AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాలు కరువై.. పంటలు ఎండిపోతున్న వేళ.. తెలంగాణలో నీటిపై రాజకీయ సమరం!

తెలంగాణలో వాన కోసం రైతు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. పడాల్సినంత వర్షం పడటం లేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. 11 మండలాల్లో సాధారణం కంటే 60 శాతం వరకు వర్ష లోటు నమోదైంది. కొన్ని చోట్ల వాన జాడే లేకపోవడంతో రైతులు వేసిన పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షాలు కరువై.. పంటలు ఎండిపోతున్న వేళ.. తెలంగాణలో నీటిపై రాజకీయ సమరం!
Telangana Monsoon Crisis
Siva Nagaraju
| Edited By: |

Updated on: Sep 08, 2026 | 12:06 PM

Share

తెలంగాణ వ్యవసాయం ఇప్పటికీ వానపై చాలా వరకు ఆధారపడి ఉంది. నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చే వర్షాలే చెరువులను నింపాలి. వాగులు, వంకల్లో నీరు పారాలి. భూగర్భ జలాలు పెరగాలి. బోర్లలో నీరు ఉండాలి. ప్రాజెక్టులకు నీరు చేరాలి. అప్పుడే రైతు పొలంలో పంట నిలబడుతుంది. కానీ ఈసారి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తేడాగా ఉంది. ఒకవైపు వర్షం తక్కువగా పడుతోంది. మరోవైపు పడిన వాన కూడా ఒకే ప్రాంతంలో కురుస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నా.. మరికొన్ని ప్రాంతాల్లో చినుకులు కూడా కరువవుతున్నాయి. దీంతో రాష్ట్ర సగటు లెక్క కంటే గ్రామం, మండలం స్థాయిలో రైతు ఎదుర్కొంటున్న కష్టం ఎక్కువగా కనిపిస్తోంది.

వర్షం తగ్గితే మొదట నేలలో తేమ తగ్గుతుంది. తర్వాత చెరువుల్లోకి వచ్చే నీరు తగ్గుతుంది. చెరువులు నిండకపోతే భూగర్భ జలాలు పెరగవు. బోర్లు ఎండిపోతే రైతు ప్రాజెక్టుల వైపు చూస్తాడు. అక్కడి నుంచి కాలువల ద్వారా నీరు రావాలి. కాలువ చివరి ఆయకట్టులో ఉన్న రైతు పొలానికి కూడా నీరు చేరాలి. అప్పుడే ప్రాజెక్టులో ఉన్న నీరు రైతుకు ఉపయోగపడుతుంది.

ప్రాజెక్టులో నీరు పొలానికి చేరుతోందా?

ఇక్కడే తెలంగాణ నీటి అసలు లెక్క మొదలవుతుంది. ప్రాజెక్టుల్లో నీరు ఉండటం ఒక లెక్క. ఆ నీరు పొలానికి చేరడం మరో లెక్క. వర్షం తక్కువైతే రైతు కష్టం అక్కడితో ఆగదు. విత్తనం కొనాలి. ఎరువులు వేయాలి. మందులు కొనాలి. కూలీలకు డబ్బులు ఇవ్వాలి. నీరు లేకపోతే బోరు నడపాలి. విద్యుత్‌ ఖర్చు పెరుగుతుంది. పంట నిలబడకపోతే మళ్లీ విత్తనం వేయాల్సి వస్తుంది. ఇలా వాన తగ్గిన ప్రతి దశలో రైతు ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే పంటలను తిరిగి విత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి వేసిన పంట ఎండిపోతే మరోసారి పెట్టుబడి పెట్టాలి. రెండోసారి కూడా వాన రాకపోతే మరోసారి అప్పు చేయాల్సి వస్తుంది. చివరికి ఆకాశంలో పడని వాన..రైతు జేబులో అప్పుగా మారుతుంది.

నీళ్లపై రాజకీయ రచ్చ

ఇదే సమయంలో ప్రాజెక్టుల నీటిపై రాజకీయ రచ్చ మొదలవుతోంది. ఎవరి హయాంలో ఏ ప్రాజెక్టు వచ్చిందని అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాజకీయ పార్టీలకు నీరు ఒక రాజకీయ అంశం కావచ్చు. కానీ రైతుకు మాత్రం నీరు జీవనాధారం. పంటకు నీరు రావాలి. పంట చేతికి రావాలి. పంటకు గిట్టుబాటు ధర రావాలి. అప్పు తీర్చాలి. ఇంటిని నడపాలి. రైతు ఆలోచన ఇలానే సాగుతోంది.

