క్యారీ బ్యాగ్ కాదు.. టైమ్ బాంబ్.. కౌంట్ డౌన్ ఎప్పుడో మొదలైంది..!

నేల లేదా నీటిలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ విచ్ఛిన్నం కావడానికి వేల ఏండ్లు పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 నుంచి 50 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. వాటిలో 40 నుంచి 50 శాతం వరకు యూజ్‌ అండ్‌ త్రో ప్లాస్టిక్‌ వస్తువులే. భూమిపై నుంచి ఏటా దాదాపు 8 నుంచి 10 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మహాసముద్రాలలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్‌ కారణంగా భూమి, సముద్రాల్లో ఉండే జీవజాతుల ఉనికి ప్రమాదంలో పడుతోంది.

క్యారీ బ్యాగ్ కాదు.. టైమ్ బాంబ్.. కౌంట్ డౌన్ ఎప్పుడో మొదలైంది..!
Ocean Plastic
Follow us
K Sammaiah

| Edited By: Ravi Panangapalli

Updated on: Jun 28, 2024 | 8:47 AM

ప్లాస్టిక్‌.. ఈ ఒక్క పదమే ఇప్పుడు భూమండలాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఇందుగలడందులేడని సందేహము వలదు.. అనే పద్యం ప్లాస్టిక్‌కు అతికినట్లు సరిపోతుంది. మారుతున్న జీవన శైలిలో మనం రోజూ ప్లాస్టిక్‌ను తింటున్నాం.. ప్లాస్టిక్‌ను తాగుతున్నాం.. ప్లాస్టిక్‌ను విసర్జిస్తున్నాం అంటే అతిశయోక్తి కాదేమో. మానవ జీవితంతో ప్లాస్టిక్‌ ఫెవికోల్‌లా అతుక్కుపోయింది. విచ్చలవిడి ప్లాస్టిక్‌ వినియోగం వల్ల భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని ఇలా పంచభూతాలు కాలుష్య రక్కసి పిడికిలిలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కేవలం భూమండలాన్నే కాదు మహా సముద్రాలను సైతం ప్లాస్టిక్‌ భూతం మింగేస్తుండటంతో  పర్యావరణం పేలేందుకు సిద్ధంగా ఉన్న బాంబులా తయారవుతోంది. కాలువలు, నదుల ద్వారానే ఏటా దాదాపు ఒకటిన్నర కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 కల్లా దాదాపు 2.9 కోట్ల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు సముద్రాల్లో పేరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. మనుషులు చేసే విచ్చలవిడి తప్పిదానికి పర్యావరణం, జీవావరణం ప్రశ్నార్థకంగా మారుతోంది. సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణ, జీవవైవిద్య సమస్యగా మారుతోంది. మహాసముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం సమస్త జీవరాశులపై ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంది.

నేల లేదా నీటిలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ విచ్ఛిన్నం కావడానికి వేల ఏండ్లు పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 నుంచి 50 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. వాటిలో 40 నుంచి 50 శాతం వరకు యూజ్‌ అండ్‌ త్రో ప్లాస్టిక్‌ వస్తువులే. భూమిపై నుంచి ఏటా దాదాపు 8 నుంచి 10 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మహాసముద్రాలలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్‌ కారణంగా భూమి, సముద్రాల్లో ఉండే జీవజాతుల ఉనికి ప్రమాదంలో పడుతోంది. ఆహారంగా భావించి ప్లాస్టిక్ వ్యర్థాలను తినేసి అవి మరణిస్తున్నాయి. సముద్రంలో పెద్ద ఎత్తున కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా మూడింట రెండు వంతుల సముద్రపు జీవుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ప్లాస్టిక్ బ్యాగ్స్‌, డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ వస్తువులు సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. వాడిపడేసే ప్లాస్టిక్‌ వస్తువులు సంవత్సరాల పాటు విచ్చిన్నం కాకుండా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ రిజర్వాయర్లుగా సముద్రాలు మారిపోయాయి. నిమిషానికో ట్రక్‌ ప్లాస్టిక్‌ సముద్రంలో కలుస్తున్నదని పరిశోధకులు అంచనా వేశారు.

