23 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన గజదొంగ.. వచ్చీరాగానే గుడికి 101 కిలోల గంట విరాళం!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ సెంట్రల్ జైలు నుంచి వారం రోజుల క్రితం నజ్జు అలియాస్ రజ్జు అనే ఖైదీ విడుదలయ్యాడు. దాదాపు 12 ఏళ్ల పాటు స్థానికంగా ఎన్నో దొంగతనాలకు పాల్పడిన నజ్జు 23 ఏళ్ల జైలు శిక్ష అనంతరం విడులయ్యాడు. ప్రస్తుతం అతనికి 58 ఏళ్లు. వయోబారం వల్ల మారాడో, జైలు జీవితం నిజంగానే అతనిలో మార్పుతెచ్చిందో తెలియదుగానీ మొత్తానికి సత్ర్పవర్తనతో సమాజంలో..
లక్నో, ఆగస్ట్ 2: సుమారు 23 ఏళ్ల తర్వాత ఇటీవల సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఓ దొంగ గుడికి ఏకంగా 101 కిలోల గంట దానం చేశాడు. అంతేకాకుండా దొంగతనాలకు దూరంగా ఉండండంటూ యువ తరానికి సందేశం కూడా ఇచ్చాడు. మంచి వాడిగా మారిన ఈ గజదొంగ వ్యవహారం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ సెంట్రల్ జైలు నుంచి వారం రోజుల క్రితం నజ్జు అలియాస్ రజ్జు అనే ఖైదీ విడుదలయ్యాడు. దాదాపు 12 ఏళ్ల పాటు స్థానికంగా ఎన్నో దొంగతనాలకు పాల్పడిన నజ్జు 23 ఏళ్ల జైలు శిక్ష అనంతరం విడులయ్యాడు. ప్రస్తుతం అతనికి 58 ఏళ్లు. వయోబారం వల్ల మారాడో, జైలు జీవితం నిజంగానే అతనిలో మార్పుతెచ్చిందో తెలియదుగానీ మొత్తానికి సత్ర్పవర్తనతో సమాజంలో జీవించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. జైలు నుంచి బయటికి వచ్చీరాగానే షాజహాన్‌పూర్‌లోని ఓ ఆలయంలో 101 కిలోల గంటను దానంగా ఇచ్చాడు. సోమవారం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కత్రా అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్ నజ్జుని ప్రసంశించారు.
ఎమ్మెల్యేతో కలిసి నజ్జు గంట పరూర్ ప్రాంతంలోని ఆలయంలోసమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. ‘అవర్ రెస్పెక్టెడ్ అంకుల్.. నజ్జు జైలులో చాలా కష్టపడ్డాడు. అతను చేసిన నేరాలకు 23 ఏళ్ల శిక్ష అనుభవించాడు. 23 ఏళ్ల తర్వాత విడుదలైన ఆయనకు నేను స్వాగతం పలుకుతున్నాను. నేర జీవితానికి స్వస్థి పలికి సమాజ స్రవంతిలో కలవాలనుకునే వారికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను’ అని వీర్ విక్రమ్ సింగ్ అన్నారు. తాను చేసిన నేరాలకు పశ్చాత్తాపపడ్డానని నజ్జు తెలిపాడు. నేరాలకు దూరంగా ఉండాలని, కుటుంబం పట్ల శ్రద్ధతో జీవితం గడపాలని నజ్జు యువ తరానికి విజ్ఞప్తి చేశాడు. అనంతరం ఆలయంలో దేవుని ఎదుట తాను చేసిన నేరాలకు క్షమాపణలు చెప్పాడు. ఇకపై నేరాలకు దూరంగా ఉంటూ సాధారణ జీవితాన్ని గడుపుతానని ప్రతిజ్ఞ చేశాడు.
కాగా నజ్జుపై జిల్లాలో 15 కేసులు ఉన్నాయి. 1999లో అతను ముగ్గురు ఎస్సైలను, ఒక పోలీస్‌ను కాల్చి చంపాడు. అదే ఏడాది పోలీసులు అతన్ని బంధించగా కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అతను బరేలీ సెంట్రల్ జైలులో 23 ఏళ్లు శిక్ష అనుభవించాడు. షాజహాన్‌పూర్, బరేలీ, ఫరూఖాబాద్, బుదౌన్, ఎటా, హర్దోయ్ జిల్లాల్లో నజ్జూ ముఠా ఎన్నో నేరాలకు పాల్పడింది.