ఆకాశం నుంచి రైతు పొలం వరకు

తెలంగాణలో నీటి లెక్కను కేవలం ప్రాజెక్టుల దగ్గర ఆపకూడదు. ఆకాశం నుంచి మొదలుపెట్టి రైతు పొలం వరకు చూడాలి. ఎంత వర్షం పడాలి. ఎంత పడింది. గత ఐదేళ్లలో ఎంత పడింది. పదేళ్ల సగటుతో పోలిస్తే పరిస్థితి ఎలా ఉంది. ఏ జిల్లాల్లో వర్షం తగ్గింది. ఏ మండలాల్లో లోటు ఎక్కువగా ఉంది. ఏ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. ఎన్ని చెరువులు నిండాయి. ఎన్ని ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కలన్నీ కలిపితేనే వర్షం ప్రభావం ఎంత పెద్దదో అర్థమవుతుంది.

ఏపీలో…

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోను వర్షం ముఖం చాటేసింది. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు రాష్ట్రంలో సాధారణంగా 452.9 మిల్లీమీటర్ల వర్షం పడాలి. కానీ ఇప్పటివరకు 203.9 మిల్లీమీటర్లే నమోదైంది. అంటే ఏకంగా 55 శాతం వర్ష లోటు. 28 జిల్లాల్లోనూ లోటు పరిస్థితే ఉంది. అన్నమయ్య జిల్లాలో 77.5 శాతం, ప్రకాశంలో 71.4 శాతం, విశాఖలో 60.4 శాతం లోటు నమోదైంది. దీంతో వర్షాధార వ్యవసాయంతో పాటు భూగర్భ జలాలు, చెరువులు, ప్రాజెక్టుల నీటి నిల్వలపైనా ప్రభావం పడుతోంది.

దేశంలో…

దేశం మొత్తం మీదా వర్షం పరిస్థితి ఆశాజనకంగా లేదు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు సాధారణంగా దేశంలో సుమారు 870 మిల్లీమీటర్ల వర్షం పడాలి. కానీ సెప్టెంబర్‌ మొదటి వారం నాటికి సీజనల్‌ వర్షపాతం సాధారణం కంటే 13 శాతం తక్కువగా ఉంది. జూన్‌లో ఏకంగా 35 శాతం లోటు నమోదైంది. జూలైలో కొంత వర్షం పుంజుకున్నా.. ఆగస్టులో మళ్లీ 16 శాతం లోటు వచ్చింది. ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణ ద్వీపకల్పంలో దాదాపు 27 శాతం వర్ష లోటు ఉంది. అంటే తెలంగాణ, ఏపీ సహా దక్షిణాది ప్రాంతాలపై వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉంది. సెప్టెంబర్‌లోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉండటంతో.. ఈసారి నైరుతి సీజన్‌ దేశవ్యాప్తంగా లోటుతో ముగిసే పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ మార్పులు, రుతుపవనాల తీరు, ఎల్‌నినో వంటి ప్రభావాలు కూడా వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి.

నీటిని దాచుకోవాలి

అందుకే ఇప్పుడు నీటిని కేవలం ప్రాజెక్టుల సమస్యగా చూడలేం. వర్షపు నీటిని ఎంత వరకు ఒడిసిపట్టుకుంటున్నాం. చెరువులను ఎంత వరకు కాపాడుతున్నాం. భూగర్భ జలాలను ఎలా పెంచుతున్నాం. పట్టణాల్లో వర్షపు నీరు ఎంత వృథా అవుతోంది. గ్రామాల్లో చెరువులు, కుంటలు, కాలువల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి. ఒక గ్రామాన్ని తీసుకుంటే ఈ సమస్య మొత్తం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ గ్రామంలో సాధారణంగా ఎంత వర్షం పడుతుంది. ఈసారి ఎంత పడింది. చెరువులోకి ఎంత నీరు వచ్చింది. బోర్లలో నీటి మట్టం ఎంత తగ్గింది. ఎన్ని బోర్లు పనిచేస్తున్నాయి. ఎన్ని ఎండిపోయాయి. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు. ఎన్ని ఎకరాలకు నీరు అందింది. ఎంత పెట్టుబడి పెట్టారు. పంట దెబ్బతింటే రైతుకు ఎంత నష్టం వచ్చింది. చివరికి ఎంత అప్పు మిగిలింది. ఈ లెక్కను ఒక గ్రామం నుంచి చూపిస్తే తెలంగాణ మొత్తం నీటి కష్టాన్ని అర్థం చేసుకోవచ్చు.

