Gold: 10 గ్రాముల బంగారం ధర రూ.25,000.. ఈ మ్యాజిక్ వెనుక లాజిక్ ఇదే!

9 క్యారెట్ల గోల్డ్ ను తీసుకువస్తే.. దాని 10 గ్రాముల విలువ 30 వేల రూపాయిల లోపే ఉంటుంది. దీంతో ఎక్కువమంది ఈరకం పుత్తడిని కొనడానికి అవకాశం లభిస్తుంది. మరి 24, 22 క్యారెట్ల బంగారం పరిస్థితి ఏమిటి? అసలు 9 క్యారెట్ గోల్డ్ వెనుక లాజిక్ ఏమిటి?

Gold: 10 గ్రాముల బంగారం ధర రూ.25,000.. ఈ మ్యాజిక్ వెనుక లాజిక్ ఇదే!
9 Carat Gold
Follow us
Gunneswara Rao

| Edited By: Ravi Panangapalli

Updated on: Sep 11, 2024 | 8:29 PM

తులం బంగారం దాదాపు 25 వేల రూపాయిలే. ఈ మాట వినడానికి చాలా హాయిగా ఉంటుంది. వెంటనే ఫేస్ లో అవునా అనే ఎక్స్ ప్రెషన్ వస్తుంది. పది గ్రాముల బంగారం ధర 70 వేల రూపాయిలకు పైగానే ఉంది. మరి దాదాపు 25 వేల రూపాయిలకు ఎలా వస్తుంది అనుకోవచ్చు. కానీ ఇది నిజమే. ఇక్కడ రేటులో నెంబర్లు ఏమీ మారలేదు. కాకపోతే పుత్తడి ధరలు నానాటికీ భారీగా పెరుగుతుండడంతో కేంద్రప్రభుత్వం గోల్డ్ ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. అందుకే తక్కువ క్యారెట్ల బంగారాన్ని అమ్మడానికి ఆలోచిస్తోంది. అంటే.. 24 క్యారెట్లు, 22 క్యారెట్లకు బదులు.. 9 క్యారెట్లన్న మాట. క్యారెట్ ఎప్పుడు తగ్గిందో.. దాని రేటు కూడా ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది.

9 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర.. 

9 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. దాదాపు 25 వేల నుంచి 30 వేల మధ్యలో ఉండే అవకాశముంది. అసలు ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చే ఛాన్సుంది? ముఖ్యంగా మహిళలు తక్కువ క్యారెట్ బంగారాన్ని ఆదరిస్తారా? రేటు పరంగా ఇది బంగారం లాంటి ఆఫర్ అని మధ్యతరగతివారు భావిస్తున్నారా? అసలు ఓవరాల్ గా 9 క్యారెట్ల గోల్డ్… బంగారం పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది?

10 గ్రా. బంగారానికి 2-3 నెలల సంపాదన ఖర్చు

10 గ్రా. బంగారానికి 2-3 నెలల సంపాదన ఖర్చు

ఆభరణాల తయారీలో 22, 18 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. అయినా సరే.. మన దేశంలో 24 క్యారెట్ల గోల్డ్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ దీనిని కొందామంటే.. సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. 10 గ్రాముల బంగారం ధర దాదాపు 73 వేల రూపాయిలు ఉంది. త్వరలో లక్ష రూపాయిలు చేరుతుందని అంటున్నారు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా తక్కువేమీ లేదు. 10 గ్రాములు దాదాపు 67 వేల రూపాయిలు ఉంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర చూస్తే.. దాదాపు 55 వేల రూపాయిలు ఉంది. అంటే కనీసం 10 గ్రాముల బంగారాన్ని కొనాలన్నా.. దీనికోసం రెండు, మూడు నెలల సంపాదనను ఖర్చు పెట్టాల్సిన వారే ఎక్కువ. అందుకే.. కేంద్రం.. మధ్య, దిగువతరగతి వర్గాల వారికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే బంగారం లభ్యమయ్యేలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం 9 క్యారెట్ల గోల్డ్ ను తీసుకువస్తే.. దాని 10 గ్రాముల విలువ 30 వేల రూపాయిల లోపే ఉంటుంది. దీంతో ఎక్కువమంది ఈరకం పుత్తడిని కొనడానికి అవకాశం లభిస్తుంది. దీంతో సామాన్యుడికి కూడా బంగారం కొనే స్థోమత కలుగుతుంది. అలాగని.. 22, 24 క్యారెట్ల గోల్డ్ కు డిమాండ్ తగ్గుతుందని చెప్పలేం. దేని డిమాండ్ దానిదే.

