Chandrabose: కెరీర్ ప్రారంభంలో 100 అవమానాలకు టార్గెట్ పెట్టుకున్న చంద్రబోస్.. చివరకు
తెలంగానలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన చంద్రబోస్, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, ఇంజనీరింగ్ చదివి, సినీ పరిశ్రమలో ప్రముఖ గేయ రచయితగా స్థిరపడ్డారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని, వాటిని విజయ సోపానాలుగా మలచుకున్నారు. వేల సినిమా పాటలు రాసి, తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రముఖ టాలీవుడ్ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ఇటీవల ఒక సందర్భంలో వెల్లడించారు. తన బాల్యం, సినీ రంగంలోకి ప్రవేశించిన తీరు, అక్కడ ఎదురైన అనుభవాలు, పట్టుదలతో ఎలా విజయం సాధించారనే విషయాలు చాలామందికి ఇన్‌స్పిరేషన్. చంద్రబోస్ చిట్యాల మండలంలోని చెల్లగరిగ అనే చిన్న గ్రామం నుంచి వచ్చారు. వారిది సాహిత్య, సంగీత నేపథ్యం లేని సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి ప్రైమరీ స్కూల్ టీచర్ కాగా, తల్లి వ్యవసాయ కూలి. నలుగురు పిల్లలతో కుటుంబాన్ని పోషించడానికి తల్లిదండ్రులు పడిన కష్టాలను ఆయన గుర్తుచేసుకున్నారు. బాల్యంలోనే మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు, బాధలు, బరువులను అనుభవించానని, ఈ కష్టాలే నేటి తన అభివృద్ధికి సోపానాలు అయ్యాయని ఆయన మనస్ఫూర్తిగా చెప్పారు.
ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిగా, ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థిగా, మహాసాగరం లాంటి సినిమా రంగంలోకి ప్రవేశించడం ఒక పెద్ద సవాలుగా నిలిచింది. ఆయన పరిశ్రమలోకి అడుగుపెట్టిన సందర్భంలో వేటూరి, శాస్త్రి వంటి గొప్ప రచయితలు ఉధృతంగా కవిత్వం రాస్తున్నారని, వారి మధ్య తాను ఒక వామనుడిలా అడుగుపెట్టానని పేర్కొన్నారు. అయినప్పటికీ, వారి పక్కన చోటు సంపాదించుకుని, గత 20 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, వేల పాటలు రాశారని తెలిపారు. ఇది తాను ఊహించని విజయమని వివరించారు.
సినీ గేయ రచయితగా ప్రయత్నిస్తున్న తొలినాళ్లలో ఆయనకు అనేక అవమానాలు ఎదురయ్యాయి. సన్నగా, చిన్నగా ఉండే తనను చూసి, పాలిథిన్ కవర్‌లో పేపర్లు పట్టుకుని పాటలు రాస్తానని తిరుగుతుంటే, “నీకు పాండిత్యం తెలుసా, పద్యం తెలుసా, ఛందస్సు తెలుసా” అంటూ కొంతమంది వెక్కిరించేవారని గుర్తుచేసుకున్నారు. అయితే, ఆయన పట్టు వదలకుండా సినిమా రంగంలో రచయితగా స్థిరపడాలనే దృఢ సంకల్పంతో ఆ అవమానాలన్నిటినీ భరించారు. వాటిని సన్మానాలుగా మలుచుకోవాలనే నిశ్చయంతో పోరాడారు. ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా తన టెక్నికల్ బుర్రను ఉపయోగించి, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 100 అవమానాలను అనుభవించాలని నిర్ణయించుకున్నారు. వాటిని లెక్కబెట్టుకుంటూ కూర్చున్నానని, అయితే ఆశ్చర్యకరంగా 21వ అవమానం దగ్గర తన కష్టాలు ఆగిపోయి, సినిమాల్లో విజయం, మంచి అవకాశాలు వచ్చాయని, అవమానాలు సన్మానాలుగా మారాయని వివరించారు. ఇదే నేపథ్యంతో, “ఎవరెమి అనుకున్న.. నువ్వుండే రాజ్యానా… రాజు నువ్వే.. బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే” అనే అత్యంత ప్రీతిపాత్రమైన స్ఫూర్తిదాయక గీతాన్ని తాను రచించినట్లు తెలిపారు. ఈ పాటలో “అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు అనుకోవాలి” వంటి సందేశాలను అందించారు. అలాగే, నింగిలో తెల్ల మేఘం నల్లబడితేనే వర్షాలు కురుస్తాయని, చెట్టుపై పూలు రాలిపోతేనే పిందెలు కాస్తాయని, విజయం ముందు ఇక్కట్లు రావడం సహజమని తన పాట ద్వారా తెలియజేశారు.
