Budget Expectations: రేపటి నుంచే బడ్జెట్ సెషన్.. ఆదాయపు పన్నులో ఎలాంటి ప్రయోజనం ఉంటుందో..?

. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న వేళ పన్ను చెల్లింపుదారుల కళ్లు ఆమెపైనే ఉన్నాయి. చాలా మంది కోరుకునే 80C సెక్షన్‌ ఈసారి కూడా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. కచ్చితంగా ఈసారి 80C మినహాయింపు మొత్తం పెరుగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.

Budget Expectations:  రేపటి నుంచే బడ్జెట్ సెషన్.. ఆదాయపు పన్నులో ఎలాంటి ప్రయోజనం ఉంటుందో..?
Budget 2024 Pm Modi, Nirmala Sitharaman
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 21, 2024 | 12:41 PM

మరికొన్ని గంటల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కార్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోవసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌ ప్రజల ముందుకు రానుంది. బడ్జెట్-2024 మంగళవారం అంటే జూలై 24న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న వేళ పన్ను చెల్లింపుదారుల కళ్లు ఆమెపైనే ఉన్నాయి. చాలా మంది కోరుకునే 80C సెక్షన్‌ ఈసారి కూడా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. కచ్చితంగా ఈసారి 80C మినహాయింపు మొత్తం పెరుగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.

రేపటి నుండి అంటే సోమవారం (జూలై22)నుండి బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. జూలై 23న మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌లో కొంత ఊరట లభిస్తుందని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. ఆదాయపు పన్నులో ఎలాంటి ఉపశమనం ఇవ్వవచ్చన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

బడ్జెట్‌ అంటే భారీ అంచనాలు. బడ్జెట్‌లో ప్రతీ రంగం ఏదే ఒకటి ఆశించడం పరిపాటిగా మారింది. మధ్య తరగతి కుటుంబాలు, వేతనజీవులు మాత్రం బడ్జెట్‌ నుంచి ఒకటే ఆశిస్తారు. ఆదాయ పన్నులో మినహాయింపులు , స్టాండర్డ్‌ డిడక్షన్‌ మొత్తం పెంపు. ఇవి దక్కితే చాలాన్నది చాలా మంది కోరిక. ఈ క్రమంలోనే ఈసారి బడ్జెట్‌పై పన్ను చెల్లింపుదారులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. పన్ను చెల్లింపుదారులకు అనేక రకాల ఉపశమనం లభిస్తుందని నమ్ముతున్నారు. పన్ను మినహాయింపు నుండి ఆదాయపు పన్ను శ్లాబ్ వరకు, మార్పులు చేయవచ్చని భావిస్తున్నారు. కొత్త పన్ను విధానంలో కొన్ని అదనపు మినహాయింపులు కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది.

ముఖ్యంగా ఆదాయపు పన్ను సెక్షన్ 80సీలో ఇచ్చిన మినహాయింపు పరిమితిని పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పన్ను శ్లాబ్‌లో కూడా మార్పులు చేయాలని కోరుతున్నారు. 2014లో NDA సర్కారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్‌లో 80C కింద ఇచ్చే మినహాయింపు మొత్తాన్ని లక్ష రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు పెంచారు. గడిచిన పదేళ్లుగా ఆ మొత్తం అలాగే ఉంది. పీఎఫ్‌ మొత్తం, పిల్లల స్కూల్‌ ఫీజులు, లైఫ్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం, యులిప్స్‌, NSC, హోమ్‌ లోన్‌ అసలు మొత్తం, సుకన్య సమృద్ధి యోజన అన్ని ఇందులోనే ఉంటాయి. ఈ లక్షన్నర మినహాయింపు కారణంగా అత్యధిక పన్ను బ్రాకెట్‌ 30 శాతంలో ఉండేవారికి దాదాపు 46వేల రుపాయల పన్ను ప్రయోజనం చేకూరుతుంది.