దొంగతనాలు తగ్గుతాయా?

దొంగతనాలు తగ్గుతాయా?

బంగారం స్వచ్ఛతను హాల్ మార్క్, బీఎస్ఐ ముద్రలను బట్టి చూస్తారు. సో.. ఇప్పుడు 9 క్యారెట్స్ గోల్డ్ ను కాని తీసుకువస్తే.. దాని క్వాలిటీని సూచించేలా హాల్ మార్క్, బీఎస్ఐ ముద్రలు వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ధృవీకరణ ఉంటేనే.. ఆ బంగారానికి విలువ ఉంటుంది. ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇంతకీ ప్రభుత్వం.. 9 క్యారెట్ల గోల్డ్ ను ఎందుకు తీసుకురావాలనుకుంటోంది? ఇది కూడా ముఖ్యమైన పాయింట్. నిజానికి మధ్య, దిగువ తరగతి వారికి 9 క్యారెట్ గోల్డ్ వల్ల ఉపశమనం కలుతుంది అనుకున్నా.. ప్రభుత్వం దీనిని తీసుకురావడం వెనుక మరో కారణం కూడా లేకపోలేదు. బంగారం విలువ నానాటికీ పెరిగేదే. అందుకే దొంగల చూపంతా ముందు బంగారం మీదే ఉంటుంది. మార్కెట్ లో గోల్డ్ ఆర్నమెంట్స్ విలువ ఎక్కువగా ఉండడంతో… గొలుసు దొంగల ఫోకస్ అంతా.. మహిళల మెడలో ఉండే ఆభరణాలపైనే ఉంటుంది. ఎక్కువగా ఉదయం వేళల్లో ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో బాధితుల ప్రాణాలు పోయే ప్రమాదమున్నా సరే.. గొలుసుదొంగలు ఏమాత్రం కనికరం చూపించరు. 9 క్యారెట్ల గోల్డ్ ను తీసుకువస్తే.. ఈ దొంగతనాల సంఖ్య తగ్గే అవకాశముందన్న వాదనా లేకపోలేదు.

పెరిగిన గొలుసు దొంగతనాలు

పెరిగిన గొలుసు దొంగతనాలు

ఓసారి ఎన్సీఆర్బీ స్టాటిస్టిక్స్ చూస్తే.. అసలు విషయం అర్థమవుతుంది. గొలుసు దొంగతనాల కేసులు చూస్తే.. 2021తో పోలిస్తే.. 2022కి 32.54 శాతం పెరిగాయి. అంటే కేసుల్లో దాదాపు మూడో వంతు పెరుగుదల కనిపించింది. అందుకే మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో పుత్తడి వినియోగదారుల దృష్టి.. తక్కువ క్యారెట్లు ఉన్న బంగారం.. అంటే 9 క్యారెట్ల గోల్డ్ పై పడింది. దీంతో ప్రభుత్వం కూడా ఈ చవక బంగారం విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ – BIS.. దీనికి హాల్ మార్క్ కాని వేస్తే.. వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశముంది. దీంతోపాటు హాల్ మార్కింగ్ యునిక్ ఐడెంటిఫికేషన్ – HUID నెంబర్స్ కూడా అవసరం. ప్రస్తుతం.. 14, 18, 22 క్యారెట్ల బంగారానికి మాత్రమే HUID నెంబర్ తో హాల్ మార్క్ వేస్తున్నారు. 9 క్యారెట్ల గోల్డ్ ఆభరణాలు మార్కెట్లోకి వస్తే.. వాటికి డిమాండ్ ఎలా ఉంటుందో, ఏమేరకు వినియోగదారులు వాటిని ఆదరిస్తారో చూడాలి.

