Shah Rukh Khan: పాన్ మసాలా యాడ్.. షారుఖ్ ఖాన్‌తో పాటు ఈ స్టార్ హీరోలకు నోటీసులు!
జైపూర్ వినియోగదారుల కమిషన్, పాన్ మసాలా ప్రకటనలలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ మరియు టైగర్ ష్రాఫ్ లతో పాటు విమల్ పాన్ మసాలా సంస్థకు నోటీసులు జారీ చేసింది. "దానే దానే మే హై కేసర్ కా దమ్" అనే ప్రకటన తప్పుడుదని, ప్రజల ఆరోగ్యానికి హానికరం అని ఫిర్యాదుదారు యోగేంద్ర సింగ్ బడియాల్ పేర్కొన్నారు. మార్చి 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

టీవీల్లో, సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి బడాబడా బాలీవుడ్ స్టార్స్ పాన్ మసాలా యాడ్స్‌లో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. అయితే వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా పాన్ మసాలా ప్రకటనలు ఇస్తున్నారంటూ అందిన ఫిర్యాదు నేపథ్యంలో బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు CDRC(consumer disputes redressal commission) నోటీసులు జారీ చేసింది. వారితో పాటు జైపూర్ వినియోగదారుల కమిషన్ విమల్ పాన్ మసాలా తయారు చేసే JB ఇండస్ట్రీస్ చైర్మన్ విమల్ కుమార్ అగర్వాల్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. మార్చి 19న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు హాజరు కాని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ చైర్మన్ గైర్సిలాల్ మీనా, సభ్యురాలు హేమలత అగర్వాల్ మార్చి 5న జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. నోటీసు అందిన రోజు నుండి 30 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
అయితే ఈ నోటీసులపై ఇప్పటి వరకు ఏ హీరో కూడా స్పందించలేదు. జైపూర్‌కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు జారీ చేశారు. ప్రకటనలో ” దానే దానే మే హై కేసర్ కా దమ్ (పాన్ మసాలాలోని ప్రతి గింజకు కుంకుమపువ్వు శక్తి ఉంది)” అంటూ పేర్కొన్నారని, ఈ ప్రకటనలు చూసి సామాన్య ప్రజలు పాన్ మసాలాను విపరీతంగా తింటున్నారని, ఇది ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలతో జేబీ ఇండస్ట్రీస్ కోట్లాది రూపాయలు సంపాదిస్తోందంటూ యోగేంద్ర సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. “కుంకుమపువ్వుతో కూడిన గుట్కా పేరుతో” విమల్ పాన్ మసాలా కొనుగోలు చేయడానికి ప్రజలను చూపిస్తున్నారని అన్నారు.
వాళ్లు ప్రకటనల్లో చెబుతున్నట్లు అందులో ఎలాంటి కుంకుమపువ్వు పదార్ధం మిశ్రమం లేదు” అని ఆయన తెలిపారు. మార్కెట్లో కుంకుమ పువ్వు ధర కిలోకు రూ.4 లక్షలు, పాన్ మసాలా ధర కేవలం రూ.5 మాత్రమేనని, అలాంటిది పాన్ మసాలాలో కుంకుమ పువ్వును ఎలా కలుపుతారంటూ ప్రశ్నించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి, సాధారణ ప్రజలను మోసం చేసినందుకు ఉత్పత్తి సంస్థ, ప్రకటనల్లో పాల్గొన్న నటులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు డిమాండ్ చేశారు. ఈ తప్పుడు ప్రచారం కారణంగా, సాధారణ ప్రజలు ప్రాణనష్టం, ఆరోగ్య నష్టాన్ని ఎదుర్కొంటున్నారు, దీనికి ప్రచారకర్తలు పరోక్షంగా బాధ్యత వహించాల్సిందే అని ఆయన అన్నారు. ఈ ప్రొడెక్ట్‌ను ఉత్పిత్తిని చేస్తున్న సంస్థకు భారీ జరిమానా విధించాలని, సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాన్ మసాలాను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
