TDP-BJP: బీజేపీ టీడీపీల మధ్య స్నేహం మళ్ళీ చిగురిస్తోందా.. అక్కడ అధికారం పంచుకున్న ఇరుపార్టీలు
టీడీపీ, బీజేపీ మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందా? అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే.. దానికి రుజువుగా నిలుస్తున్నాయా? నడ్డా ట్వీటు వెనుక అంతరార్థం అదేనా?

2019 ఎన్నికలకు ముందు.. బద్ధశత్రువులుగా మారిపోయిన బీజేపీ, టీడీపీలు.. మళ్లీ అధికారం పంచుకున్నాయి. మీరు చదువుతుంది నిజమే.. కాకపోతే, అది ఆంధ్రప్రదేశ్‌లో కాదు అండమాన్ నికోబార్ దీవుల్లో. అక్కడ గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎక్కువ స్థానాలు గెలిచిన బీజేపీ ఇన్నాళ్లూ మున్సిపల్ పీఠాన్ని ఏలింది. అగ్రిమెంట్ ప్రకారం.. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది.
ఆ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచి కింగ్ మేకర్‌గా నిలిచిన టీడీపీకి పదవి అప్పగించడం పట్ల బీజేపీ కూడా హ్యాపీగానే ఉంది. టీడీపీ నేత సెల్విని కౌన్సిల్ చైర్ పర్సన్ గా ఎన్నుకుంది. తాజాగా జరిగిన ఓటింగ్‌లో.. సెల్వికి కాషాయ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. దీంతో.. బలపరీక్షలో ఆమెకు 14 ఓట్లు రాగా.. ప్రత్యర్థికి 10 ఓట్లు వచ్చాయి.
ఇప్పుడిదే విషయం.. రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. తమ పార్టీ నేతకు పోర్ట్‌బ్లెయిర్ మున్సిపల్‌కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్‌లో షేర్ చేసింది టీడీపీ. BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం… కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేయడం విశేషం. ఇందులో విశేషం ఏంటంటే.. BJP-TDP అలయన్స్ అంటూ ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేయడమే. హార్డ్ వర్క్, డెడికేషన్‌తోనే ఈ విజయం సాధ్యమైందంటూ చెప్పుకొచ్చారు నడ్డా. దీంతో, ఈ పాతమిత్రుల కలయికపై పొలిటికల్ కథనాలు మొదలైపోయాయి.




మరోవైపు పోర్ట్ బ్లెయిర్ మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన టీడీపీ సభ్యురాలు సెల్వికి శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. 24 సీట్లున్న PBMCకి 2022మార్చి 6న ఎన్నికలు జరగగా… మార్చి 8న రిజల్ట్ వచ్చింది. 24 సీట్లున్న మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్‌కి 10, బీజపీకి 10, టీడీపీకి 2 సీట్లు వచ్చాయి. DMK 1, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. అయితే, తాజాగా జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్ కౌన్సిలర్ సైతం… బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..