AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఒకే రకమైన ఆహారంతో ‘మయోసైటిస్’పై పోరాటం.. సామ్ మార్నింగ్ రొటీన్ ఇదే!

వెండితెరపై తన నటనతో, అందంతో మాయ చేసే ఆ నటి.. నిజ జీవితంలో ఒక పోరాట యోధురాలు. మయోసైటిస్ వంటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటూనే, తన శరీరాన్ని, మనస్సును పాజిటివ్‌గా ఎలా మలచుకుందో వివరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది సామ్.

Samantha: ఒకే రకమైన ఆహారంతో ‘మయోసైటిస్’పై పోరాటం.. సామ్ మార్నింగ్ రొటీన్ ఇదే!
Samanthaah Ruth Prabhu
Nikhil
|

Updated on: Feb 27, 2026 | 6:00 AM

Share

కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ప్రాణశక్తిని పెంచుకోవడానికి ఆమె పాటిస్తున్న కఠినమైన క్రమశిక్షణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఒకప్పుడు కేవలం అందంగా కనిపించడానికి తాపత్రయపడేది. కానీ కాలం ఆమెను ఒక కఠినమైన పరీక్షకు గురిచేసింది. కండరాల వాపు, తీవ్రమైన నొప్పితో బాధపెట్టే ఆటో ఇమ్యూన్ కండిషన్ ఆమెను చుట్టుముట్టింది. అప్పటి నుండి ఆమె ప్రయాణం కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. అది ఒక మనుగడ పోరాటంగా మారింది. గత నాలుగేళ్లుగా తన శరీరాన్ని, మనస్సును పునర్నిర్మించుకుంటూ మునుపటి కంటే రెట్టింపు శక్తితో కనిపిస్తున్న ఆ స్టార్ మరెవరో కాదు.. సమంత రూత్ ప్రభు.

ప్రశాంతమైన ఉదయం..

వోగ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవడం ఆమెకు అలవాటు. మేల్కొన్న తర్వాత కొద్దిసేపు ప్రార్థనలు చేసుకుని, బయట ప్రకృతిలో సూర్యరశ్మి తగిలేలా కాసేపు గడుపుతుంది. ఆ తర్వాత ధ్యానం చేస్తుంది. ఈ ప్రక్రియ కోసం ఆమె సుమారు ఒకటిన్నర గంటల సమయం కేటాయిస్తుంది. ఎవరి ప్రమేయం లేని ఈ ‘మీ టైమ్’ తనను మానసికంగా దృఢంగా ఉంచుతుందని సమంత నమ్ముతోంది.

సమంత వెల్లడించిన విషయాల్లో అత్యంత ఆశ్చర్యకరమైనది ఆమె డైట్. దాదాపు ఒక సంవత్సరం పాటు ఆమె ప్రతిరోజూ ఒకే రకమైన కూరగాయలు, చికెన్ వంటకాలను మాత్రమే తిన్నానని చెప్పింది. మయోసైటిస్ సమస్య ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు శరీరంలో మంటను పెంచుతాయి. అందుకే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తన శరీరాన్ని హీలింగ్ చేసుకోవడమే లక్ష్యంగా ఆమె ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. క్రమంగా చీట్ మీల్స్ తినాలనే కోరిక కూడా తనకు చచ్చిపోయిందని ఆమె తెలిపింది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్..

ప్రముఖ పోషకాహార నిపుణుడు రయాన్ ఫెర్నాండోతో జరిగిన సంభాషణలో సమంత మరిన్ని వివరాలు పంచుకుంది. ఆమె ప్రస్తుతం ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ డైట్‌ను అనుసరిస్తోంది. “చిన్నతనంలో నేను ఏది తిన్నా బరువు పెరిగేదానిని కాదు, అందుకే ఆహారం విషయంలో అశ్రద్ధగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం బరువు తగ్గడం కాదని తెలుసుకున్నాను. శరీరంలో వాపు అనేది రకరకాలుగా కనిపిస్తుంది.

ఏది మన శరీరానికి పడదో గుర్తించి, దానిని పూర్తిగా దూరం పెట్టడమే ఉత్తమం” అని సమంత వివరించింది. సమంత జీవితం ఇప్పుడు ఒక నిరంతర సాధన. రోగం వచ్చింది కదా అని కుంగిపోకుండా, క్రమశిక్షణతో దానిని ఎలా జయించాలో ఆమె నిరూపిస్తోంది. ఫిట్‌నెస్ అంటే కేవలం జిమ్‌లో కష్టపడటమే కాదు, మనం తినే ఆహారం, మనం ఆలోచించే విధానం కూడా అని ఆమె తన ప్రయాణం ద్వారా చాటి చెబుతోంది.

Follow Us