UP CM: యూపీ ప్రభుత్వంలో మార్పులు అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్
UP CM: ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయని వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు..
UP Government: ఒక వైపు ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో వైపు రెండు వారాలుగా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుల మధ్య జరుగుతున్న సమావేశాలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ చర్చల నడుమ ప్రభుత్వం, సంస్థాగత మార్పులతో పాటు నాయకత్వం మార్పు గురించి పెద్ద ఎత్తున ఊహగానాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ ఊహగానాల్లో ఏదీ నిజం కాలేదు. ఈ వదంతుల ప్రచారాలకు ప్రధాన కారణం ఓ వ్యక్తి. ఆయన పేరు అరవింద్ కుమార్ శర్మ. మాజీ బ్యూరోక్రాట్. ప్రధాని మోదీకి చాలా సన్నిహితుడిగా చెబుతుంటారు. పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు ఈ ఏడాది జనవరిలో శర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన బీజేపీలో చేరారు. వచ్చి రాగానే శాసన మండలికి పంపింది బీజేపీ అధిష్టానం. ఒకదాని వెంట ఒకటిగా పార్టీ వేగంగా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పు జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అరవింద్ శర్మను సీఎంగా చేయవచ్చని కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తుండగా, మరోవైపు డిప్యూటీ సీఎం, లేదా హోంశాఖ వంటి ముఖ్యమైన పోర్ట్ పోలియోతో కేబినెట్‌లోకి తీసుకుంటారని కూడా ప్రచారం జోరుగా సాగింది.
అరవింద్ శర్మకు ఇంత ప్రాధాన్యమివ్వడం వెనక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభావాన్ని తగ్గించాలన్న ప్రయత్నాలు ఉన్నాయని బహిరంగంగానే బీజేపీ నేతలు చర్చించుకున్నారు. కానీ, నాలుగు నెలలు గడిచినా అరవింద్ శర్మకు కేబినెట్‌లో స్థానంగానీ, మరే ఇతర ముఖ్యమైన బాధ్యత గానీ ఇవ్వలేదు. ఈ వార్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు జరగడం లేదని స్పష్టం చేశారు. అవి కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించే మీడియా హెడ్డింగులు మాత్రమేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. యోగి మంత్రివర్గంలో మార్పులు జరగనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై యోగిని ప్రశ్నించగా పై విధంగా స్పందించారు.
బీజేపీ పార్టీ పూర్తిగా కార్యకర్తల నిర్వహణలో నడిపే పార్టీ అని, ఈ పార్టీలో వారసత్వ రాజకీయాలకు తావు లేదు. అందుకే ఈ పార్టీలో తరుచూ సమావేశాలు జరుగుతుంటాయి. మా పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ ప్రతి రెండు నెలలకు ఒకసారి రాష్ట్రానికి వస్తారు. నాలుగు నెలల క్రితమే పార్టీ అధినేత జేపీ నడ్డా వచ్చారు. ఇలా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. వీటిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వంలో మార్పులు జరుగుతున్నాయి అనడం సరైంది కాదు. అంతా అవాస్తవమని యోగి ఆదిత్యానాథ్ అన్నారు.
ఇవీ కూడా చదవండి