Tamil Nadu rains: తమిళనాడులో వర్ష బీభత్సం.. నీట మునిగిన కన్యాకుమారి.. 20 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో చెన్నైతో పాటు మరో 19 జిల్లాల్లోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Tamil Nadu Heavy Rains: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా దంచికొడుతోన్న కుండపోత వర్షాలతో దక్షిణ తమిళనాడు అతలాకుతలమవుతోంది. కన్యాకుమారి, కోయంబత్తూరు, తిరునల్వేలి జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కన్యాకుమారి టౌన్ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తిరునల్వేలి జిల్లాలో అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు లోతట్టు ప్రాంత లప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో చెన్నైతో పాటు మరో 19 జిల్లాల్లోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి సెలవులు ప్రకటించింది. చెంగల్‌పేట్, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, రాణిపేట్, తిరుచ్చి, అరియలూర్, నమక్కల్ కడలూర్, మైలాడుతురై, వెల్లూరు, కరూర్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది సర్కార్.
అటు, కోయంబత్తూరులో పాలారు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పాలారు నది వరద ఉధృతికి అనమలై ప్రాంతం మొత్తం నీట మునిగింది. కోయంబత్తూరు ఆంజనేయస్వామి టెంపుల్‌ను వరద చుట్టుముట్టడంతో భక్తులు నీటిలో చిక్కుకుపోయారు. వాళ్లందరినీ తాళ్ల సాయంతో ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్ రక్షించాయి. అయితే, మరో 24గంటలపాటు తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. రానున్న 24 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. “తర్వాత, ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, తదుపరి 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రాంతం నుండి కొమోరిన్ ప్రాంతం, పరిసర ప్రాంతాల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు తీరం మీదుగా సగటు సముద్ర మట్టం వద్ద ఉదయం ద్రోణి కొనసాగుతోంది, ”అని ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో ఐఎండీ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
మరోవైపు, అధికారులను అప్రమత్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం.. అధికారులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించింది. చెన్నైలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ సంస్థ అంచనా వేసింది. నగరంలో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 29˚C మరియు 25˚C ఉంటాయి. చెన్నైలోని నుంగంబాక్కం వాతావరణ కేంద్రంలో బుధవారం రాత్రి 8.30 గంటలకు వరకు 24.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మీనంబాక్కం స్టేషన్‌లో 43మిమీ వర్షపాతం నమోదైంది. కడలూరులో 59.2 మిమీ, కోయంబత్తూరులో 7.0 మిమీ, మరియు పుదుచ్చేరిలో 57.0 మిమీ వర్షపాతం అదే సమయంలో నమోదైంది.
భారీవర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశముందని, వర్షం వల్ల ప్రాణనష్టం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. భారీవర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ప్రస్తుతం 121 మల్టీ స్పెషాలిటీ భద్రతా కేంద్రాలు, 5,106 పునరావాస శిబిరాలు సిద్ధం చేశామని, నీటమునిగిన పంట నష్టం అంచనా వేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసినట్టు మంత్రి రామచంద్రన్ తెలిపారు.