2.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం..! కళ్లు చెదిరే పవర్‌తో Lamborghini Temerario Spyder.. ప్రత్యేకతలివే
ప్రముఖ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Lamborghini మరో అద్భుతమైన సూపర్‌కార్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న తన హైబ్రిడ్ సూపర్‌కార్ Temerarioకి ఓపెన్‌టాప్ వెర్షన్‌గా కొత్త Temerario Spyderను ఆవిష్కరించింది. ఆకట్టుకునే డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు సూపర్‌కార్ ప్రియులను ఆకర్షించేలా ఉంది. ఇందులో 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లను అందించారు. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మొత్తం 920hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ సూపర్‌కార్‌లో ప్రత్యేక ఆకర్షణ పూర్తిగా ఎలక్ట్రిక్ విధానంలో పనిచేసే రిట్రాక్టబుల్ హార్డ్‌టాప్. రూఫ్‌ను తెరిచి ఓపెన్‌టాప్ డ్రైవింగ్ అనుభూతిని పొందడంతో పాటు, మూసివేసినప్పుడు కూపే తరహా డిజైన్‌ను ఆస్వాదించవచ్చు. కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 100kmph వేగాన్ని అందుకునే సామర్థ్యం దీని మరో ప్రత్యేకత. గరిష్ఠంగా గంటకు 343 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ కారు పనితీరు, లగ్జరీ ఫీచర్ల కలయికగా నిలుస్తోంది.
ఎలక్ట్రిక్ హార్డ్‌టాప్..
Lamborghini Temerario Spyderలో 10 ఎలక్ట్రిక్ యాక్చుయేటర్లతో పనిచేసే రిట్రాక్టబుల్ హార్డ్‌టాప్‌ను అందించారు. ఈ రూఫ్ సీట్ల వెనుక నిలువుగా ముడుచుకునేలా రూపొందించారు. Lamborghini Spyder మోడళ్లలో తొలిసారిగా ఈ తరహా రూఫ్‌ను ఉపయోగించారు. రూఫ్ తెరిచినప్పుడు కారు సెంటర్ ఆఫ్ గ్రావిటీ 3mm తగ్గుతుందని, అయితే వెయిట్ డిస్ట్రిబ్యూషన్‌లో మార్పు ఉండదని కంపెనీ తెలిపింది.
గతంలో వచ్చిన Huracan EVO Spyderతో పోలిస్తే ఇందులో క్యాబిన్ స్పేస్‌ను పెంచారు. 46mm అదనపు లెగ్‌రూమ్, 22mm ఎక్కువ హెడ్‌రూమ్, 9mm అదనపు షోల్డర్, ఎల్బో రూమ్ లభిస్తాయి. మూడు స్థాయిల్లో పనిచేసే సీట్ నెక్ వార్మర్, 112 లీటర్ల ఫ్రంట్ లగేజ్ కంపార్ట్‌మెంట్ కూడా ఉన్నాయి. అప్‌డేట్ చేసిన సస్పెన్షన్ ట్యూనింగ్ వల్ల గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లపై వచ్చే సెకండరీ వైబ్రేషన్లు 20 శాతం తగ్గుతాయని కంపెనీ వెల్లడించింది.
ఈ కారును పూర్తిగా అల్యూమినియంతో తయారు చేసిన స్పేస్‌ఫ్రేమ్‌పై నిర్మించారు. Huracan Spyderతో పోలిస్తే స్టాటిక్ టార్షనల్ రిజిడిటీలో 6 శాతం, డైనమిక్ బెండింగ్ స్టిఫ్‌నెస్‌లో 9 శాతం, డైనమిక్ టార్షనల్ రిజిడిటీలో 6 శాతం మెరుగుదల ఉన్నట్లు కంపెనీ తెలిపింది. Huracan EVO Spyderతో పోలిస్తే స్ట్రక్చరల్ కాంపోనెంట్ల సంఖ్యను 50 శాతం, హీట్ ఇన్‌పుట్ వెల్డింగ్‌లను 80 శాతం తగ్గించారు.
343kmph గరిష్ఠ వేగం
Temerario Spyderలో 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఈ పవర్‌ట్రెయిన్ మొత్తం 920hp గరిష్ఠ పవర్, 800Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో V8 ఇంజిన్ ఒక్కటే 800hp పవర్‌ను అందిస్తుంది. ఇది గరిష్ఠంగా 10,000rpm వరకు పనిచేస్తుంది. లాంచ్ కంట్రోల్ యాక్టివేట్ చేసినప్పుడు ఇంజిన్ వేగం 10,250rpm వరకు చేరుకుంటుంది.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగం గంటకు 343 కిలోమీటర్లు. ఇందులో Citta, Strada, Sport, Corsa, Corsa ESC Off అనే ఐదు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. Recharge, Hybrid, Performance అనే మూడు ఎనర్జీ మేనేజ్‌మెంట్ విధానాలు కూడా ఉన్నాయి. అదనంగా మూడు స్థాయిల్లో పనిచేసే Drift Mode అందించారు. Citta మోడ్‌లో కారు పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో ప్రయాణిస్తుంది. ఈ సమయంలో గరిష్ఠంగా 190hp పవర్‌ను అందిస్తుంది.
అయితే Lamborghini Temerario Spyder భారత మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దీని ధర ఎంత ఉంటుంది? అనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ధర, ఇండియా లాంచ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం సూపర్‌కార్ ప్రియులు వేచి చూడాల్సి ఉంది.
