దారుణం.. రోడ్డుపై టపాసులు కాల్చొద్దన్నందుకు ఎస్సైను కొట్టి చంపేశారు..!
తమిళనాడులోని తేని జిల్లాలో దీపావళి వేళ విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై బాణసంచా కాల్చవద్దని యువకులకు సూచించిన స్పెషల్ ఎస్సై సెంథిల్ కుమార్‌పై వారు దాడి చేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

తమిళనాడులోని తేని (Theni) జిల్లాలో దీపావళి వేడుకల సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టపాసులు కాల్చడాన్ని అడ్డుకున్నారన్న కక్షతో దుండగులు జరిపిన దాడిలో ఓ సబ్-ఇన్స్పెక్టర్ (SI) ప్రాణాలు కోల్పోయారు. తేని జిల్లాలోని సమాధర్మపురంలో కొందరు యువకులు పబ్లిక్ రోడ్డును బ్లాక్ చేసి మందుగుండు సామాగ్రి (టపాసులు) కాల్చడంతో పాటు సోషల్ మీడియా రీల్స్ కోసం వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. తేని జిల్లా డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ సబ్-ఇన్స్పెక్టర్ సెంథిల్ కుమార్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో.. రద్దీగా ఉండే రోడ్డుపై కొందరు యువకులు బాణసంచా కాల్చడాన్ని గమనించారు.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరోచోటికి వెళ్లాలని వారికి సూచించారు. అప్పటికీ వాళ్లు మాట వినకపోవడంతో వారి చర్యలను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేయడానికి ప్రయత్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే.. మత్తులో ఉన్న ఆ యువకులు.. ఎస్ఐపై ఒక్కసారిగా దాడికి దిగారు.. ఆఫీసర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.. దీంతో సెంథిల్ కుమార్ కిందపడిపోయారు.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సెంథిల్ కుమార్‌ను వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే తేని ఎస్పీ ప్రవీణ్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా భారీగా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. నిందితుల గుర్తింపు కోసం చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు తేని జిల్లా ఎస్పీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
