Fake Army Colonel Arrest: నకిలీ ఆర్మీ కల్నల్ అరెస్ట్.. ఆర్మీ రిక్రూట్‌మెంట్ పేరిట రూ.40 కోట్లకుపైగా మోసం
ల్నల్‌గా నటిస్తూ ఆర్మీ రిక్రూట్‌మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ రిటైర్డ్ సైనికుడిని ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ మంగళవారం (సెప్టెంబర్ 12) అరెస్ట్ చేసింది. ఎంతో మంది యువతను మోసం చేసి కోట్ల సొమ్మును కొల్లగొట్టడంతో యూపీలోని గంగా నగర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ఎస్టీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. మోసానికి పాల్పడిన నిందితుడు రూ.40 కోట్లకు పైగా ఆస్తులను వెనకేసినట్లు విచారణలో..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కల్నల్‌గా నటిస్తూ ఆర్మీ రిక్రూట్‌మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ రిటైర్డ్ సైనికుడిని ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ మంగళవారం (సెప్టెంబర్ 12) అరెస్ట్ చేసింది. ఎంతో మంది యువతను మోసం చేసి కోట్ల సొమ్మును కొల్లగొట్టడంతో యూపీలోని గంగా నగర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ఎస్టీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. మోసానికి పాల్పడిన నిందితుడు రూ.40 కోట్లకు పైగా ఆస్తులను వెనకేసినట్లు విచారణలో తేలింది. అధికారులు అందించిన సమాచారం ప్రకారం..
ఆర్మీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతకు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేస్తోన్న నకిలీ ఆర్మీ కల్నల్ సత్యపాల్ యాదవ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అరెస్టు చేసింది. ఈ కేసులో నకిలీ కల్నల్ సత్యపాల్ యాదవ్‌ను విచారించగా పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎస్టీఎఫ్‌కి అందిన సమాచారం ప్రకారం నకిలీ కల్నల్ కుటుంబం మొత్తం మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఆర్మీ రిక్రూట్‌మెంట్ పేరిట యువతను మోసం చేస్తూ దాదాపు రూ.40 కోట్లకు పైగా విలువైన చర, స్థిరాస్తులను సంపాదించారు. ఈ క్రమంలో దాదాపు 34 మంది నిరుద్యోగ యువతను మోసం చేశారని, ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 15 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. నిందితుడి కొడుకు, కుటుంబం మొత్తం కలిసి ఈ ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కేసు గురించి ఏఎస్పీ, ఎస్టీఎఫ్ బ్రిజేష్ సింగ్ మాట్లాడుతూ..
మీరట్‌లోని గంగా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కసేరుబక్సర్ ప్రాంతంలోని నకిలీ కల్నల్ డీఎస్ చౌహాన్ నివాసంపై సోమవారం ఎస్టీఎఫ్ ఆకస్మిక దాడులు చేశారు. బులంద్‌షహర్ జిల్లాకు చెందిన నిందితుడు అసలు పేరు సత్యపాల్ సింగ్ యాదవ్. నిందితుడికి రజత్ యాదవ్, ప్రశాంత్ యాదవ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాడి సమయంలో వీరిద్దరు ఇంట్లో కనిపించలేదు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సత్యపాల్ పదవీ విరమణ చేసినప్పుడు అతని ఖాతాలో రూ.4 లక్షల 30 వేలు ఉన్నాయి. మోసం చేసి రూ.40 కోట్ల ఆస్తిని సంపాదించాడు. కల్నల్ యూనిఫాం ధరించి మోసాలకు పాల్పడేవాడు. నిందితుడి ఇంటి నుంచి 8 నకిలీ గుర్తింపు కార్డులు, 2 మొబైల్ ఫోన్లు, 5 రబ్బర్ స్టాంపులు, 1 ప్రింటర్, 5 జాయినింగ్ లెటర్లు, 38 స్పీడ్ పోస్ట్ స్లిప్‌లను ఎస్టీఎఫ్ స్వాధీనం చేసుకుంది.
వివిధ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను మోసం చేసిన సత్యపాల్ సింగ్ యాదవ్ తనను తాను రిక్రూట్‌మెంట్ బోర్డు కల్నల్‌గా పరిచయం చేసుకునేవాడు. కేవలం 10వ తరగతి మాత్రమే ఉత్తీర్ణుడైన సత్యపాల్ సింగ్ యాదవ్ 1985లో ఆర్మీలో చేరాడు. 2003లో నాయక్ ర్యాంక్‌తో భారత సైన్యంలో పనిచేసి రిటైరయ్యాడు. మూడేళ్ల తర్వాత సత్యపాల్‌కు పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత డబ్బు సంపాదించేందుకు మోసాలు ప్రారంభించాడు. దాడి సమయంలో సత్యపాల్ తన ఇంట్లోనే ఉండి సైన్యంలో రిక్రూట్‌మెంట్ గురించి కొంతమంది యువతతో మాట్లాడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సత్యపాల్ కల్నల్ డ్రెస్‌లో కనిపించేవాడు. అక్కడే ఉన్న మరి కొందరు యువకులు ఆర్మీ డ్రెస్‌లో ఉండటంతో బాధితులకు అనుమానం వచ్చేది కాదు. అంతేకాకుండా అతను కల్నల్ నేమ్‌ప్లేట్‌ను కూడా తయారు చేసిపెట్టుకున్నాడు.
నకిలీ కల్నల్ మోసం ఎలా బయటపడిందంటే..
ఓ వ్యక్తి తన సోదరిని ఆర్మీలో ఎల్‌డీసీ క్లర్క్‌గా రిక్రూట్‌మెంట్ ఇప్పిస్తానని నమ్మబలికి రెండేళ్ల క్రితం నిందితుడికి రూ.16 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఏడాది మే నెలలో యువకుడి సోదరి పేరు మీద సత్యపాల్ జాయినింగ్ లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ తీసుకుని మే 7వ తేదీన జాయినింగ్ లెటర్‌తో లక్నోలోని రిక్రూట్‌మెంట్ ఆఫీస్ హెడ్ క్వార్టర్‌కు వెళ్లగా ఈ మోసం బయటపడింది. దీంతో అప్రమత్తమైన ఆర్మీ అధికారులు సత్యపాల్ యాదవ్ నివాసంపై దాడి చేసి అరెస్ట్ చేశారు. పూణేలో కల్నల్ కారును తాను నడిపేవాడినని, అందుకే కల్నల్ మాట్లాడే విధానం, ఇతర వివరాలు తనకు తెలుసునని పోలీసులకు చెప్పాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.