Plastic

సముద్రాలను ప్లాస్టిక్‌మయం చేస్తున్న దేశాలు

మహా సముద్రాల్లోకి ప్లాస్టిక్‌ ఎలా చేరుతుంది?

పరిశ్రమలు, జలమార్గాల ద్వారా టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ సముద్రంలో కలుస్తోంది. ఓడలు, చేపలు పట్టే పడవలు అవసరం లేని సరుకులను, ఇతర వ్యర్థాలను సముద్రంలోకి విసిరేస్తున్నారు. సముద్రం ఒడ్డున పేరుకుపోయే చెత్త కుప్పలను ‘గైర్స్‌’ అంటారు. బలమైన అలలు, సుడిగుండాలు ఒడ్డున ఉండే గైర్స్‌ను సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి ముంచేస్తుంటాయి. దీంతో సముద్ర గర్భంలోకి చెత్త చేరుతుంది. బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా ప్లాస్టిక్ వ్యర్థాలు సూక్ష్మప్లాస్టిక్‌గా మారి, నీటిపై తేలుతూ కలుషితం చేస్తున్నాయి. కొన్ని ప్లాస్టిక్‌ ముక్కలు చెత్తలో కలిసిపోయి వందల అడుగుల పొడవుతో ద్వీపంలా ఏర్పడతాయి. వీటినే ‘గ్రేట్ మెరైన్ గార్బేజ్ ప్యాచ్‌లు’ గా పిలుస్తారు. సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో ఎక్కువ భాగం ప్లాస్టిక్ ఫైబర్ వ్యర్థాలకు చెందినవే. సింథటిక్ వస్త్రాలను ఉతికినప్పుడు వెలువడే ఈ ఫైబర్ వ్యర్థాలు మురికి నీటి ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి.

రాతియుగం, లోహ యుగం గురించి మనం చదువుకున్నట్లుగానే భవిష్యత్తులో చరిత్రకారులు మనల్ని ప్లాస్టిక్ యుగానికి చెందినవారుగా చదువుకోవాల్సి ఉంటుంది. సముద్రపు అట్టడుగున పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సంఖ్య ప్రతి పదిహేనేళ్లకు రెట్టింపు అవుతోంది. సింథటిక్ వస్త్రాలను ఒకసారి ఉతికితే ఏడు లక్షల మైక్రోప్లాస్టిక్ ఫైబర్ వ్యర్థాలు వెలువడతాయి. వీటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే మురికినీటితోపాటు సముద్రంలోకి వదిలేస్తున్నారు. వ్యర్థజలాలను ఎలాంటి వడపోత లేకుండా వదిలేయడంవల్ల సాగర జలాల పర్యావరణం పెద్దఎత్తున కలుషితమవుతుంది.

Plastic

Plastic

ఇప్పటిదాకా సముద్రంలో ఎంత పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు డంప్ అయ్యాయంటే వీటిలో 2 లక్షల 69 వేల టన్నుల వ్యర్ధాలు సముద్రంపై తేలియాడుతూ ఉన్నాయి. సముద్రపు అట్టడుగున ప్రతి చదరపు కిలోమీటరుకు 4 వందల కోట్ల మైక్రోఫైబర్ పదార్థాలు పేరుకుని ఉన్నాయని ఒక అంచనా. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యాపారస్థుల ద్వారా ప్రతియేటా 5 లక్షల టన్నుల క్యారీ బ్యాగులు వినియోగదారులకు చేరుతున్నాయి. ఇవన్నీ ఒకసారి వాడి పారేసేవే. అంటే సగటున ప్రతి నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల క్యారీ బ్యాగులు వినిమయం అవుతున్నాయి. అనగా ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 150 క్యారీ బ్యాగులు వాడి పారేస్తున్నాడు.

