జయ.. కరుణా లేకపోయినా అదే కల్చర్‌, అంతకు మించి అంటున్న వారసులు, తమిళనాట తాయిలాలతో తడిసిపోతున్న ఓటర్లు

ఓట్ల పండుగ వచ్చేసింది. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వం ఊపందుకుంది. అయితే, హామీలు, మందు, విందు, ఓల్డ్‌ ఫ్యాషన్‌ అయిపోయింది. ప్రజంట్‌ ట్రెండ్‌ మారింది. న్యూ స్ట్రాటజీకి తెరలేచింది...

  • Venkata Narayana
  • Publish Date - 2:09 pm, Mon, 1 March 21
జయ.. కరుణా లేకపోయినా అదే కల్చర్‌,  అంతకు మించి అంటున్న వారసులు, తమిళనాట తాయిలాలతో తడిసిపోతున్న ఓటర్లు

ఓట్ల పండుగ వచ్చేసింది. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వం ఊపందుకుంది. అయితే, హామీలు, మందు, విందు, ఓల్డ్‌ ఫ్యాషన్‌ అయిపోయింది. ప్రజంట్‌ ట్రెండ్‌ మారింది. న్యూ స్ట్రాటజీకి తెరలేచింది. పార్టీకి కేటాయించిన సింబల్‌తో పాటు.. ఓటరు కోరుకున్నవి..వారికి నచ్చినవి ఇచ్చి ఆకట్టుకునేందుకు తెగ కష్టపడుతున్నాయి పార్టీలు. ఇక తమిళనాడులో ఎన్నికలు అంటే వేరే చెప్పాలా..ఆ హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. వరాల వర్షంలో.. తాయిలాల వరదలో తడిసి ముద్దవుతుంటారు ఓటర్లు.

తమిళనాట ఈ సంస్కృతి ఇప్పటిదికాదు. అమ్మ హయాం నుంచి ఉన్నదే. ఇటు జయ..అటు కరుణానిధి లేకపోయినా..ఆ కల్చర్‌ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అంతకు మించి అంటున్నారు వారి వారసులు. ఒకవైపు పొత్తులపై కసరత్తు చేస్తూనే..మరోవైపు ఓటర్లకు గిఫ్టులు ఎర వేస్తున్నారు. అబ్బో ఒక్కటేంటి..కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, టిఫిన్‌ బాక్సులు, సిల్వర్‌ ఐటమ్స్‌..ఇలా ఓటర్లకివ్వడానికి కాదేదీ అనర్హం అంటున్నాయి పార్టీలు. ఒకరు, ఇద్దరని కాదు..అందరిదీ ఇదే దారి. తమిళనాట ఓటర్లకు పంపకాలు జోరుగా నడుస్తున్నాయి.

తాజాగా కడలూరులో కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీకి చెందిన పలు ఐటమ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టీ షర్టులు, సిల్వర్‌ ఐటమ్స్‌, స్టీల్‌ బాక్సులపై టార్చ్‌లైట్‌ గుర్తుంది. ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్న ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రెండ్రోజుల క్రితమే టీటీవీ దినకరన్‌కు చెందిన కుక్కర్లు పట్టుబడ్డాయి.

ఓటర్లకు తన పార్టీ గుర్తైన కుక్కర్లను పంచేందుకు సిద్ధమయ్యారు దినకరన్‌. ముందుగానే ఆర్డర్ చేసిన కుక్కర్లను…చెన్నై శివారులోని గుమ్మిడిపూడి వద్ద గోడౌన్‌లో నిల్వ చేశారు. ఇక ఎన్నికల నగరా మోగడమే తరువాయి. వాటిని ఓటర్లకు పంచేందుకు జిల్లాలకు తరలిస్తుండగా..పోలీసుల కంటపడింది. అరియాలూరు జిల్లాలో 4వేల 400 కుక్కర్లతో వెళ్తున్న లారీని పట్టుకున్నారు పోలీసులు. అవి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ పార్టీకి చెందినవిగా చెప్తున్నారు. గుమ్మిడిపూడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు కుక్కర్లు తరలిస్తున్నట్టు తేలింది. ఎన్నికల నియామవళి ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు…ఎవరెవరు ఆర్డర్లిచ్చారు, ఆ డబ్బును ఎలా చెల్లించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే..తెర వెనుక చాలా జరుగుతున్నాయి. అవి మరింత ఇంట్రస్టింగ్‌గా మారాయి. ఇప్పటికే థర్డ్‌ ఫ్రంట్‌ అంటూ తమిళనాట దూకుడు పెంచిన కమల్‌..ఆ కూటమి తరపున తానే సీఎం అభ్యర్థినంటూ ప్రకటించుకున్నారు. తమతో కలిసొచ్చే పార్టీలతో పొత్తుకు సిద్ధమంటూ..ఆలిండియా సమత్తువ మక్కల్ కట్చి AISMK పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌తో చర్చలు జరిపారు. ఇక ఇక్కడ సీన్‌ కట్‌ చేస్తే..చిన్నమ్మ ఇంటి దగ్గర మొదలైంది అసలు రాజకీయం. కమల్‌తో శశికళ ఫ్రెండ్‌ షిప్‌ చేసేలా సెట్‌ చేస్తున్నారట శరత్‌కుమార్. దీంతో అన్నాడీఎంకేలోని శశికళ సపోర్టర్లు..ఇతర పార్టీల్లోని అసంతృప్తులు కూడా ఈ కూటమి వైపే చూస్తున్నారట. మొత్తానికి ద్రవిడ గడ్డపై థ‌ర్డ్ ఫ్రంట్ క్రియేట్ చేసి..త‌మిళ్ పాలిటిక్స్‌లో మరింత హీట్ పెంచేశారు కమల్‌హాసన్‌.

Read also : Grenade bomb in Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రనేడ్ బాంబు కలకలం, హడలిపోతోన్న స్థానికులు..టీవీ9 సాహసోపేత కవరేజ్