Oxygen: తన ప్లాంట్‌లో రూ.1కే సిలిండర్ నింపుతున్న మనోజ్ గుప్తా.. కోవిడ్ రోగులపై మానవత్వం చాటుతున్న వ్యాపారవేత్త
Oxygen Cylinders: దేశంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్ నేరుగా శ్వాస వ్యవస్థపైనే దెబ్బకొడుతోంది. దీంతో రోగులకు ఆక్సిజన్ ఎంతో అవసరం..
Oxygen Cylinders: దేశంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్ నేరుగా శ్వాస వ్యవస్థపైనే దెబ్బకొడుతోంది. దీంతో రోగులకు ఆక్సిజన్ ఎంతో అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత విపరీతంగా ఉంది. సరైన ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు. ప్రాణవాయువు లేక రోగులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ప్రాణదాతగా మారాడు. కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ నింపుతూ మానవత్వాన్ని చాటుతున్నారు.
యూపీలోని హమీర్‌పుర్ జిల్లాలోని సుమేర్‌పుర్ పారిశ్రామిక ప్రాంతంలో గల రిమ్‌ఝిమ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ యజమాని మనోజ్ గుప్తా తన ప్లాంట్‌లో రూపాయికే ఆక్సిజనప్ సిలిండర్‌ను నింపుతూ ఎంతో మంది కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. మనోజ్ గుప్తా కూడా గత ఏడాది కరోనా బారిన పడ్డారు. అప్పుడు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్న ఆయన.. ప్రస్తుతం ఆక్సిజన్ కొరతను చూసి ఎంతగానో చలించిపోయారట. అందుకే తనవంతుగా సాయంగా ఇలా ఒక్క రూపాయికే సిలిండర్ నింపేందుకు ముందుకు వచ్చారు.
అయితే నిజానికి తన ప్లాంట్‌తో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను ఉచితంగా అందించాలని మనోజ్ గుప్తా భావించారట. అయితే తమ ఉత్పత్తులకు బిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండటంతో కనీస ఛార్జీ కింద సిలిండర్‌కు ఒక రూపాయి చొప్పున తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్లాంట్‌లో రోజు 1000 సిలిండర్లను రీఫిల్లింగ్ చేసే సామర్థ్యం ఉందని, అన్నింటిని రూ.1 చొప్పున నింపుతున్నట్లు తెలిపారు. అయితే కరోనా రోగుల బంధువుల తమ ఆధార్ కార్డు, ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టు చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్లు నింపుతున్నట్లు వెల్లడించారు. దీంతో గుప్తా గురించి తెలిసి లక్‌నవూ, ఝాన్సీ, బందా, లలిత్‌పూర్, కాన్పూర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆయన ప్లాంట్‌కు వెళ్తున్నారు. కష్టకాలంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని ప్రాణదాతగా మారుతున్న ఆయనను ప్రశంసిస్తున్నారు.