Governors Case Verdict: రాష్ట్రపతి మూడు నెలల్లో బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రాష్ట్ర శాసనసభల నుంచి గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భారత సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలపరిమితిలోకా నిర్ణయం తీసుకోకపోతే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ‘తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ తమిళనాడు గవర్నర్’ కేసులో జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది.

రాష్ట్ర శాసనసభల నుంచి గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భారత సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలపరిమితిలోకా నిర్ణయం తీసుకోకపోతే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ‘తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ తమిళనాడు గవర్నర్’ కేసులో జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం, గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన బిల్లుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు తీర్పులో పేర్కొంది. ఈ కాలపరిమితిని అతిక్రమిస్తే, ఆలస్యానికి సముచిత కారణాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించింది. అలాంటి కారణాలు తెలపకపోతే, రాష్ట్రాలు రిట్ ఆఫ్ మాండమస్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
ఒకవేళ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్రపతి భావిస్తే.. ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు సలహాను కోరాలని కోర్టు సూచించింది. రాజ్యాంగ విరుద్ధతను నిర్ధారించే బాధ్యత రాష్ట్రపతి కంటే న్యాయస్థానాలదేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంలో, రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుకు సిఫార్సు చేయడం తప్పనిసరని పేర్కొంది.
తమిళనాడు కేసు నేపథ్యం: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ బిల్లుల్లో ఒకటి 2020 నుంచి పెండింగ్‌లో ఉంది. గవర్నర్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని, బిల్లులను తిరిగి శాసనసభకు పంపకుండా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం చట్టవిరుద్ధమని కోర్టు తెలిపింది. ఈ చర్యలను రద్దు చేస్తూ, ఈ బిల్లులను గవర్నర్‌కు తిరిగి పంపిన తేదీ నుంచి ఆమోదితమైనట్లు భావించాలని ఆదేశించింది.
రాష్ట్రపతి అధికారాలపై స్పష్టత: బిల్లును శాశ్వతంగా పెండింగ్‌లో ఉంచే హక్కు రాష్ట్రపతికి లేదని, అలాంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి తిరస్కరించినప్పుడు, అది ఏకపక్షంగా లేదా దురుద్దేశంతో జరిగిందని నిరూపితమైతే, ఆ చర్యను కోర్టులో సవాలు చేయవచ్చని తీర్పు స్పష్టం చేసింది. అలాగే, రాష్ట్రపతి తిరస్కరణకు సముచిత కారణాలను తెలపకపోతే, అది దురుద్దేశంగా పరిగణించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.
రాష్ట్రాలతో సహకారం అవసరం: బిల్లులపై నిర్ణయం తీసుకునే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సహకరించాలని, కేంద్రం అడిగిన ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఈ సహకారం లేకపోతే, నిర్ణయ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉందని తెలిపింది.
ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడే తీర్పు: ఈ తీర్పు రాష్ట్ర శాసనసభల స్వయం ప్రతిపత్తిని కాపాడటమే కాకుండా, గవర్నర్లు, రాష్ట్రపతుల అధికార దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వెలువడింది. రాష్ట్రాల శాసన వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసేలా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేలా ఈ నిర్ణయం ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ తీర్పు రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయాన్ని పెంపొందించడంతో పాటు, రాజ్యాంగ సంస్థలు తమ విధులను సకాలంలో నిర్వర్తించేలా చేస్తుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఈ నిర్ణయం భారత రాజ్యాంగ చట్ట వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..