TREIRB Exams: నేటి నుంచి గురుకుల నియామక పరీక్షలు ప్రారంభం.. 15 నిముషాల ముందే గేట్ల మూసివేత
రాష్ట్ర వ్యాప్తంగా నేడు గురుకుల విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు నియామక రాత పరీక్షలు మంగళవారం (ఆగస్టు 1) నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు వరుసగా 19 రోజుల పాటు రోజుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నట్లు ఇప్పటికే తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొంది. మొదటి షిఫ్టు ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30గంటల వరకు..
హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్ర వ్యాప్తంగా నేడు గురుకుల విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు నియామక రాత పరీక్షలు మంగళవారం (ఆగస్టు 1) నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు వరుసగా 19 రోజుల పాటు రోజుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నట్లు ఇప్పటికే తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొంది. మొదటి షిఫ్టు ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30గంటల వరకు రెండోసెషన్, సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు మూడోసెషన్ పరీక్ష ఉంటుంది. ప్రతి సెషన్‌లో పరీక్ష 120 నిముషాల పాటు జరుగుతుంది.
మంగళవారం ఉదయం మొదటి సెషన్ పరీక్ష ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్ధులు హడావిడిగా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేశారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించారు. హాల్ టికెట్‌తోపాటు పాస్‌పోర్టు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్.. వంటి ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డు ఉన్న వారిని మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కొన్ని చోట్ల సరైన గుర్తింపు పత్రాలు లేనివారిని పరీక్షకు అనుమతించలేదు.
హాజరయ్యేవారికి గురుకుల బోర్డు 28 రకాల నిబంధనలను ఇప్పటికే జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని, బూట్లు ధరించిన వారికి లోనికి అనుమతించబోమని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్యబట్టు సోమవారం స్పష్టం చేశారు. మరోవైపు మూడు పేపర్లకు పరీక్ష జరగనుండగా.. ఒక్కో పరీక్షకు ఒక్కో చోట పరీక్ష కేంద్రాల కేటాయింపు జరగడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణించడం సవాల్‌గా మరిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా ఎలా రాయగలమని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.