AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Network: బార్క్ రేటింగ్స్ అంశంలో NBDA వ్యతిరేక ధోరణి.. బోర్డు నుంచి తప్పుకున్న టీవీ9 నెట్‌వర్క్..

దేశంలోని వార్తా ఛానళ్ల రేటింగ్స్‌ను(BARC) పునః ప్రారంభించడంలో న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్‌ అండ్ డిజిటల్ అసోసియేషన్(NBDA) వ్యతిరేక ధోరణిని తీవ్రంగా ఖండిస్తూ..

TV9 Network: బార్క్ రేటింగ్స్ అంశంలో NBDA వ్యతిరేక ధోరణి.. బోర్డు నుంచి తప్పుకున్న టీవీ9 నెట్‌వర్క్..
Tv9 Ceo
Ravi Kiran
|

Updated on: Jan 15, 2022 | 6:21 PM

Share

దేశంలోని వార్తా ఛానళ్ల రేటింగ్స్‌ను(BARC) పునః ప్రారంభించడంలో న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్‌ అండ్ డిజిటల్ అసోసియేషన్(NBDA) వ్యతిరేక ధోరణిని ఖండిస్తూ దేశంలోనే నెంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్, TV9 సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే NBDA సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీవీ9 నెట్‌వర్క్ సీఈవో బరుణ్ దాస్ NBDA బోర్డును ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను రాశారు. వార్తా చానళ్ల టీఆర్పీని ప్రారంభించాలని ప్రభుత్వం అనుమతించిన తర్వాత కూడా BARC డేటాపై సందేహాలను లేవనెత్తేలా.. NBDA రేటింగ్స్ విషయంలో జాప్యతను చూపిస్తుండటం నిరాశను కలిగిస్తోందని ఆయన అన్నారు.

ఈ నిర్ణయం బోర్డులోని పలువురు సభ్యులదిగా అనిపిస్తోంది. బార్క్ డేటా విశ్వసనీయతపై మరోసారి సందేహాలు లేవనెత్తేలా.. వార్తా చానళ్ల రేటింగ్స్ నిలిపేసేందుకు అసోషియేషన్ చేస్తున్న ఆరోపణలు తీవ్ర నిరాశకు గురి చేశాయి’ అని బరుణ్ దాస్ లేఖలో పేర్కొన్నారు. రేటింగ్స్ విషయంలో NBDA వ్యవహరిస్తున్న ధోరణి వార్తా చానళ్లపై పూర్తి వ్యతిరేకతకు అడ్డంపట్టేలా ఉందని బరుణ్ దాస్ అన్నారు. NBDAకు పలు ప్రశ్నలను సైతం సంధించారు.

1. అసలు ఎవరు BARC రేటింగ్‌లు నిలిపేశారు.? ఎందుకు? ఈ ప్రశ్నకు మీ దగ్గర నుంచి ఇప్పటిదాకా సరైన సమాధానం రాలేదు.

2. NBDA కాకపోతే, ఎవరు వార్తా చానళ్లకు రేటింగ్స్ ఇవ్వకుండా ఆపడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

3. ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు.. వాటిని తక్షణమే ఆపకుండా.. NBDA దాదాపు ఒక సంవత్సరం పాటు ఎందుకు కొనసాగేలా చేసింది.

4. వార్తా చానళ్ల రేటింగ్స్ విషయంలోనే లోపాలు ఉన్నాయని, మానిప్యులేషన్ / ట్యాంపరింగ్ జరుగుతోందని NBDA ఎందుకు భావిస్తుంది

ఇదిలా ఉంటే.. అక్టోబర్ 2021 నుంచి నిలిపేసిన వార్తా చానళ్ల బార్క్ రేటింగ్స్‌ను తక్షణమే ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార(I&B) మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రేటింగ్స్ నిలిపేయడంతో దాదాపు ఏడాది కాలంలో నుంచి నష్టాలు చవి చూస్తున్న అనేక న్యూస్ చానళ్లు, వివిధ స్టాక్ హోల్డర్స్ నిరంతరం కలిసికట్టుగా ప్రయత్నాలు చేయడంతో కేంద్రం నుంచి తాజాగా సానుకూల స్పందన వచ్చింది. అయితే అనూహ్యంగా NBDA.. టీఆర్‌పీని లెక్కించే ప్రక్రియలో మరింత పారదర్శకత, శాస్త్రీయత తీసుకురావడంతోపాటు లోపాలను అధిగమించేందుకు.. ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా మాన్యువల్ జోక్యం ఉండదని నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుందంటూ రేటింగ్స్‌లో జాప్యం చూపిస్తోంది.

“NBDAలోని సభ్యుడిగా ప్రతీసారి రేటింగ్స్‌ను తిరిగి ప్రారంభించే విషయంలో బోర్డుతో చర్చలు జరుపుతూ వచ్చాం. అయితే ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. న్యూస్ చానళ్లకు బార్క్ రేటింగ్‌లను తిరిగి ప్రారంభించాలని అసోసియేషన్‌ నిజంగానే కోరుకుంటుందో లేదో ఖచ్చితంగా తెలియట్లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో రేటింగ్స్ నిలుపదల వార్తా చానళ్లకు మరింత నష్టాలను చేకూరుస్తుంది’ అని బరుణ్ దాస్ లేఖలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం NBDA బార్క్ రేటింగ్స్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా నిరాశను కలిగించింది. వారి వ్యతిరేక వ్యవహార శైలికి నిరసనగా తక్షణమే NBDA సభ్యత్వాన్ని ఉపసంహరించుకోవడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని బరుణ్ దాస్ తెలిపారు. కాగా, రేటింగ్స్ ఆగిపోవడం వల్ల వార్తా చానళ్ల ఆదాయానికి పూర్తిగా దెబ్బ పడుతోందని బరుణ్ దాస్ అన్నారు. NBDA వ్యవహారశైలి ఓ అన్ ఫెయిర్ వే అని అభివర్ణించారు. దీని వల్ల ఎంతోమంది ప్రకటనదారులు బయటకి వెళ్ళిపోయే అవకాశం ఉందని అన్నారు.