ఇప్పటి వరకు వాడిపడేసిన క్యారీ బ్యాగ్‌ వ్యర్థాలను ఒకదాని పక్కన ఒకటి పేరిస్తే అవి దాదాపు 4,200 పొరలుగా మొత్తం భూమిని చుట్టేస్తాయని నిపుణుల అంచనా. ప్లాస్టిక్ వ్యర్ధాల కారణంగా ప్రతి ఏటా లక్ష వరకు సముద్రపు జంతువులు, 10 లక్షల పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ ప్రకృతిలో గాని, మన శరీరాల్లో గాని సహజంగా కలిసిపోదు. అందువల్ల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు జంతువులు చనిపోవడానికి కారణం అవుతున్నాయి. ప్లాస్టిక్ బ్యాగులను తిని చనిపోయిన జంతువుల కళేబరాలు భూమిలో కలిసిపోయినా, వాటి కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇవి మరెన్నో జంతువులకు ప్రాణహాని కలిగించే ప్రమాదం ఉంది.

Plastic Bag

Plastic Bag

ప్లాస్టిక్‌ ఎలా పుట్టింది?

వేడిని, ఒత్తిడినీ ఉపయోగించి ఏవిధంగానైనా మలచుకోగలిగే పాలిమర్ పదార్థంతో తయారైనదే ప్లాస్టిక్. తక్కువ అణు సాంద్రత వల్ల దేనికైనా అనువైనదిగా మలచుకోగలిగే గుణాన్ని (ప్లాస్టిసిటీ) కలిగి ఉండటం వల్ల ప్లాస్టిక్ అన్నారు. నిజానికి దీనిని బహువచన రూపంలో “ప్లాస్టిక్స్” అని వ్యవహరిస్తారు. బహుళ రసాయన మూలకాల సమ్మిళితంగా రూపొందినది కావడం వల్ల ఇలా అంటారు. తక్కువ విద్యుత్ వాహకత, ఎక్కువ దృఢత్వం లేకపోవడం, తక్కువ బరువు, పారదర్శకత ప్రధాన గుణాలుగా కలిగి ఉండటం వల్ల ఎన్నో వస్తువుల ఉత్పత్తిలో వాడటానికి ఉపయోగార్హమయ్యింది ప్లాస్టిక్. “ప్లాస్టిక్” అంటే తేలికగా వంగుతూ ఏ రూపంలోకి అయినా మార్చబడేది అని అర్థం. గొలుసులుగా పేర్చబడిన ఎన్నో అణువుల దారాలతో తయారు కాబడిన రసాయన సమ్మేళనాన్ని పాలిమర్స్ అంటారు. పైన చెప్పిన లక్షణాన్ని కలిగి ఉండటం వల్ల దానిని “ప్లాస్టిక్” అని వ్యవహరిస్తున్నారు.

1869లో జాన్ వెస్లే హ్యాట్ ఏనుగు దంతానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ పాలిమర్స్ ని కనుగొన్నాడు. అప్పుడప్పుడే బిలియర్డ్స్ ఆట ప్రాచుర్యం పొందుతోంది. దానికి అవసరమైన బల్లల తయారీలో ఏనుగు దంతాలను ఉపయోగించారు. దీనికి ఏనుగులను వధించాలి. కానీ హ్యాట్ ప్రత్తినుంచి తీసిన సెల్యులోజ్, కర్పూరం మిశ్రమంతో ఏనుగు దంతానికి ప్రత్యామ్నాయాన్ని రూపొందించాడు. దీనికి తరువాత కొన్ని మార్పులు చేసి ప్లాస్టిక్ ని రూపొందించారు. ఇది తొలి ప్లాస్టిక్. హ్యాట్ చేసిన ఆవిష్కరణ మానవ జీవితంలో, పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.

1907లో లియో బేక్ ల్యాండ్ అనే వ్యక్తి “బేక్ లైట్”ని ఆవిష్కరించాడు. ఇది పూర్తిస్థాయి కృత్రిమ ప్లాస్టిక్. ఇది అమెరికాలో విద్యుత్ తీగలకు పై తొడుగుగా ఎంతో ఉపయోగపడింది. ఈ బేక్ లైట్ ఉష్ణోగ్రతను నిరోధిస్తూ, దీర్ఘకాలం మన్నేది కావడంతో తక్కువ కాలంలోనే ప్రాచుర్యం పొంది పారిశ్రామిక రంగం దృష్టిని ఆకర్షించింది. హ్యాట్, బేక్ ల్యాండ్ సాధించిన అద్భుత విజయాలు కొత్త తరహా పాలిమర్స్ ఆవిష్కరించేందుకు ప్రేరణనిచ్చింది.