పంటల సాగు లెక్క

తెలంగాణలో వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 132.4 లక్షల ఎకరాలు. ఈసారి సెప్టెంబర్‌ 2 నాటికి 119.6 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. అంటే సాధారణ సాగులో దాదాపు 90 శాతం పూర్తయింది. గతేడాది ఇదే సమయానికి 123.5 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఏపీలోనైతే సాధారణ విస్తీర్ణం 76.2 లక్షల ఎకరాలు. ఈసారి వేసింది 57.8 లక్షల ఎకరాలు. గతంలో పోల్చుకుంటే 18.4 లక్షల ఎకరాలు తగ్గింది. అంటే సాధారణ సాగుతో పోలిస్తే 24.1 శాతం తక్కువగా ఉంది.

దేశవ్యాప్తంగా ఈసారి ఖరీఫ్‌లో సెప్టెంబర్‌ 4 నాటికి 1,086 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. అంటే సుమారు 268.5 మిలియన్‌ ఎకరాల్లో పంటలు వేశారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే దేశంలో సాగు విస్తీర్ణం 1.6 శాతం తక్కువగా ఉంది.

రైతు జీవిత కథ

తెలంగాణ నీటి కథ అంటే కేవలం వర్షం కథ కాదు. ఇది రైతు జీవిత కథ. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం నుంచి.. చెరువులో నీరు చేరడం వరకు. చెరువు నుంచి బోరులో నీరు పెరగడం వరకు. ప్రాజెక్టు నుంచి కాలువలోకి నీరు రావడం నుంచి.. కాలువ చివర ఉన్న రైతు పొలంలో పంట పచ్చబడటం వరకు. అక్కడి నుంచి మార్కెట్‌కు వెళ్లి పంట అమ్ముడై.. రైతు చేతిలో డబ్బు మిగిలే వరకు సాగే పెద్ద కథ ఇది.

వాన తగ్గితే పంట తగ్గుతుంది. పంట తగ్గితే రైతు ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే అప్పు పెరుగుతుంది. అప్పు పెరిగితే కుటుంబంపై భారం పెరుగుతుంది. అందుకే వర్షం లోటు అనేది కేవలం వాతావరణ వార్త కాదు. అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పెద్ద సమస్య.

చివరికి..

మబ్బులో నుంచి వచ్చిన నీటిలో ఎంత మన దగ్గర నిలిచింది. చెరువుల్లో ఎంత చేరింది. భూగర్భంలోకి ఎంత వెళ్లింది. ప్రాజెక్టుల్లో ఎంత నిల్వ ఉంది. కాలువల్లోకి ఎంత విడుదలైంది. రైతు పొలానికి ఎంత చేరింది. ఆ నీటితో ఎంత పంట పండింది. ఆ పంటతో రైతు చేతిలో చివరికి ఎంత మిగిలింది. ఈ మొత్తం లెక్కే తెలంగాణ నీటి అసలు లెక్క.

ఆకాశం వాన ఇవ్వాలి. చెరువు నీటిని దాచుకోవాలి. ప్రాజెక్టు నీటిని పొలానికి చేర్చాలి. రైతు పంట పండించాలి. పంటకు మంచి ధర రావాలి. అప్పు తీరాలి. అప్పుడే నీటి లెక్క రైతు జీవితంలో మంచి ఫలితంగా మారుతుంది. వాన కోసం ఆకాశం వైపు చూసే రైతు కళ్లలో నీరు కాదు. నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టేది కేవలం వర్షం కాదు. మన నీటి నిర్వహణ అనేది నిజం. ఆ దిశగా పాలకులు ఆలోచిస్తే అన్నదాత ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

కొండవీటి శివనాగరాజు డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us