కోవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. వచ్చే రెండు మూడు వారాల్లో 50ఏళ్లు పైబడినవారికి టీకాః హర్షవర్ధన్
రాబోయే రెండు మూడు వారాల్లో 50 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందించే ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
COVID-19 vaccine : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ’కరోనా వ్యాక్సిన్ ను ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు. కాగా, రాబోయే రెండు మూడు వారాల్లో 50 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందించే ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. మరో 18 నుంచి 20 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వెల్లడించారు.
కరోనా మహమ్మారి కట్టడిలో భారత్ ముందంజలో ఉందన్న మంత్రి హర్షవర్ధన్.. కోవిడ్-19కు సంబంధించి 18 నుంచి 20 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్, క్లినికల్, అడ్వాన్స్‌డ్ దశల్లో ఉన్నాయన్నారు. సుమారు 20 నుంచి 25 దేశాలకు మనం వ్యాక్సిన్ సరఫరా చేయనున్నామని వివరించారు. వ్యాక్సిన్‌కు సంబంధించి అపోహలు వీడాలని ప్రజలకు సూచించిన మంత్రి… కరోనా అంతమయ్యేంత వరకు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు.
ఇక, గడిచిన వారం రోజులుగా దేశవ్యాప్తంగా 188 జిల్లాల్లో ఒక్క కొవిడ్-19 కేసూ నమోదు కాలేదని వెల్లడించారు. 21 జిల్లాల్లో గత 21 రోజులుగా ఒక్క కేసూ లేదని తెలిపారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి… గుడ్ న్యూస్.. ఏపీలో అత్యల్ప స్థాయికి పడిపోయిన కరోనా కేసులు.. ఆ నాలుగు జిల్లాల్లో జీరో.!