Plastic

Plastic

రెండవ ప్రపంచ యుద్ధంలో ప్లాస్టిక్‌

రెండవ ప్రపంచ యుద్ధ కాలం ప్లాస్టిక్ ఉపయోగాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తులు 300 శాతం పెరిగాయి. ప్రపంచ యుద్ధం ముగిసినా ప్లాస్టిక్ ఉత్పత్తులు, వినిమయం పెరుగుతూనే వచ్చాయి. ఫలితంగా సంప్రదాయ వస్తు వినియోగ స్థానాన్ని ప్లాస్టిక్ పూర్తిగా ఆక్రమించింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న సమయంలోనే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఉత్పన్నమయ్యే ఉపద్రవాలను కూడా గుర్తించారు. మిగిలిన వాటితో పోలిస్తే ప్లాస్టిక్ వస్తువులు ఎంతో చవక.. ఉపయోగించడానికి కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. అదే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఉత్పన్నమయ్యే విపరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. 1960లలోనే సముద్ర జలాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సాగర తీర ప్రాంతాలు కలుషితం కావడం ఒక్కటే సమస్య కాదు. ఈ కాలుష్యం తీరప్రాంతాల జనజీవనంతో పాటు ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పర్యావరణపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా, ఆర్ధికపరంగా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తీరప్రాంతాలు కలుషితం కావడం వల్ల ప్రతి ఏటా 13 వందల కోట్ల డాలర్ల విలువైన ప్రకృతి వనరులను నష్టపోతున్నాం. తీరప్రాంతాలను శుభ్రం చెయ్యాలన్నా, అక్కడి చెత్తను మరో చోట వేయాలన్నా కూడా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

Plastic

Plastic

ఆ దేశాల్లో ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు కఠిన శిక్షలు:

ఇప్పటికే బంగ్లాదేశ్, ఫ్రాన్స్ వంటి దేశాలు ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధించాయి. ఐర్లాండ్ ప్రభుత్వం ప్రతి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌పై 15 సెంట్ల పన్ను విధించింది. ఫలితంగా ఏడాది తిరిగేలోపు ఆ దేశంలో క్యారీ బ్యాగుల వాడకం 90 శాతానికి తగ్గిపోయింది. కెన్యాలో ప్లాస్టిక్ బ్యాగ్‌ల్లో సరుకులు ఇచ్చే దుకాణ యజమానులకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష లేదా 14 వేల డాలర్ల జరిమానా విధిస్తుంది. ఐరోపాలోని ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ 2030 నాటికి రీసైక్లింగ్ చేయాలనీ, ఇక ముందు ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తులు రీసైక్లింగ్ చేయడానికి వీలుగా ఉండాలనీ యూరోపియన్‌ యూనియన్‌ “ప్లాస్టిక్‌ స్ట్రాటజీ” ఏర్పాటు చేసుకున్నారు.ఇంగ్లాండులో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని 85 శాతం తగ్గించారు.

సాగర జలాలలో ప్రతి చదరపు మైలుకు 46 వేల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉన్నాయని ఒక అంచనా. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతగా శిధిలమైనప్పటికీ చివరికి అవి మైక్రో లేదా నానో ప్లాస్టిక్ వ్యర్ధాలుగా లేదా విష రసాయనాలుగా భూమిలో మిగిలిపోతాయే తప్ప ప్రకృతిలో సహజంగా కలిసిపోవు. ఎన్ని సంవత్సరాలైనా. ఒక టన్ను బరువున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను రీసైకిల్ చేయాలంటే 4 వేల అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. కానీ అంతే బరువున్న వాడేసిన ప్లాస్టిక్ కవర్లను తూకానికి అమ్మితే 32 అమెరికన్ డాలర్లే ధర పలుకుతుంది. కాబట్టి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ఉత్పత్తిని నిలిపి వేయడమే తగిన పరిష్కారం కాగలదు.

