ఇద్దరు పిల్లలున్నవారికే ఇక యూపీలో అన్ని ప్రయోజనాలు..కొత్త ముసాయిదా బిల్లుకు రూపకల్పన
రాష్ట్రంలో జనాభాను అదుపు చేయాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. పాపులేషన్ కంట్రోల్ పేరిట ఓ బిల్లు ముసాయిదాను రూపొందించింది. ఇద్దరికి మించి సంతానం ఉన్నవారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు వారు దరఖాస్తు చేయజాలరని,..
రాష్ట్రంలో జనాభాను అదుపు చేయాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. పాపులేషన్ కంట్రోల్ పేరిట ఓ బిల్లు ముసాయిదాను రూపొందించింది. ఇద్దరికి మించి సంతానం ఉన్నవారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు వారు దరఖాస్తు చేయజాలరని, సర్కార్ నుంచి ఏ విధమైన సబ్సిడీనైనా పొందజాలరని ఈ ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ కంట్రోల్, స్టెబిలైజేషన్ అండ్ వెల్ ఫేర్ బిల్లు-2021 పేరిట దీన్ని యూపీ లా కమిషన్ రూపొందించింది. ఈ బిల్లును మెరుగుపరచేందుకు ఈ నెల 19 లోగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఈ కమిషన్ తన వెబ్ సైట్ లో పేర్కొంది. ఇద్దరు బిడ్డలున్న ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసులో రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఉంటాయని, పూర్తి వేతనంతో 12 నెలలు మెటర్నిటీ లేదా పెటర్నిటీ లీవ్ సౌకర్యం ఉంటుందని ఇందులో వివరించారు. నేషనల్ పెన్షన్ పథకం కింద యజమానుల (ప్రభుత్వ) కాంట్రిబ్యూషన్ లో మూడు శాతం పెరుగుదల ఉంటుందని..కుటుంబ నియంత్రణకు సంబంధించి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
ఈ చట్టం అమలుకు స్టేట్ పాపులేషన్ ఫండ్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని సెకండరీ స్కూళ్లల్లో జనాభా అదుపునకు సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి తప్పనిసరిగా ఉండాలని.. రాష్ట్ర అభివృద్ధికి పాపులేషన్ కంట్రోల్ అనివార్యమని ఈ ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. అస్సాంలో కూడా ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ఇలాగే ఇద్దరు బిడ్డల పాలసీకి శ్రీకారం చుట్టారు. ఇందుకు విధివిధానాల అమలుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే పాపులేషన్ కంట్రోల్ విషయంలో యూపీ ప్రభుత్వం ఏకంగా ఓ బిల్లునే తేవడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి : ఈ లిబర్టీ స్టాచ్యూను కొరుక్కు తినొచ్చు..!చాక్లెట్‌తో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తయారీ!వీడియో వైరల్..:Statue Of Liberty With Chocolate Video.