UPSC: సివిల్స్ అభ్యర్థులకు సుప్రీం షాక్.. వారికి మరో అవకాశం కుదరదంటూ పిటిషన్ కొట్టివేత
Supreme Court: యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం.. అభ్యర్థులకు అదనపు అవకాశం ఇవ్వడం వీలుకాదంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు..
Supreme Court: యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం.. అభ్యర్థులకు అదనపు అవకాశం ఇవ్వడం వీలుకాదంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన పరీక్షతో వయసు గడువు ముగిసిన వారికి ఎలాంటి అదనపు అవకాశం కానీ.. మినహాయింపు కానీ ఉండదంటూ ధర్మాసనం బుధవారం వెల్లడించింది. కరోనావైరస్, లాక్‌డౌన్ వల్ల సివిల్స్ పరీక్ష సరిగా రాయలేకపోయామని, తమకు మరో అవకాశం కల్పించాలంటూ 2020తో చివరిసారి పరీక్షకు అర్హులైన అభ్యర్థులు సుప్రీంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. ఈనెల తొమ్మిదన తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ క్రమంలో ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు.. అభ్యర్థులు దాఖలు చేసిన ఆ పిటిషన్‌ను కొట్టిస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. 2020 నాటికి చివరి అవకాశం కోల్పోతున్న వారికి మరోసారి సివిల్స్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తొలుత అంగీకరించి.. ఈ నిర్ణయాన్ని సుప్రీంకు వదిలేసింది. కరోనా మహమ్మారి వల్ల పరీక్షలకు సరిగా ప్రిపేర్ కాలేకపోయామని, అందుకు మరో అవకాశమివ్వాలని పిటిషనర్లు కోరగా.. జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, ఇందూ మల్హోత్రా, అజయ్ రాస్తోగి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విధంగా తీర్పునిస్తూ ఉత్తర్వులిచ్చింది.
Also Read: