ప్రియుడితో కలిసి భర్త హత్యకు మాస్టర్ ప్లాన్.. అడ్డంగా పట్టించిన బైక్ ఫైర్.. అసలేం జరిగిందంటే?
తిరుపతి జిల్లా చంద్రగిరి మండల బీజేపీ అధ్యక్షుడి బైక్ దగ్ధం కేసు విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ కేసుగా భావించిన పోలీసులకు దర్యాప్తులో భర్తను హతమార్చేందుకు భార్య వేసిన కుట్ర బయటపడింది. ప్రియుడితో కలిసి ఆమె ఈ హత్యకు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

భర్తను హత్య చేయించేందుకు ఓ మహిళ ప్రియుడితో కలిసి స్కెచ్ వేసిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి చంద్రగిరి కొత్తపేటలో నివాసముంటున్న బీజేపీ మండల అధ్యక్షుడు మునిరాజా బైక్ దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు భావించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మునిరాజా బైక్‌ను ఎవరు, ఎందుకు తగలబెట్టారనే కోణంలో ఆరా తీశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం ఏమైనా కారణమా అనే రాజకీయ కోణంలోనూ విచారణ జరిపారు. అయితే ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు.
ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు చంద్రగిరికి చెందిన యువ సాయి అనే యువకుడి కదలికలపై అనుమానం వచ్చింది. సాంకేతిక ఆధారాలను విశ్లేషించే క్రమంలో మునిరాజా భార్య ప్రశాంతి ప్రవర్తనపై కూడా పోలీసులకు అనుమానం బలపడింది. దీంతో మొబైల్ డేటాతో పాటు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించగా అసలు బండారం బయటపడింది.
మునిరాజా భార్య ప్రశాంతే ఈ మొత్తం వ్యవహారానికి మాస్టర్ ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె యువ సాయి అనే యువకుడితో సన్నిహితంగా ఉంటూ భర్తను కడతేర్చేందుకు పథకం రచించింది. ఈ క్రమంలో యువ సాయితో పాటు ఉదయ్ కిరణ్, లీలా కృష్ణ, పృథ్వీరాజ్, హరీష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. నిందితులు బైక్‌ను తగలబెట్టినట్లు అంగీకరించడంతో పాటు అసలు కుట్రను బయటపెట్టారు.
మునిరాజాను అంతమొందించేందుకు భార్య ప్రశాంతి ఐదుగురితో కలిసి పలుమార్లు ప్లాన్ చేసినట్లు తేలింది. పథకం ప్రకారం భర్త కదలికలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రియుడికి ఆమె చేరవేసేది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కుట్రను ఛేదించిన పోలీసులు.. బీజేపీ నేత మునిరాజా భార్య ప్రశాంతితో సహా మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
బాధితుడి వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
