AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govardhan Puja Katha: ఇంద్రుడి అహంకారాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ కథ తెలుసా?

Govardhan Puja 2026: దీపావళి మరుసటి రోజు జరుపుకునే గోవర్ధన పూజ వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. ఒకప్పుడు ఇంద్రుడి ఆగ్రహానికి గురైన బ్రజవాసులను శ్రీకృష్ణుడు ఎలా రక్షించాడు? గోవర్ధన పర్వతాన్ని ఎందుకు పూజించడం ప్రారంభించారు? ఈ పండుగ విశిష్టత, దాని వెనుక ఉన్న కథ తెలుసుకుందాం.

Govardhan Puja Katha: ఇంద్రుడి అహంకారాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ కథ తెలుసా?
Govardhan Puja Story
Janardhan Veluru
|

Updated on: Nov 09, 2026 | 12:41 PM

Share

కార్తీక మాసంలో దీపావళి మరుసటి రోజు జరుపుకునే పండుగల్లో గోవర్ధన పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గోవర్థన పర్వతానికి చేసే పూజ వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది.  ఈ గోవర్ధన పూజ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? శ్రీకృష్ణుడు ఇంద్రుడి పూజను ఎందుకు నిలిపివేశాడు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణగాథ గురించి తెలుసుకుందాం..

రామసేతు నిర్మాణంతో ముడిపడిన గోవర్ధన పర్వత కథ

పురాణ కథనం ప్రకారం.. రామసేతు నిర్మాణ సమయంలో హనుమంతుడు పర్వతాలను తీసుకొస్తూ గోవర్ధన పర్వతాన్ని కూడా తీసుకువచ్చాడు. అయితే అప్పటికే సేతు నిర్మాణం పూర్తయిందని తెలుసుకున్న హనుమంతుడు, గోవర్ధనుడిని అక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో గోవర్ధనుడు బాధపడ్డాడు. శ్రీరాముడి సేవలో పాల్గొనే అవకాశం దక్కలేదని విచారం వ్యక్తం చేశాడు. అప్పుడు శ్రీరాముడు.. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు గోవర్ధన పర్వతానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, ప్రజలు దానిని పూజిస్తారని వరమిచ్చినట్లు పురాణగాథ చెబుతోంది.

ఇంద్రుడి పూజను ఎందుకు ఆపించారు?

మథుర ప్రాంతంలోని ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాలు కురిపించే దేవుడిగా భావించి ఇంద్రుడిని పూజించేవారు. శ్రీకృష్ణుడి పెంపుడు తండ్రి నందుడు కూడా ఈ పూజలో పాల్గొనేవారు. ఒకసారి శ్రీకృష్ణుడు ఇంద్రుడిని ఎందుకు పూజిస్తున్నారని నందుడిని ప్రశ్నించాడు. ఇంద్రుడి అనుగ్రహంతో వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయని, పశువులకు పచ్చిక దొరుకుతుందని, అందుకే ఇంద్రుడిని పూజిస్తున్నామని నందుడు చెబుతాడు. అయితే శ్రీకృష్ణుడు ఈ సంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. తమ జీవనానికి ఆధారమైన గోవులు మేత మేసే గోవర్ధన పర్వతాన్ని పూజించాలని బ్రజవాసులకు సూచించాడు. దీంతో ప్రజలు ఇంద్రుడి పూజకు బదులుగా గోవర్ధన పర్వతానికి పూజలు చేయడం ప్రారంభించారు.

శ్రీకృష్ణుడిపై ఆగ్రహంతో భారీ వర్షాలు కురిపించిన ఇంద్రుడు

తనకు జరగాల్సిన పూజను నిలిపివేయడాన్ని ఇంద్రుడు అవమానంగా భావించాడు. ఆగ్రహంతో బ్రజ ప్రాంతంపై భారీ వర్షాలు కురిపించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమను రక్షించాలని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. బ్రజవాసులందరూ తమ పశువులతో సహా ఆ పర్వతం కింద ఆశ్రయం పొందారు. ఎన్ని రోజులు వర్షాలు కురిసినా వారికి ఎలాంటి ప్రమాదం కలగలేదు. ఈ సమయంలో బ్రజవాసులు శ్రీకృష్ణుడికి రకరకాల ఆహార పదార్థాలను తయారుచేసి నైవేద్యంగా సమర్పించారు. ఈ సంప్రదాయమే క్రమంగా అన్నకూట్ భోగంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు.

ఇంద్రుడి క్షమాపణ.. గోవర్ధన పూజ ప్రారంభం

శ్రీకృష్ణుడి మహిమను తెలుసుకున్న ఇంద్రుడు తన తప్పును గ్రహించాడు. అనంతరం శ్రీకృష్ణుడిని క్షమాపణ కోరాడు. బ్రజవాసులను రక్షించిన శ్రీకృష్ణుడు ఇకపై గోవర్ధన పర్వతాన్ని పూజించాలని, దానికి ప్రదక్షిణలు చేయాలని సూచించినట్లు పురాణగాథ చెబుతోంది. అప్పటి నుంచి గోవర్ధన పూజ రోజున పర్వతాకారంలో గోవర్ధనుడి ప్రతిమను రూపొందించి పూజించడం, అన్నకూట్ నైవేద్యాన్ని సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ రోజున గోవర్ధనుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఇంట్లో అన్నధాన్యాలకు, సంపదకు లోటు ఉండదని భక్తుల విశ్వాసం.

(గమనిక: ప్రచారంలో ఉన్న హిందూ నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా గోవర్ధన పూజకు సంబంధించిన ఈ పురాణగాథను ఇవ్వడం జరిగింది)

Follow Us