ద్రవ్యోల్బణం భారీగా పెరిగినా ఈ లిమిట్‌ మాత్రం గడిచిన పదేళ్లుగా లక్షన్నర రూపాయలుగానే కొనసాగుతోంది. గడిచిన పదేళ్ల కాలంలో వినియోగ ద్రవ్యోల్బణం సగటుున 5.1 శాతం లెక్కన పెరిగింది. అంటే పదేళ్ల క్రితం లక్ష రూపాయలు ఖర్చు ఇప్పుడు లక్ష 64 వేలకు చేరింది. పొదుపు మొత్తాలపై ఈ ప్రభావం కనిపిస్తూనే ఉంది. 2022 మార్చిలో భారతదేశ స్థూల పొదుపు రేటు 31.2 శాతం ఉండగా 2023 మార్చి నాటికి ఇది 30.2 శాతానికి క్షీణించింది.

ఈ మొత్తాన్ని కనీసం మూడు లక్షలకు పెంచాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. దీని ద్వారా పొదుపు మొత్తాలు పెరగడంతో పాటు పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఊరట లభిస్తుందన్నది వాస్తవం. అయితే, కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం ఏకంగా ఈ తరహా మినహాయింపులన్నింటినీ తొలగించింది. పెరుగుతున్న జీవన ఖర్చులు, వేతనాలకు తగ్గట్టుగా 80C ప్రయోజనం లేదని ఆర్థికవేత్తలందరూ అంటారు.

80C కింద మినహాయింపు పరిమితి పెంపుః

80C మినహాయింపు పరిమితి పెంచి పదేళ్లు అయింది కాబట్టి ఈసారి కచ్చితంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయంలో మినహాయింపు ఇస్తారనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపును పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఊరటనిస్తుంది.

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెరిగే ఛాన్స్ః

ఈసారి బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం, కొత్త – పాత సిస్టమ్‌లపై రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులో ఉంది. దీన్ని రూ.లక్షకు పెంచవచ్చని తెలుస్తోంది. దీని వల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఎలాంటి ఖర్చులకు సంబంధించిన రుజువు అవసరం లేదు.

ప్రాథమిక మినహాయింపు పరిమితి పెంపుః

కొత్త – పాత వ్యవస్థలలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని పెంచవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక మినహాయింపు పరిమితి కొత్త విధానంలో రూ.3 లక్షలు, పాత విధానంలో రూ.2.50 లక్షలు. రెండింటిలోనూ రూ.5 లక్షలకు పెంచవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

కొత్త పన్ను విధానం యొక్క స్లాబ్‌లలో మార్పు:

కొత్త పన్ను విధానంలో ఎక్కువ స్లాబ్‌లు ఉన్నాయని చాలా మంది పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. వీటిని తగ్గించాలని కోరుతున్నారు. అదే సమయంలో, 20 – 30 శాతం శ్లాబ్‌ల మధ్య 25 శాతం అదనపు పన్ను స్లాబ్ ఉండాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ పన్ను స్లాబ్ రూ.15 నుంచి 20 లక్షల మధ్య ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పన్ను భారం తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, పన్ను శ్లాబ్‌లో కొంత మార్పు ఉండవచ్చని భావిస్తున్నారు.

హెచ్‌ఆర్‌ఏ లేదా గృహ రుణ మినహాయింపుః

కొత్త పన్ను విధానంలో హెచ్‌ఆర్‌ఏ లేదా గృహ రుణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో ఒకటి కొత్త విధానంలో హెచ్‌ఆర్‌ఏ లేదా గృహ రుణ వడ్డీపై మినహాయింపు సౌకర్యం కల్పించాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నార. వాస్తవానికి, చాలా మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను వ్యవస్థకు మారలేరు. ఎందుకంటే వారు గృహ రుణం, ఇతర పొదుపు సంబంధిత సౌకర్యాల ప్రయోజనాలను పొందలేరు. బడ్జెట్ HRA లేదా హోమ్ లోన్ వడ్డీపై మినహాయింపు సౌకర్యాన్ని అందించవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…