Amit Shah: రెండేళ్లలో మావోయిస్టుల నిర్మూలన.. అమిత్‌షా కీలక ప్రకటన
రెండేళ్లలో దేశవ్యాప్తంగా మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు , సీఎస్‌లతో అమిత్‌షా సమావేశమయ్యారు

రానున్న రెండేళ్లలో దేశంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం పూర్తవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు , చీఫ్ సెక్రటరీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చత్తీస్‌గఢ్ , ఏపీ, తెలంగాణ , జార్ఖండ్ , బిహార్ , ఒడిశా , మహారాష్ట్ర రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. చత్తీస్‌గడ్‌లో అభివృద్ది కార్యక్రమాలతో నక్సలిజం తగ్గుముఖం పట్టిందన్నారు అమిత్‌షా. మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు కనుమరుగవుతారని అన్నారు. చత్తీస్‌గడ్‌లో బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డాక ఎన్‌కౌంటర్లలో 189 మంది మావోయిస్టులు చనిపోయారని వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందన్నారు అమిత్‌షా.
మావోయిస్టులపై ప్రభావిత రాష్ట్రాలు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసులకు అధునాతన ఆయుధాలను సమకూరుస్తునట్టు వెల్లడించారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి అభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. హింసను వీడాలని పిలుపునిచ్చారు. జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తోందని , వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు అమిత్‌షా. అలాంటి పార్టీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందో రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.




