నారని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఉపరాష్ట్రపతి ఆస్పత్రిలో చేరడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. వెంటనే అవసరమైన సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉన్న జగదీప్ ధంఖర్, 2022 ఆగస్టు 11న భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించి, ఆయన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
