Robo Shankar: హోం టూర్ వీడియో చేసి చిక్కుల్లో పడ్డ నటుడు.. ఏకంగా రూ.2.5 లక్షల ఫైన్
చెన్నైలోని తన నివాసంలో రెండు అలెగ్జాండ్రిన్ చిలుకలను ఉంచినందుకు నటుడు రోబో శంకర్‌కు తమిళనాడు వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సోమవారం రూ.2.5 లక్షల జరిమానా విధించింది.
ఈ మధ్య హోమ్ టూర్స్ ఎక్కవైపోయాయి. చిన్నా చితక యూట్యూబర్స్ దగ్గర్నుంచి పెద్ద పెద్ద సినిమాల ఆర్టిస్టుల వరకు హోమ్ టూర్స్ అంటూ తమ ఇళ్లను చూపిస్తూ.. వీడియోలు చేస్తున్నారు. ఇలానే ఓ హోమ్ టూర్ వీడియో చేసిన తమిళ నటుడు రోబో శంకర్ చిక్కుల్లో పడ్డాడు. అతడికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రూ.2.5 లక్షల ఫైన్ వేసింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సాలిగ్రామంలో ఉంటున్న నటుడు రోబో శంకర్ కొద్ది రోజుల క్రితం తన హోమ్ టూర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.
ఈ క్రమంలోనే. . అలెగ్జాండ్రిన్ పారాకీట్ అనే జాతి చిలుకలు.. అతడి ఇంట్లో పంజరంలో ఉన్నట్లు తమిళనాడు వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు. గురువారం అతడి ఇంట్లో తనిఖీలు చేసి.. 2 చిలుకలను సంరక్షించి.. తీసుకెళ్లి గిండిలోని పార్కులో అప్పగించారు. అయితే ఆ సమయంలో రోబో శంకర్, ఆయన అర్థాంగి శ్రీలంకలో ఉండటంతో దర్యాప్తుకు సహకరించాలని నోటీసులు జారీ చేశారు. తాజాగా వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఎదుట రోబో శంకర్ హాజరై వివరణ ఇచ్చారు. తన భార్య ఫ్రెండ్ 3 సంవత్సరాల క్రితం ఈ చిలుకలను ఇచ్చినట్లు వివరించారు. వీటిని పెంచేందుకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ తీసుకోవాలన్న విషయం తెలియదని, ఇందుకు క్షమాపణ కోరుతున్నట్లు చెప్పాడు. దీంతో అధికారులు వారిపై కేసు ఫైల్ చేయకుండా రూ.2.5 లక్షల ఫైన్ వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..