పెన్సిల్ కోసం గొడవ.. స్నేహితుడిపై కొడవలితో దాడి చేసిన 8వ తరగతి విద్యార్థి!
తమిళనాడులోని తిరునల్వేలిలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి పెన్సిల్ విషయంలో జరిగిన వివాదం తర్వాత తన క్లాస్‌మేట్‌పై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో సహవిద్యార్థితోపాటు అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. తన స్కూల్ బ్యాగులో కొడవలిని దాచిపెట్టి తెచ్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తమిళనాడులో జరిగిన ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ని తిరునల్వేలిలో ఒక పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి తన బ్యాగులో దాచుకున్న కొడవలిని తీసుకురావడమే కాకుండా, అదే కొడవలితో తన క్లాస్‌మేట్‌పై దాడికి తెగబడ్డాడు. ఈ సమయంలో జోక్యం చేసుకోవడానికి వచ్చిన ఉపాధ్యాయుడిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడితోపాటు ముగ్గురిని చికిత్స నిమిత్తంఆసుపత్రిలో చేర్చారు.
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, నిందితుడైన విద్యార్థిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తిరునెల్వేలి జిల్లాలోని పాలయంకోట్టైలోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థుల మధ్య పెన్సిల్ విషయంలో వివాదం జరిగింది. ఈ వివాదం జరిగినప్పటి నుండి, నిందితుడైన విద్యార్థి చాలా కోపంగా రగిలిపోతున్నాడు. బాధిత విద్యార్థితో మాట్లాడటం మానేశాడు. అదే క్రమంలో, మంగళవారం(ఏప్రిల్ 15) తన ఇంటి నుండి ఒక కొడవలిని స్కూల్ బ్యాగులో దాచిపెట్టి తీసుకువచ్చాడు. అవకాశం కోసం ఎదురుచూసి, బాధిత విద్యార్థిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఉపాధ్యాయుడిపై దాడికి తెగబడ్డాడు.
ఈ దాడిలో బాధిత విద్యార్థి శరీరంపై మూడు చోట్ల కొడవలితో లోతైన గాయాలు అయ్యాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడి సమయంలో ఒక ఉపాధ్యాయుడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో నిందితుడు ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. దీని కారణంగా ఆ ఉపాధ్యాయుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతానికి, ముగ్గురినీ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ టీచర్‌కు బ్యాండేజ్ వేసిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇద్దరు విద్యార్థుల గాయాలు తీవ్రంగా ఉండటంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడైన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతను పోలీసు కస్టడీలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడైన విద్యార్థిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసిన తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తామన్నారు. ఈ విషయంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు, ఈ సంఘటనపై బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్థి కొడవలిని పట్టుకుని పాఠశాలకు ఎలా వచ్చాడనే ప్రశ్న తలెత్తుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..