Karnataka: కర్ణాటకలో మళ్లీ తెరపైకి మసీదుల వివాదం.. శాంతిభద్రతల నేపథ్యంలో భారీ బందోబస్తు
కర్ణాటకలో(Karnataka) మసీదుల వివాదం మళ్లీ రాజుకుంది. మాండ్యతో(Mandya) పాటు శ్రీరంగపట్నంలో వీహెచ్‌పీతో పాటు భజరంగ్‌దళ్ కార్యకర్తలు భారీ ఆందోళనలు చేపట్టారు. హిందూ ఆలయాలను కూలగొట్టి మసీదులను కట్టారని ఆరోపిస్తూ...
కర్ణాటకలో(Karnataka) మసీదుల వివాదం మళ్లీ రాజుకుంది. మాండ్యతో(Mandya) పాటు శ్రీరంగపట్నంలో వీహెచ్‌పీతో పాటు భజరంగ్‌దళ్ కార్యకర్తలు భారీ ఆందోళనలు చేపట్టారు. హిందూ ఆలయాలను కూలగొట్టి మసీదులను కట్టారని ఆరోపిస్తూ హిందూ సంస్థలు మసీదుల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. శ్రీరంగపట్నం లోని జామియా మసీదు దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి విశ్వహిందూ పరిషత్(VHP), భజరంగ్ దళ్‌కు చెందిన కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులను వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. మసీదు వెలుపల బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ ప్లాటూన్లు, ఇతర భద్రతా బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. మాండ్యాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. మాండ్యాలో సెక్షన్ 144 విధించారు. ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశించారు. జూన్ 3 మధ్యాహ్నం 3 గంటల నుంచి జూన్ 5 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీసులు చెప్పారు.
మరోవైపు కర్ణాటకలో హిజాబ్ వివాదం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. మంగుళూరు విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీకి రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వాళ్లు దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. హిజాబ్ ధరించి, కాలేజీలోకి వెళ్లేలా అనుమతించాలని కోరారు. దీనిపై స్పందించిన ఆయన.. హిజాబ్‌గానీ, కాషాయ కండువాలు గానీ ధరించి కాలేజీలోకి రాకూడదంటూ అధికారులు తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి