AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: తలనొప్పితో ఆసుపత్రికి వచ్చి యువతికి సిటి స్కాన్.. రిపోర్ట్ చూసి డాక్టర్ షాక్..!

అనారోగ్యంతో బాధపడుతున్న యువతి తలలోకి మాంత్రికుడు 77 సూదులను గుచ్చినట్లు తెలుస్తోంది. బుర్లాలోని వింసార్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు.

Odisha: తలనొప్పితో ఆసుపత్రికి వచ్చి యువతికి సిటి స్కాన్.. రిపోర్ట్ చూసి డాక్టర్ షాక్..!
Tantrik In Odisha
Balaraju Goud
|

Updated on: Jul 21, 2024 | 10:57 AM

Share

వైద్య శాస్త్రంలోనే అద్భుత శస్త్రచికిత్స జరిగింది. ఒడిశాలోని బొలంగీర్‌ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి తల నుండి 77 సూదులను విజయవంతంగా వెలికి తీశారు. వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR), బుర్లా వైద్యుల బృందం విజయవంతమైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో చోటు చేసుకుంది.

బొలంగీర్‌ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. యువతిని పరీక్షించిన వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వైద్య బృందం ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఆమె తలలో నుంచి 77 సూదులను బయటకు తీశారు. అయితే, ఈ సూదులు ఎలా వచ్చాయన్న దానిపై విచారణ జరపక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అనారోగ్యంతో బాధపడుతున్న యువతి తలలోకి మాంత్రికుడు 77 సూదులను గుచ్చినట్లు తెలుస్తోంది. బుర్లాలోని వింసార్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు. సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహరా(19) మూడేళ్ల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె తండ్రి బిష్ణు బెహరా.. తేజ్ రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించాడు. వైద్యం పేరిట ఆయన పలు దఫాలుగా రేష్మా తలలోకి 77 సూదులను గుచ్చాడు. ఇటీవల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు VIMSAR ఆసుపత్రికి తరలించారు.

VIMSAR వైద్యులు ఆమెను పరిశీలించి సిటీ స్కానింగ్ చేసి నిర్ఘాంతపోయారు. ఆమె పుర్రెలో సూదులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి యువతి తలలో నుంచి 77 సూదులను బయటికి తీశారు. పుర్రె ఎముకపై ఉన్న సూదులు లోపలికి వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డట్లు వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ భాబాగ్రాహి రథ్ తెలిపారు. ప్రస్తుతం యువతి కోలుకున్నట్లు వెల్లడించారు. ఇక ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ అమానుష ఘటనకు పాల్పడ్డ మాంత్రికుడు తేజ్ రాజ్ ను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..