Gram Swaraj: మీ గ్రామానికి ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి..? ఎంత ఖర్చు పెట్టారు..? ఈ యాప్‌తో మీరు తెలుసుకోవచ్చు..
మీ గ్రామానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత నిధులు కేటాయించింది..? ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని నిధులు వచ్చాయి..? ఇప్పటివరకు ఎంతవరకు ఖర్చు పెట్టారు? అనే వివరాలు మీకు తెలుసుకోవాలని ఉందా..? ఇవి ఎలా తెలుసుకోవచ్చు అని మీరు ఆలోచిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వ యాప్ ద్వారా మీరు తెలుసుకునే అవకాశముంది.

గ్రామాలే దేశానికి వెన్నెముక అని అంటూ ఉంటారు. గ్రామాలు అభివృద్ది చెందినప్పుడే దేశం పురోగతి సాధించినట్లు అని చెబుతుంటారు. ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు దేశంలో చాలానే ఉన్నాయి. అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోక చాలా గ్రామాల్లో కరెంట్, నీళ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. ప్రభుత్వం గ్రామ అభివృద్దికి నిధులు కేటాయించినా.. వాటిని ఖర్చు చేయకోపోతే గ్రామస్తులకు తెలియదు. ఈ సమస్యను పరిష్కరించి నిధుల్లో పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామ స్వరాజ్య పేరుతో ఒక యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ సహాయంతో మీ గ్రామానికి ప్రభుత్వాలు ఎంత నిధులు కేటాయించాయి? అనే వివరాలు తెలుసుకోవచ్చు.
ఎలా చెక్ చేయాలి..?
గూగుల్ ప్లే స్టోర్‌లో గ్రామ స్వరాజ్య అనే పేరుపై యాప్ అందుబాటులో ఉంది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్‌లోకి లాగిన్ అయి మీ స్టేట్, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ, ఊరి పేరును ఎంచుకుని సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, అప్రూవ్డ్ యాక్టివిటీస్, ఈఆర్ డీటైల్స్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు అప్రూవ్డ్ యాక్టివిటీస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ గ్రామంలో ఏయే పనులకు ఎంత నిధులు కేటాయించారు..? ఎంత నిధులు ఖర్చు చేశారు? అనే వివరాలు క్లియర్‌గా కనిపిస్తాయి. ఇక ఫైనాన్షియల్ ఆప్షన్ ఎంచుకుంటే ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని నిధులు వచ్చాయనే వివరాలు కనిపిస్తాయి.
జనాభా ప్రతిపాదికన నిధులు
పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రతిపాదికన ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాయి. నీటి సౌకర్యం, రోడ్లు, వీధిలైట్లు, పారిశుద్దం లాంటి మౌలిక వసతులకు ఈ నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సర్పంచ్, గ్రామ పంచాయతీ అధికారులు ఈ నిధులను సక్రమంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులు గోల్ మాల్ జరుగుతున్నాయి. అక్రమంగా దారి మళ్లిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకొచ్చింది.