Plastic

Plastic

పునరుత్పత్తిపై ప్లాస్టిక్‌ ప్రభావం

ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో సగానికి పైగా యూస్‌ అండ్‌ త్రో వస్తువులే. వివిధ దేశాల్లో నిమిషానికి దాదాపు 10 లక్షలకు పైగా ప్లాస్టిక్‌ సీసాలు అమ్ముడవుతున్నాయంటే, ఎంత వేగంగా వ్యర్థాల గుట్టలు పేరుకుపోతున్నాయో తెలిసిపోతుంది. మనుషులు తమకు తెలియకుండానే ప్లాస్టిక్‌ను తింటున్నారు, తాగుతున్నారు. ప్లాస్టిక్‌ ముక్కల్ని మింగేస్తున్న సముద్ర జీవులను తినేవారి శరీరంలోకి అవి నేరుగా చేరుతున్నాయి. ఒక లీటరు నీటి సీసాలో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్‌ రేణువులుంటాయని అధ్యయనకారులు గుర్తించారు. మానవ శరీరంలోకి చొరబడుతున్న ప్లాస్టిక్‌ మానవ వృషణాల్లోకీ చేరి వీర్యకణాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని నిపుణులు పరీక్షల ద్వారా గుర్తించారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాలు శరీర కణజాలాన్ని, డీఎన్‌ఏను దెబ్బతీస్తాయని, వాటివల్ల క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ రక్తనాళాలను, గుండెను సైతం ప్లాస్టిక్‌ చావుదెబ్బ తీస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో పారేస్తున్న ప్లాస్టిక్‌ సంచుల వల్ల మూగజీవాలు మరణిస్తున్నాయి. చనిపోతున్న ఆవులు, గేదెల పొట్టలో 30 నంచి 40 కిలోల దాకా ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఒక్క 2024 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుపడతాయని ఎర్త్‌ యాక్షన్‌ సంస్థ లెక్కగట్టింది.

Ocean Plastic

Ocean Plastic

రీసైక్లింగ్‌లో ఆదర్శంగా జోషీమఠ్‌

ప్రపంచ వ్యాప్తంగా కేవలం 12 దేశాల కారణంగానే 60 శాతం ప్లాస్టిక్‌ కాలుష్యం పేరుకుపోతుంది. అందులో భారత్‌ కూడా ఒకటి. పర్యావరణానికి, జీవావరణానికి మరణశాసనంగా మారిన ప్లాస్టిక్‌ భూతాన్ని నియంత్రించాల్సిన నైతిక బాధ్యతను ఇండియాతో పాటు ఇతర దేశాలూ భుజానికెత్తుకోవాలి. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇటీవల కెనడాలో సమావేశం అయిన 175 దేశాలు కార్యాచరణలో ఫెయిల్‌ అయ్యాయి. ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చి, ఉమ్మడి కార్యాచరణ చేపట్టేంత సమయం లేదు. పాలిథీన్‌ ఉత్పత్తులు క్షీణించడానికి వెయ్యేళ్లయినా సరిపోవు. ఆలోగా లెక్కలేనన్ని దుష్పరిణామాలు వాటిల్లే ప్రమాదం ఉంది.

ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి రాబడి సృష్టించడం ఎలాగో ఉత్తరాఖండ్, జోషీమఠ్‌ మునిసిపాలిటీని ఆదర్శంగా తీసుకోవాలి. యాత్రికులు వాడి పారేసిన ఖాళీ బాటిళ్లను సేకరించి అక్కడి సిబ్బంది వాటిని ఇటుకలుగా మార్చి అమ్ముతున్నారు. సుమారు మూడు టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడం ద్వారా సుమారు కోటిన్నర రూపాయల ఆదాయం సమకూరుతుంది. చెన్నై, నొయిడా, కొచ్చి, ముంబయి, కోల్‌కతా వంటి చోట్ల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించి రహదారులు నిర్మిస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి డీజిల్‌ తయారీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్లాస్టిక్‌ రాకాసి కోరల నుంచి బయట పడాలంటే పౌరసమాజం చేతులు కలపాల్సిన ఆవశ్యకత ఉంది.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