PM Kisan: పీఎం కిసాన్ సాయం రూ.8 వేలకు పెంపు..? బడ్జెట్‌లో కీలక నిర్ణయం దిశగా కేంద్రం..!
Union Budget 2026: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు వరాలు ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ బడ్జెట్‌లో రైతులకు ఉపయోగపడేలా కేంద్రం ఏవోక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. దీంతో ఈ సారి పీఎం కిసాన్ సాయంపై నిర్ణయం ఉంటుందని చాలామంది ఆశిస్తున్నారు. రైతులు పెంపు కోసం ఎదురుచూస్తున్నారు.

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దేశంలోని రైతులకు గుడ్‌న్యూస్ చెప్పనుందా..? పీఎం కిసాన్ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు అందిస్తున్న రూ.6 వేల ఆర్ధిక సాయాన్ని పెంచనుందా..? రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పెంపుపై బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందా..? త్వరలో తమిళనాడు, పశ్చిమబెంగాల్ లాంటి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న క్రమంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోనుందా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుండగా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా సాయాన్ని పెంచలేదు. రైతులకు పెట్టుబడి ఖర్చులు, వ్యయాలు పెరుగుతున్న క్రమంలో పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేంద్రం త్వరలో పెంచబోతుందంటూ గతంలో కూడా వార్తలు వినిపించాయి.
పీఎం కిసాన్ సాయం రూ.8 వేలకు పెంపు..?
పీఎం కిసాన్ పథకం కింద ప్రస్తుతం రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. దీనిని రూ.8 వేలకు పెంచే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్లు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాల ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో రైతులకు ఇచ్చే సాయం సరిపోవడం లేదు. దీంతో బయటి వ్యక్తుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం లేదా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. దీంతో పీఎం కిసాన్ సాయం పెంపు కోసం రైతులు ఎప్పటినుంచో ఎదురుస్తున్నారు. సాయం పెంచడం వల్ల రైతులకు పెట్టుబడికి డబ్బులు అందటమే కాకుండా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు బలం చేకూరనుంది. రైతుల కొనుగోలు శక్తి పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు పెరుగుతాయి. వ్యవసాయంపై ఆధారపడి వ్యాపారాలు చేసే ఎరువులు, ట్రాక్టర్లు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల వారికి ఉపయోపడుతుంది.
ఈ సారి బడ్జెట్‌లో ఉంటుందా..?
2018 డిసెంబర్‌లో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సాయాన్ని పెంచుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఏపీ ప్రభుత్వం అన్నదాత సుభీభవ పథకాల ద్వారా ఇచ్చే సాయాన్ని పెంచాయి. ఇక దేశంలోనే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వీటి సాయాన్ని పెంచాయి. కానీ కేంద్ర ంఇప్పటివరకు పెంచలేదు. దీంతో ప్రతీసారి బడ్జెట్ సమయంలో పీఎం కిసాన్ సాయం పెంచుతారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఈ సారి బడ్జెట్‌లో అయినా పీఎం కిసాన్ సాయం పెంచుతారేమోనని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ పీఎం కిసాన్ సాయం పెంచితే రైతులకు ప్రయోజనకరంగా ఉండనుంది.