బంగారం ధర తగ్గితేనే...

బంగారం ధర తగ్గితేనే…

9 క్యారెట్ల బంగారం ధరపై 3 శాతం జీఎస్టీ ఉంటుంది. గోల్డ్ రేటుకు జీఎస్టీ కలిపినా కలిపినా.. 10 గ్రాముల బంగారం ధర 30 వేల రూపాయిల లోపే ఉంటుంది. ఈరేటు ఆరోజున మార్కెట్ లో ఉన్న ధరపై ఆధారపడి ఉంటుంది. నిజానికి 9 క్యారెట్ గోల్డ్ కు హాల్ మార్కింగ్, HUID నెంబర్ ల ముద్రణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి, బంగారం వర్తక సంఘాలకు మధ్య కొన్ని సమావేశాలు జరిగాయి. ఒకవేళ హాల్ మార్కింగ్ కాని ఉంటుంది అంటే.. వినియోగదారులు.. తక్కువ ఖర్చులోనే భారీ బంగారు ఆభరణాలను కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే గోల్డ్ రేటు ఎక్కువగా ఉంటే.. సాధారణ కొనుగోలుదారులు దీనిని కొనడానికి వెనుకంజ వేస్తారు. శుభకార్యాలు, వివాహాలకు సంబంధించి అవసరాల మేరకు మాత్రమే పుత్తడిని కొంటారు. అలా కాకుండా ధర కాని అందుబాటులో ఉంటే.. పెద్దమొత్తంలో బంగారు వస్తువులు కొనడానికి ఇంట్రస్ట్ చూపిస్తారంటున్నారు బంగారు వర్తకులు.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలతో బంగారం ధర రానురాను పెరుగుతుందే కాని తగ్గే అవకాశం లేదంటున్నారు నిపుణులు. అందుకే.. మన దేశంతోపాటు మరికొన్ని దేశాలు కూడా బంగారాన్ని భారీగా కొనే పనిలో పడ్డాయి. ఈ విధంగా తమ పోర్ట్ ఫోలియోలో బంగారాన్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. ఇజ్రాయిల్-గాజా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. వీటివల్ల గోల్డ్ రేటు కూడా ప్రభావితం అవుతోంది. అమెరికా ఆర్థికవ్యవస్థ పరిస్థితిని చూస్తే.. రాబోయే కాలంలో డాలర్ విలువ తగ్గే అవకాశముంది. అందుకే ఎక్కువమంది బంగారంపై ఫోకస్ పెట్టారంటున్నారు. దీంతో విదేశీ నిల్వలను పెంచుకోవడం కోసం మన దేశం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే డాలర్ కు బదులుగా బంగారాన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకునే ప్లాన్ లో ఉంది. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు ఎక్కువైతే.. కరెన్సీ విలువ తగ్గుతుంది. అంటే పరోక్షంగా బంగారం విలువ పెరిగినట్టే. దీనివల్లే చాలా దేశాలు గోల్డ్ కొనడానికి ముందుకొస్తున్నాయి. సగటు వినియోగదారుడి ఆలోచన కూడా ఇలాగే ఉంది. రూపాయి విలువ తగ్గినా పెరిగినా.. బంగారం విలువ మాత్రం పెరిగేదే కాని తగ్గేది కాదన్న అభిప్రాయంలో ఉన్నాడు. అందుకే తన పోర్ట్ ఫోలియోలో గోల్డ్ రిజర్వులను పెంచుకోవాలని భావిస్తున్నాడు. గోల్డ్ రేటు తగ్గితే.. మరింత ఎక్కువ బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తాడు.