మహానగరంలో ఘరానా మోసం.. ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ పేరిట 2 కోట్ల రూపాయలు లూటీ..!
జీవిత బీమా పాలసీని (లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ) రెన్యువల్ చేయిస్తానని నమ్మబలికి ఇద్దరు కేటుగాళ్లు ఓ వృద్ధుడి వద్ద రూ.2.7 కోట్లు కాజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు..
జీవిత బీమా పాలసీని (లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ) రెన్యువల్ చేయిస్తానని నమ్మబలికి ఇద్దరు కేటుగాళ్లు ఓ వృద్ధుడి వద్ద రూ.2.7 కోట్లు కాజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. నోయిడా ఏడీసీపీ అశుతోష్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన సెక్టార్ 20 పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాధితుడు (79) 2005లో తాను పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీ నుంచి పదవీ విరమణ పొందాడు. 2018లో వృద్ధుడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అతని బీమా పాలసీ ల్యాప్ అయిందని, పాలసీని రెన్యువల్ చేసేందుకు కొంత డబ్బు చెల్లించవలసి ఉంటుందని తెలియజేశాడు. దీంతో బాధితుడు 14 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు రూ. 2.7 కోట్లు జమ చేశాడు. అనంతరం మోసపోయానని తెలుసుకున్న బాధితుడు లభోదిభోమన్నాడు. దీనిపై 2020లో బాధితుడి కుమార్తె సెక్టార్ 20 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు మూడేళ్లు గాలించి జైపురియా ప్లాజా సమీపంలో సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారికి సంబంధించిన ఆరు బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. ఐతే డబ్బు ఇంకా రికవరీ కాలేదు. నిందితులను పంజాబ్‌కు చెందిన కరుణేష్ ద్వివేది, అనిల్ శర్మగా గుర్తించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘరనా మోసం సంచలనంగా మారింది. నకిలీ సిమ్‌కార్డుల ద్వారా ఐదుగురు వ్యక్తులతో కూడిన ఓ టీం వీరికి సహకరించినట్లు వెలుగులోకొచ్చింది. వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు ద్వివేది మీడియాకు తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.