UP Tax Raids: యూపీలో అవినీతి సువాసనలు.. దాడుల్లో కట్టలకు కట్టల కరెన్సీ నోట్లు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి సువాసనలు గుభాళిస్తున్నాయి. సెంట్ల వ్యాపారం కోట్ల వర్షం కురిపిస్తోంది. దర్యాప్తు సంస్థల సోదాల్లో వందల కోట్ల నోట్ల కట్టలు బయటపడుతున్నాయి.
UP Tax Raids: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి సువాసనలు గుభాళిస్తున్నాయి. సెంట్ల వ్యాపారం కోట్ల వర్షం కురిపిస్తోంది. దర్యాప్తు సంస్థల సోదాల్లో వందల కోట్ల నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న ఈ రాష్ట్రంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి సంస్థల దాడులు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో సెంట్ల వ్యాపారి పీయూష్ జైన్ నివాసాలు, కార్యాలయాల్లో డైరక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) జరిపిన దాడులు భారీ మొత్తంలో అక్రమ సొత్తును బయటపెట్టాయి. ఏకంగా రూ. 197 కోట్ల మేర నగదు, 23 కేజీల బంగారంతో పాటు భారీగా పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గదుల నిండా చక్కగా ప్యాక్ చేసిన నోట్ల కట్టలను లెక్కించడానికి జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారుల స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది సహాయం తీసుకున్నా సరే కొన్ని రోజుల సమయం పట్టింది. కట్టలకు కట్టల కరెన్సీ నోట్ల దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. అయితే ఈ అక్రమ సొత్తు కూడబెట్టిన పీయూష్ జైన్‌ను సమాజ్‌వాదీ పార్టీ నేతగా పేర్కొంటూ ప్రచారం కొనసాగింది. ఆ తర్వాత రాజకీయ దుమారం మొదలైంది.
ప్రధాని నోట దాడుల మాట
కాన్పూర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్‌లో 2017కు ముందు ‘అవినీతి సువాసనలు’ రాష్ట్రమంతటా విస్తరించాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యావద్దేశం నోట్ల కట్టల పర్వతాలను చూసిందని, ఇదే వారు (సమాజ్‌వాదీ) సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. యూపీలో ప్రారంభించే ప్రతి ప్రాజెక్టు తన హయాంలో మొదలుపెట్టిందేనని చెప్పుకుంటున్న అఖిలేశ్ యాదవ్, మరి నోట్ల కట్టల ఇనప్పెట్టెల ఘనత కూడా తనదేనని ఎందుకు చెప్పుకోవడం లేదని ప్రశ్నించారు.
మిస్టేకెన్ ఐడెంటిటీ
పీయూష్ జైన్‌కు, సమాజ్‌వాదీ పార్టీకి అసలేమాత్రం సంబంధం లేదని, బీజేపీ పొరపాటున తమ సొంత పార్టీకే చెందిన వ్యాపారిపై దాడులు జరిపించిందని అఖిలేశ్ యాదవ్ తనపై చేసిన ఆరోపణలకు తిప్పికొట్టారు. పీయూష్ జైన్‌ను సమాజ్‌వాదీ నేతగా పొరబడేందుకు అనేకాంశాలు దోహదపడ్డాయి. సమాజ్‌వాదీకి చెందిన ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ కూడా సెంట్ల తయారీదారుడే. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ కార్యక్రమంలో ‘సమాజ్‌వాదీ పెర్ఫ్యూమ్’ పేరుతో కొన్ని రకాల సెంట్లను విడుదల చేశారు. సరిగ్గా అదే సమయంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ దాడులు కాన్పూర్‌లోని పీయూష్ జైన్ ఇంటిపై జరిగాయి. ‘పమ్మి జైన్’గా సుపరిచితుడైన సమాజ్‌వాదీ పార్టీ నేత పుష్పరాజ్ జైన్, జీఎస్టీ ఇంటెలిజెన్స్ దాడులు జరిపిన పీయూష్ జైన్ ఇద్దరూ కన్నౌజ్ పట్టణానికే చెందినవారు. దీంతో చాలా మంది పీయూష్ జైన్‌ను సమాజ్‌వాదీ నేతగా పొరబడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందిస్తూ ‘నవ్వు తెప్పించే పొరపాటు’ (కామెడీ ఆప్ ఎర్రర్స్)గా అభివర్ణించారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీ నేత పుష్పరాజ్ జైన్ కూడా స్పందిస్తూ.. చిదంబరం చెప్పినట్టు బహుశా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తననే టార్గెట్ చేసి ఉండవచ్చని, గురితప్పి పీయూష్ జైన్‌కి తగిలిందని వ్యాఖ్యానించారు.
అధికారులు కూడా పొరబడ్డారా?
సోదాలు జరిపిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు నిజంగానే పొరపాటున పీయూష్ జైన్‌ను టార్గెట్ చేశారా? వారి అసలైన టార్గెట్ ఎవరు? అనే సందేహాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దీనిపై వివరణనిస్తూ.. అసలు యూపీలో ఎవరూ తమ టార్గెట్ కాదని, గుజరాత్ అహ్మదాబాద్ సమీపంలో ఓ ట్రక్కును పట్టుకుని తీగ లాగితే కాన్పూర్‌లో డొంక కదిలిందని చెబుతున్నారు. ట్రక్కు డ్రైవర్ సరైన జీఎస్టీ ఇన్వాయిస్‌లు చూపకపోవడంతో తాము ట్రాన్స్‌పోర్ట్ సంస్థ గణపతి రోడ్ క్యారియర్స్, అందులో సరుకు రవాణా చేస్తున్న శిఖర్ గ్రూప్ వివరాలు బయటికొచ్చాయని చెప్పారు. శిఖర్ గ్రూపు లావాదేవీలను పరిశీలించినప్పుడు వారు తయారు చేసే పాన్ మసాలా, గుట్కాలకు వివిధ సువాసనల ఫ్లేవర్లను సరఫరా చేసే ఓడోకెమ్ ఇండస్ట్రీస్ అధినేత పీయూష్ జైన్ వ్యవహారం బయటికొచ్చిందని, లావాదేవీలన్నీ నగదు రూపంలో మాత్రమే జరిపిన ఓడోకెమ్ ఇండస్ట్రీస్ గురించి లోతుగా జరిపిన దర్యాప్తులో భాగంగానే సోదాలు జరిపామని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. తామేమీ పొరపాటున ఒకరి బదులు మరొకరిని టార్గెట్ చేయలేదని స్పష్టం చేస్తున్నారు.
కొసమెరుపు
రాజకీయ దుమారం రేపిన ఈ మొత్తం వ్యవహారంలో తెరపైకొచ్చిన సమాజ్‌వాదీ పార్టీ నేత పుష్పరాజ్ జైన్ ఇప్పుటు ఆదాయపు పన్ను శాఖకు టార్గెట్‌గా మారారు. ఆయన నివాసాలు, కంపెనీ కార్యాలయం సహా దాదాపు 50 ప్రదేశాల్లో ఏకకాలంలో ఇన్‌కం ట్యాక్స్ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. గురి తప్పింది అని ఎద్దేవా చేస్తూ, తానే ఎదురెళ్లినట్టయింది.
– మహాత్మ కొడియార్, టీవీ9