AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Rains: ఎక్కడివారు అక్కడే ఉండండి.. యాత్రికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెచ్చరిక..

ఉత్తరాఖండ్‌లో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం మెరుగుపడే వరకు హిమాలయాల దేవాలయాలకు వెళ్లవద్దని చార్ధమ్ యాత్రికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది...

Uttarakhand Rains: ఎక్కడివారు అక్కడే ఉండండి.. యాత్రికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెచ్చరిక..
Khand
Srinivas Chekkilla
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 18, 2021 | 8:27 PM

Share

ఉత్తరాఖండ్‌లో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నేపాల్‌కు చెందిన ముగ్గురు కూలీలు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. వాతావరణం మెరుగుపడే వరకు హిమాలయాల దేవాలయాలకు వెళ్లవద్దని చార్ధమ్ యాత్రికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పౌరీ జిల్లాలోని లాన్స్‌డౌన్ సమీపంలోని సంఖల్ వద్ద ఒక గుడారంలో కూలీలు ఉంటున్నారని, వర్షాల కారణంగా పైనుంచి వరద ప్రవహించడంతో ముగ్గురు గల్లంతయ్యారని జిల్లా మేజిస్ట్రేట్ విజయ్ కుమార్ జోగ్దాండే తెలిపారు. వారు ఆ ప్రాంతంలో హోటల్ నిర్మాణ పని చేస్తున్నారని చెప్పారు. గాయపడిన వారిని కోట్ద్వార్ బేస్ ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం నాటికి హరిద్వార్, రిషికేష్‌కి వచ్చిన చార్ధామ్ యాత్రికులు వాతావరణం మెరుగుపడే వరకు ముందుకు వెళ్లవద్దని కోరారు.

రిషికేశ్‌లోని చంద్రభాగ వంతెన, తపోవన్, లక్ష్మణ్ జూలా, ముని-కి-రేతి భద్రకాళి వైపు ప్రయాణికుల వాహనాలు అనుమతించడం లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సచివాలయంలో పరిస్థితులను సమీక్షించారు. యాత్రికులు వాతావరణం సాధారణమయ్యే వరకు రెండు రోజుల పాటు తమ ప్రయాణాన్ని వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారు హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, టెహ్రీ, ఉత్తరకాశి, రుద్రప్రయాగ్, గుప్తకాశి, ఉఖిమఠ్, కర్ణప్రయాగ్, జోషిమఠ్, పాండకేశ్వర్ అంతటా సురక్షితమైన ప్రదేశాలలో ఉన్నారని తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధామితో ఫోన్‌లో మాట్లాడారు. అన్ని విధాల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి నుంచి కేదార్‌నాథ్‌లో వర్షం పడుతోంది. అయితే మందాకిని నది సాధారణ స్థాయిలో ప్రవహిస్తోంది. నాలుగు హిమాలయాల దేవాలయాల్లో సాధారణ ప్రార్థనలు కొనసాగుతున్నాయని, అక్కడ ఉండే భక్తులు సురక్షితంగా ఉన్నారని దేవస్థానం బోర్డు అధికారి ఒకరు తెలిపారు. యమునోత్రికి వెళ్లే యాత్రికులు బాద్‌కోట్, జంకిచట్టిలో ఉండాలని కోరారు. అయితే గంగోత్రికి వెళ్లేవారు హర్సిల్, భట్వారీ, మానేరిలో ఉండాలన్నారు.

కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లే యాత్రికులు కూడా వాతావరణ పరిస్థితులు మెరుగయ్యే వరకు తమ ప్రయాణాన్ని కొనసాగించవద్దని అభ్యర్థించారు. బద్రీనాథ్ మార్గంలో చాలా మంది యాత్రికులు జోషిమఠ్, చమోలిలో ఉంటున్నారని చమోలి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఎన్‎కె జోషి తెలిపారు. కేదార్‌నాథ్‌లో ఆదివారం మొత్తం 6,000 మందిలో 4,000 మంది యాత్రికులు తిరిగి వచ్చారు. మిగిలిన వారు సురక్షిత ప్రదేశాలలో ఉన్నారు. వారిలో చాలా మందిని ముందు జాగ్రత్త చర్యగా లించౌలి, భీంబలిలో నిలిపివేసినట్లు రుద్రప్రయాగ్ విపత్తు నిర్వహణ అధికారి ఎన్ఎస్ సింగ్ తెలిపారు.

అక్టోబర్19 వరకు ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ జారీ చేసిన భారీ వర్ష హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని భక్తుల యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చార్ధామ్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఉత్తరాఖండ్ అంతటా చాలా విద్యా సంస్థలు సోమవారం మూసివేశారు. అయితే నందా దేవి బయోస్పియర్ రిజర్వ్, వివిధ అటవీ విభాగాలతో సహా రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్, పర్వతారోహణ, క్యాంపింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించారు. అక్టోబర్ 18-19 వరకు డెహ్రాడూన్‌లో నిర్వహించాల్సిన కవాతును వాయిదా చేశారు. అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాఖండ్‌లోని మొత్తం 13 జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also.. Live Video: డేంజరస్ యాక్సిడెంట్.. ప్రాణం తీసిన పోలీసు కారు.. ఒళ్లు గగ్గురుపొడిచే వీడియో వైరల్