Vijay Diwas 2022: చరిత్రలో ఎంతో ప్రత్యేకం ఈరోజు.. భారత సైన్యం దెబ్బకు తోకముడిచిన పాక్..
భారత సైన్యం ధైర్యసాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధ రంగంలోకి దిగితే.. విజయం సాధించాల్సిందే. శుత్రువు ఎలాంటి వారైనా తోకముడవాల్సిందే. ఈ విషయం ఎన్నో సార్లు..
భారత సైన్యం ధైర్యసాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధ రంగంలోకి దిగితే.. విజయం సాధించాల్సిందే. శుత్రువు ఎలాంటి వారైనా తోకముడవాల్సిందే. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమైంది. భారత సైన్యం అంటే ఎన్నో దేశాలకు వణుకు పుడుతుంది. భారత్‌తో యుద్ధమంటే వెనుకడుగు వేయాల్సిందే. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా.. భారత సైన్యంతో తలపడాలంటే ముందు వెనుకా ఆలోచించాల్సి పరిస్థితి. ఈ పరిస్థితికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 16వ తేదీ భారత దేశ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎప్పటికి మర్చిపోలేని రోజు కూడా.. భారత సైన్యం ఎంతో వీరోచితంగా పోరాడిన సందర్భం అంటే గుర్తుకొచ్చేది 1971 డిసెంబర్ 16. శత్రుసైన్యాలను తరిమికొట్టి జాతీయ పతాకాన్ని ఎగరేసిన రోజది. ఎందరో సైనికులు ప్రాణాలర్పించి, మాతృభూమికి విజయం అందించిన సమయం. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో శత్రు సైన్యాలను మట్టికరిపించి భారత జవాన్లు విజయం సాధించారు. ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా డిసెంబరు 16ను త్రివిధ దళాలు విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నాయి.
చరిత్రలో ఎంతో ప్రత్యేకం డిసెంబర్ 16
డిసెంబర్ 16 భారత సైనికుల ధైర్యసాహసాలకు సెల్యూట్ చేసే రోజు. 1971 యుద్ధంలో దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారతదేశం ముందు తమ ఆయుధాలను విడిచి వెనుకడుగు వేసిన రోజు. పాకిస్తాన్‌తో భారత్ సాధించిన విజయంతో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది. భారత్ నిత్యం పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటుంది. స్నేహ హస్తం అందించడంలో ముందుంటుంది. పొరుగు దేశాలకు కష్టమొస్తే.. ఒక అడుగు ముందుకేసి మేమున్నామంటూ భారత్ ఎన్నోసార్లు సహాయం చేసింది. అదే సమయంలో ఏదైనా పొరుగు దేశం హద్దులు దాటి మన సహనాన్ని పరీక్షిస్తే మాత్రం అంతే దీటుగా సమాధానం ఇస్తుంది. ఇతర దేశాలపై దండయాత్రను భారత్ కోరుకోదు. ఏ పొరుగు దేశాన్ని అణచివేయాలనే దృష్టితో ఆలోచించదు. ఇప్పటిరవకు అలా చేసిన దాఖలాలు లేవు. కాని ఇతర దేశాలవారు దాడి చేయడానికి వస్తే మాత్రం వెనక్కితగ్గే ప్రసక్తే ఉండదు. భారత్‌తో ఎందుకు పెట్టుకున్నామా అనిపించేలా ధీటైన జవాబు ఇస్తుంది భారత్. 1971 నాటి విజయ గాథ.. భారత సైనికుల అసమానమైన ధైర్యసాహసాల కథ.. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందనడంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు.
మానేక్షా నాయకత్వంలో
1971లో ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఫీల్డ్ మార్షల్ సామ్ హోర్ముస్జీ ఫ్రామ్‌జీ జమ్‌సెట్జీ మానేక్షా భారత సైన్యానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో ఈ యుద్ధంలో భారత్ పోరాడి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 1971లో మానెక్షా సమర్థ సైనిక నాయకత్వంలో జరిగిన యుద్ధంలో విజయం దేశానికి కొత్త విశ్వాసాన్ని ఇచ్చింది. ఆయన సేవలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి 1973 జనవరిలో ఆయనను ఫీల్డ్ మార్షల్‌గా నియమించారు. మత ప్రాతిపదికన మన దేశం నుంచి విడిపోయి పశ్చిమ, తూర్పు పాకిస్థాన్‌గా ఏర్పడింది. ఇప్పుడున్న బంగ్లాదేశ్‌నే అప్పుడు తూర్పు పాకిస్థాన్ అని పిలిచేవారు. పాకిస్థాన్ పశ్చిమ పాకిస్థాన్‌గా ఉండేది. తూర్పు పాకిస్థాన్‌పై పశ్చిమ పాకిస్థాన్ క్రూరమైన దురాగతాలకు పాల్పడేది. మారణహోమం, అత్యాచారం, మానవ హక్కుల ఉల్లంఘనలలో పశ్చిమ పాకిస్థాన్ అన్ని హద్దులను దాటింది. ఆ సమయంలోనే భారతదేశం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో చేరింది. తూర్పు పాకిస్థాన్ నుంచి పశ్చిమ పాకిస్థాన్ అధికారాన్ని వదులుకునేలా భారత్ చేసింది.
పురుడు పోసుకున్న బంగ్లాదేశ్
భారత బలగాల ధైర్యసాహసాలు, దృఢ సంకల్పం కారణంగా.. 24 సంవత్సరాలుగా అణచివేత, దురాగతాలకు గురవుతున్న అప్పటి తూర్పు పాకిస్థాన్‌లోని కోట్లాది మంది ప్రజలు విముక్తి పొందారు. సరిగ్గా 1971 డిసెంబర్ 16న ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ రూపంలో కొత్త దేశం పుట్టింది. అప్పటి నుంచి భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటుంది. విజయ్ దివస్ 1971లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అద్భుత విజయాన్ని స్మరించుకోవడమే కాకుండా బంగ్లాదేశ్ పుట్టిన కథను కూడా తెలియజేస్తుంది.
‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి ప్రధాని మోదీ
విజయ్ దివస్ సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఆర్మీ హౌస్‌లో జరిగిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు. 1971 యుద్ధంలో విజయానికి కారణమైన సాయుధ బలగాల పరాక్రమాన్ని భారతదేశం ఎప్పటికీ మరచిపోదని ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు.
On the eve of Vijay Diwas, attended the ‘At Home’ reception at Army House. India will never forget the valour of our Armed Forces that led to the win in the 1971 war. pic.twitter.com/apG69cObzw
— Narendra Modi (@narendramodi) December 15, 2022
#VijayDiwas#16December marks the historic victory of #IndianArmedForces over Pakistan in the #LiberationWar1971. On this day, let us salute the courage & fortitude displayed by #IndianArmedForces in the 1971 Liberation War.#IndianArmy#InStrideWithTheFuture pic.twitter.com/vkotPUNh7W
— ADG PI – INDIAN ARMY (@adgpi) December 16, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..