సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత బాటలోనే విజయ్..
తమిళనాడులో ఉచితాల జాతర మరో లెవల్‌కి చేరింది. ఇప్పటికే డీఎంకే ఫ్రీ స్కీమ్‌లను అమలు చేస్తుండగా.. అన్నాడీఎంకే అంతకుమించి హామీలను ప్రకటించింది. కొత్తగా బరిలోకి దిగుతున్న టీవీకే చీఫ్ విజయ్ కూడా తాను ఉచిత పథకాలకు వ్యతిరేకం కాదని ప్రకటించారు. గతంలో ఉచితాలను ప్రకటించిన విజయ్ ఇప్పుడు అదే బాట ఎందుకు పట్టారు..? తమిళ రాజకీయం ఎలా నడుస్తుంది..? అనేది తెలుసుకుందాం..

తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు కూడా రసవత్తరంగా మారుతున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని పనిలో ప్రతిపక్షాలు ఉంటే.. ఓటర్లు చేజారి పోకుండా అధికార డీఎంకే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఇక కొత్తగా పార్టీని స్థాపించిన నటుడు విజయ్ కూడా ఇదే బాటలో వెళ్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉచిత పథకాలకు పుట్టినిల్లుగా తమిళనాడును చెబుతుంటారు. ఆ మాటకొస్తే దేశంలోని ముందుగా ఉచిత పథకాలు పురుడు పోసుకుంది ఇక్కడే అని చెప్పొచ్చు.. ఉచిత కలర్ టీవీలు, ఉచిత మిక్సీ గ్రైండర్లు, ఫ్యాన్లు, విద్యార్థులకు లాప్‌టాప్‌లు, అమ్మ క్యాంటీన్ల పేరుతో తక్కువ ధరలకు భోజనం.. వృద్ధాప్య పెన్షన్లు.. ఉచిత బస్సు పథకాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. ఇవన్నీ ముందుగా మొదలైంది తమిళనాడు లోనే.
దశాబ్దాలుగా అక్కడ ప్రజలను పాలించిన ప్రస్తుత అధికారంలో ఉన్న డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలు పోటీలు పడి ప్రతి ఎన్నికల్లో ఉచిత పథకాల హామీలు ఇస్తూ పోతున్నారు. అలా జయలలిత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో విద్యార్థులకు లాప్‌టాప్‌ల పంపిణీ జరిగింది. తాజాగా డీఎంకే ప్రభుత్వం 20 లక్షల మందికి విద్యార్థులకు లాప్‌టాప్‌ల పంపిణీ ఏర్పాటు పూర్తి చేసింది.. డీఎంకే తమ మేనిఫెస్టో లోని అంశాలను అమలు చేయడంతో పాటు గతంలో జయలలిత ప్రవేశపెట్టిన పథకాలను కూడా కొనసాగిస్తూ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తుండగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న డీఎంకే బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి వెళుతోంది. ఇప్పటిదాకా తమిళనాడులో మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఉండగా.. తాము అధికారంలోకొస్తే పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మొదటి విడత మేనిఫెస్టోలో ప్రకటించింది.
డీఎంకే ప్రస్తుతం తమిళనాడులో మహిళలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తోంది.. తమను గెలిపిస్తే రూ.2000 అందిస్తామని అన్నాడీఎంకే ప్రధాని కార్యదర్శి పళనిస్వామి ప్రకటించారు. ఇల్లు లేని వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని మరో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు 125 రోజులు ఉన్న ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని కూడా చెప్పారు. 5 లక్షల మంది మహిళలకు 20వేల సబ్సిడీతో టూ వీలర్‌ను కూడా ఇస్తామని చెప్పారు. డీఎంకే అమలుచేస్తున్న పథకాలను కొనసాగిస్తామని తెలిపింది.
ఇక తమిళనాడులో మార్పు కోసం ప్రజల కోసం అంటూ కొత్తగా పార్టీని స్థాపించిన నటుడు విజయ్ కూడా ఉచిత పథకాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం 12 మందితో మేనిఫెస్టో కమిటీని కూడా నియమించారు. ఇప్పటికే ప్రతి ఇంటికి టూ వీలర్ ఉండాలన్న లక్ష్యంతో తమ పార్టీ పనిచేస్తుందని విజయ్ ప్రకటించారు. అలాగే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. త్వరలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న విజయ్ అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఉచిత పథకాలతో పాటు మరిన్ని ఆకర్షణనీయమైన ఉచితలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో విజయ్ తమిళనాడులో ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. విజయ్ నటించిన సర్కార్ సినిమాలో ఉచితాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఇచ్చిన మిక్సీలు, గ్రైందర్లు మంటల్లో వేసిన సన్నివేశాలు ఉన్నాయి. అప్పట్లో అది పెద్ద దుమారం రేపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను తమ వైపు తిప్పుకోవాలంటే ఉచితాలే బెస్ట్ అని విజయ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
