కేంద్ర వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న సంప్రదింపులు.. ఇవాళ విద్యావేత్తలతో త్రిసభ్య కమిటీ భేటీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిష్ఠంభన కొనసాగుతుంది. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారానికి నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని నియమించింది.

కేంద్ర వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న సంప్రదింపులు.. ఇవాళ విద్యావేత్తలతో త్రిసభ్య కమిటీ భేటీ
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 15, 2021 | 8:11 PM

Supreme court panel on farm acts : కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిష్ఠంభన కొనసాగుతుంది. కొత్త సాగుచట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపేసేందుకు సిద్ధమని కేంద్రం తమకు తెలిపింది. అయితే, చట్టాల నిలిపివేతకు తాము ఒప్పుకోమని.. వీటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారానికి నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని నియమించింది. మహారాష్ట్రకు చెందిన షెట్కారీ సంఘాటనా అధ్యక్షుడు అనిల్‌ ఘన్వాత్‌తో పాటు వ్యవసాయరంగ ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ, డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీ, భూపీందర్‌ సింగ్‌ మాన్‌‌ను నియమించింది. అయితే, ఈ కమిటీలో తొలుత నలుగురు సభ్యులను సుప్రీంకోర్టు నియమించగా, సభ్యుల్లో ఒకరైన భూపీందర్‌ సింగ్‌ మాన్‌‌ తప్పుకున్నారు. ప్రస్తుతం కమిటీలో ముగ్గురు సభ్యులు వివిధ రంగాల నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వివిధ రంగాల నిపుణులతో సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా విద్యావేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశమైనట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల బృందం వివిధ మార్గాల్లో ఇప్పటికి ఏడుసార్లు సమావేశమైంది. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన ఈ భేటీలో వ్యవసాయ చట్టాలపై విద్యావేత్తలు, వ్యవసాయ రంగ నిపుణుల తమ అభిప్రాయలను వెల్లడించారు. వారి నుంచి సలహాలను కూడా తీసుకున్నట్లు నిపుణుల బృందం వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో రెండు నెలలపాటు వీటి అమలును నిలిపివేస్తున్నట్లు భారత అత్యున్నత న్యాయస్థానం జనవరి 12న వెల్లడించింది. ఈ సమయంలో సాగుచట్టాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చించి నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తిచేయాలని నిపుణుల బృందానికి సూచించగా, ప్రస్తుతం ఆ కమిటీ అన్ని రాష్ట్రాల భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇదిలాఉంటే, ఆందోళన చేస్తోన్న రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటికే 11సార్లు చర్చలు జరిగాయి. ఆ సమయంలో సాగు చట్టాలను కొంతకాలం పాటు నిలుపుదల చేస్తామని కేంద్రం ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గకపోవడంతో ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది. గణతంత్ర దినోత్సవం నాటి హింసాత్మక ఘటనలతో మరోసారి చర్చలకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ నియమించింది.

ఇదీ చదవండి… పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం.. రాష్ట్రంలో కొత్తగా “మా కిచెన్” పథకానికి శ్రీకారం